ఆ వేలిముద్ర అమ్మది కాకపోతే.. మరెవరిది

జయలలిత మరణించిన రెండు నెలల తర్వాత.. ఆస్పత్రిలో చేరిన 115 రోజుల తర్వాత మొదటిసారి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చిన అపోలో ఆస్పత్రి డాక్టర్లు.. విలేకరుల ప్రశ్నలకు ఖంగుతిన్నారు. వరస ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయ్యి.. అతిపెద్ద నిజాన్ని తప్పు అని తేల్చారు. సెప్టెంబర్ 22వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో జయలలిత ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. నవంబర్ 19వ తేదీన తమిళనాడులోని తంజావూర్, అరవకురిచి, తిరుపరాంకుంద్రం నియోజకవర్గాల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో.. పార్టీ బి.ఫాంపై అమ్మ సంతకం చేయాల్సి ఉంది. ఆస్పత్రిలో ఉన్న పార్టీ అధినేత్రి.. సంతకం చేయలేని స్థితిలో ఉన్నది కాబట్టి.. వేలిముద్ర వేసిన బి.ఫాం పేపర్స్ ఈసీకి పంపారు. విలేకరుల సమావేశంలో జయలలిత వేలిముద్రలు వేశారా అన్న ప్రశ్నకు.. డాక్టర్లు నో అని చెప్పారు. మెడికల్ ట్రీట్ మెంట్ లో జయలలిత నుంచి ఎలాంటి వేలి ముద్రలు తీసుకోలేదు.. ఆ అవకాశం ఇవ్వలేదని డాక్టర్ బాబు చెప్పటం విశేషం. ఈసీకి ఇచ్చిన బి.ఫాం కాగితాల్లోని వేలిముద్ర జయలలితది కాకపోతే.. అది ఎవరిది అనేది ఇప్పుడు సంచలనం అయ్యింది. ఆస్పత్రిలో పక్కనే ఉన్న శశికళకు తెలియకుండా ఎవరైనా జయతో వేలిముద్ర వేయించారా అనేది కూడా ఆసక్తికరం. జయ వేలిముద్ర కాకపోతే.. తప్పుడుది అయితే ఇప్పుడు ఈసీ ఎలా చర్యలు తీసుకుంటుంది.. మళ్లీ ఎన్నికలకు వెళుతుందా అనేది ఆసక్తికర అంశం.