పానీపూరీలో టాయ్‌లెట్ క్లీన‌ర్

ఫాస్ట్ ఫుడ్ పేరుతో ప్ర‌జ‌ల ఆరోగ్యాల‌తో చెల‌గాటం ఆడుకుంటున్నారు కొంద‌రు ఫాస్ట్ ఫుడ్ య‌జ‌మానులు. నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించే కేవ‌లం డ‌బ్బే ప‌ర‌మావ‌ధిగా భావిస్తున్న కొంద‌రు క‌నీస ఆహార భ‌ద్ర‌త‌ను పాటించ‌డం మ‌రిచిపోతున్నారు. తాజాగా గుజ‌రాత్‌లో పానీపూరి అమ్మేవాడు అందులో టాయ్‌లెట్ క్లీన‌ర్ క‌లుపుతున్న‌ట్లు ఆహార ప‌రీక్ష ల్యాబ‌రేట‌రీ అధికారులు ధృవీక‌రించారు.

అహ్మ‌దాబాద్‌కు చెందిన చేత‌న్ నాంజీ అనే వ్య‌క్తి పానీపూరీ సెంట‌ర్‌ను న‌డుపుతున్నాడు. పానీపూరీ టేస్ట్ వేరుగా ఉండ‌టంతో అక్క‌డి స్థానికులు చేత‌న్‌ను నిల‌దీశారు. వారిపై  మాట‌ల‌తో ఎదురుదాడికి దిగాడు. పానీపూరీలు అమ్మ‌గా మిగిలిన వ్య‌ర్థాన్ని అంతా రోడ్డుపైనే పోసి పాద‌చారుల‌కు తీవ్ర ఇబ్బంది క‌లిగించేవాడు. దీంతో స్థానికులు అహ్మ‌దాబాద్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ అధికారుల‌కు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు ప‌లుమార్లు హెచ్చ‌రించిన‌ప్ప‌టికీ చేత‌న్ తీరు మార‌క‌పోవ‌డంతో మున్పిప‌ల్ అధికారులు పానీపూరీల‌ను, అందులోకి వినియోగించే నీటిని ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేట‌రీకి పంపించారు.

పానీపూరీని ప‌రీక్షించిన ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేట‌రీ చేత‌న్ టాయ్‌లెట్ క్లీనర్ వాడిన‌ట్లు నిర్ధారించింది. టాయ్‌లెట్ క్లీన‌ర్‌లో వినియోగించే ఆక్సాలిక్ యాసిడ్ అధిక‌మోతాదులో ఉండ‌టంతో చేత‌న్ బుక్ అయ్యాడు. స్థానిక కోర్టు 6నెల‌లు జైలు శిక్ష విధించింది.