అలా అయితే జియోకు కష్టాలే

రిల‌య‌న్స్ జియోకు క‌ష్టాలు ఇప్పుడు అప్పుడే వీడ‌న‌ట్లు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే మరోటెలికాం సంస్థ భార‌తీ ఎయిర్‌టెల్ జియో నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తోంద‌ని ట్రాయ్ వ‌ద్ద మొర్ర‌పెట్ట‌గా.. ఆ సంస్థ‌కు చేదు అనుభ‌వ‌మే మిగిలింది. జియో ఆఫర్లు నిబంధ‌న‌ల‌కు లోబ‌డే ఉన్నాయ‌ని ట్రాయ్ తెలిపింది. అయినా ఎయిర్‌టెల్ మాత్రం త‌న పోరాటం ఆప‌లేదు. తాజాగా జియోపై కాంపిటీష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియాకు(సీసీఐ) ఫిర్యాదు చేసింది. జియో దీర్ఘ‌కాలంలో లాభాల‌ను ఆర్జించేందుకు నిబంధ‌న‌లు ఉల్లంఘించి వినియోగ‌దారుల‌కు ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తోంద‌ని, టెలికాం మార్కెట్‌ను అక్ర‌మంగా శాసించాల‌ని చూస్తోంద‌ని ఎయిర్‌టెల్ సీసీఐకు ఫిర్యాదు చేసింది. దీనివ‌ల్ల టెలికాం సంస్థ‌ల మ‌ధ్య నెలకొన్న ఆరోగ్య‌క‌ర‌మైన పోటీత‌త్వానికి హాని చేకూరుస్తోంద‌ని పేర్కొంది. ముందుగా ఉచిత డేటా వాయిస్ కాలింగ్ ఆఫ‌ర్స్ ఇచ్చి ఆ త‌ర్వాత మార్కెట్‌లో టెలికాం ప్రొవైడ‌ర్లు లేకుండా చేసి, మెజార్టీ మార్కెట్ త‌న గుప్పిట్లోకి వ‌చ్చాక వాయిస్ కాలింగ్ ఛార్జీలు విధించాల‌నే ప్ర‌ణాళిక జియో ర‌చిస్తోంద‌ని ఎయిర్‌టెల్ సంస్థ వెల్ల‌డించింది. ఎయిర్‌టెల్ ఇచ్చిన ఫిర్యాదును త్వ‌ర‌లోనే సీసీఐ విచార‌ణ జ‌ర‌ప‌నుంది. విచార‌ణ‌లో భాగంగా ఎయిర్‌టెల్ చేసిన ఆరోప‌ణ‌లు నిజ‌మ‌ని తేలితే జియోకు క‌ష్టాలు త‌ప్ప‌వ‌నే చెప్పొచ్చు. ఉచిత ఆఫర్ పైనా ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. మార్చి తర్వాత సరికొత్త ఆఫర్స్ తో జియో రానున్నట్లు ఇప్పటికే సంకేతాలు వచ్చాయి. రిలయన్స్ గ్యాస్ సిలిండర్ ను కూడా జియో కస్టమర్లకు యాడ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఎయిర్ టెల్ వ్యూహాత్మకంగా జియోను ఎదుర్కోవాలని అడుగులు వేస్తోంది. ఎయిర్ టెల్ ఆరోపణలు, విమర్శల్లో ఏ మాత్రం వాస్తవం ఉన్నట్లు విచారణ కమిషన్ అభిప్రాయపడినా.. ఉచిత ఆఫర్ పై ప్రభావం పడనున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.