స‌స్య‌శ్యామ‌ల తెలంగాణ‌..! -ప‌ల్లె ర‌వి కుమార్‌

స‌ముద్రంలో వృథాగా క‌లిసిపోతున్న వేలాది టీఎంసీల గోదావ‌రి జ‌లాల‌ను వినియోగించుకోవ‌డం కోసం తెలంగాణ ప్ర‌భుత్వం మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవ‌డం ఒక చారిత్రాత్మ‌కం. రెండు రాష్ట్రాల ఆధునిక చ‌రిత్ర‌లో ఇదొక మ‌హ‌త్త‌ర ఘ‌ట్టం. ఐదున్న‌ర ద‌శాబ్ధాలుగా సాగిన తీవ్ర నిర్ల‌క్ష్యం, అణ‌చివేత‌, దోపిడి, వివ‌క్ష‌ల మూలంగా తెలంగాణ సాగునీటి రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్ట‌బ‌డింది. దీనికి తోడుగా నిత్యం క‌రువు, కాట‌కాలు.. ప‌ర్య‌వ‌సానంగా అప్పులు, ఆత్మ‌హ‌త్య‌ల‌తో రైతాంగం త‌ల్ల‌డిల్లుతున్న‌ది. ఈ నేప‌థ్యంలో పొరుగు రాష్ట్రాల‌తో ఘ‌ర్ష‌ణాత్మ‌క వైఖ‌రి విడ‌నాడి, ప‌ర‌స్ప‌ర స‌హ‌కార దోర‌ణితో చ‌ర్చ‌లు-సంప్ర‌దింపుల ద్వారా వివాదాల‌ను ప‌రిష్క‌రించుకోవ‌డం ప్ర‌తిపాదిత సాగునీటి ప్రాజెక్టులను స‌త్వ‌ర‌మే పూర్తి చేసుకోవ‌డానికి మార్గం సుగ‌మం చేసింది. నెర్రెలు బారిన తెలంగాణ బీడు భూముల‌ను స‌స్య‌శ్యామ‌లం చేసేందుకు, సాగునీటి రంగం ద‌శ‌-దిశ‌ను మార్చే అపురూప‌మైన ఘ‌ట్టం మార్చి8న ముంబై వేదిక‌గా ఆవిష్కృత‌మైంది. నీటికోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా సుదీర్ఘ పోరాటాలు జ‌రుగుతున్న ఈ రోజుల్లో రెండు రాష్ట్రాలు… చ‌ర్చ‌లు, సంప్ర‌దింపుల ద్వారా సామ‌ర‌స్య‌పూర్వ‌క వాతావ‌ర‌ణంలో ఒప్పందం కుదుర్చుకోవ‌డం ముమ్మాటికీ అద్వితీయ‌మే. త‌న రాజ‌కీయ చ‌తుర‌త‌తో దేశంలో 36 రాజ‌కీయ పార్టీల‌ను ఒప్పించి, ఆరు ద‌శాబ్ధాలుగా అవిశ్రాంతంగా పోరాడుతున్న కోట్లాది మంది తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను సాకారం చేసిన ఉద్య‌మ నేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు గారు- ఒక ముఖ్య‌మంత్రిగా పొరుగున ఉన్న రెండు రాష్ట్రాల మ‌ధ్య స్నేహ‌పూర్వ‌క సంబంధాల‌ను సునాయ‌సంగా నెల‌కొల్ప‌గ‌లిగారు. దీంతో మ‌హారాష్ట్ర‌, తెలంగాణల మ‌ధ్య ఎన్నో ఏళ్లుగా నెల‌కొన్న‌జ‌ల‌వివాదం సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించుకున్న‌ట్ల‌యింది. ఈ విష‌యంలో ప‌ట్టువిడుపుల‌తో వ్య‌వ‌హ‌రించి మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఒప్పించ‌డంలో కేసీఆర్ ప్ర‌ద‌ర్శించిన రాజ‌నీతిజ్ఞ‌త గొప్ప‌ది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తెలంగాణ‌లో గోదావ‌రి న‌దిపై ప్ర‌తిపాదించిన ప్రాణ‌హిత‌-చేవెళ్ల ప్రాజెక్టుకు వ్య‌తిరేకంగా… అప్ప‌టి మ‌హారాష్ట్ర ప్ర‌తిప‌క్ష నేత‌గా ఆందోళ‌న చేసిన ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి ఫ‌డ్న‌వీస్ స్వ‌యంగా ”మా అభ్యంత‌రాల‌న్నింటినీ కేసీఆర్ గారు క‌న్విన్స్ చేసి మ‌మ్మ‌ల్ని ఒప్పించారు” అని చెప్ప‌డం దాన్ని తెలియ‌జేస్తున్న‌ది. ఉద్య‌మ నాయ‌కుడు ప‌రిపాల‌కుడైతే ఎలా ఉంటుంద‌న్న విష‌యం దీన్ని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు.

రెండు రాష్ట్రాల‌కు మేలు చేసే విధంగా జ‌రిగిన ఈ తాజా ఒప్పందం ప్ర‌కారం… తెలంగాణ ప్ర‌భుత్వం- లోయ‌ర్ పెన్‌గంగ ప్రాజెక్టులో భాగంగా చ‌నాకా-ప్రాణ‌హిత‌, కొరాట‌, కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహ‌ట్టి, మేడిగ‌డ్డ‌ల వ‌ద్ద బ్యారేజీలు, అదేవిధంగా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం- లోయ‌ర్ పెన్‌గంగ ప్రాజెక్టులో భాగంగా రాజ‌పేట్‌, పెన్‌ప‌హ‌డ్ ల వ‌ద్ద బ్యారేజీలు నిర్మించుకుంటాయి.ఈ ఒప్పందం వ‌ల్ల రెండు రాష్ట్రాల దుర్భిక్ష ప్రాంతాలు గోదావ‌రి జ‌లాల‌తో స‌స్య‌శ్యామ‌లం కాబోతున్నాయి. ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేసుకున్న‌ట్ల‌యితే ఉత్త‌ర తెలంగాణతో పాటు కృష్ణా న‌ది ప‌రివాహ‌క ప్రాంతంలోని ద‌క్షిణ తెలంగాణ జిల్లాల‌కు సైతం గోదావ‌రి జ‌లాల‌ను ఇవ్వ‌వ‌చ్చు.

పంతాలు, ప‌ట్టింపుల‌కు పోయినందు వ‌ల్లే కృష్ణా, గోదావ‌రి న‌దుల‌పై తెలంగాణ కోసం ప్ర‌తిపాదించిన ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులుగానే మిగిలిపోయాయి. ఏ న‌ది ప‌రివాహ‌క ప్రాంతం కూడా ఒక్క రాష్ట్రానికే ప‌రిమితం కాక‌పోవ‌డ‌మే అందుకు కార‌ణం. ఒక్కో న‌ది రెండు, మూడు రాష్ట్రాల గుండా ప్ర‌వ‌హిస్తుండ‌టం మూలంగా ఆ న‌ది జ‌లాల‌పై ఆయా రాష్ట్రాల‌కు హ‌క్కులు సంక్ర‌మిస్తాయి. అలాగే తెలంగాణ‌లో ప్ర‌ధానంగా ఉన్న‌- కృష్ణా న‌ది జ‌లాల‌ను ఎగువ‌న ఉన్న క‌ర్నాట‌క‌, దిగువ‌న ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంతో క‌లిసి పంచుకోవాలి. గోదావ‌రి న‌ది జ‌లాల‌ను ఎగువ‌న ఉన్న మ‌హారాష్ట్ర‌, చ‌త్తీష్‌గ‌ఢ్‌, దిగువ‌న ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ల‌తో పంచుకోవాలి. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం విష‌యంలో పొరుగు రాష్ట్రాల‌తో నీటి పంపిణీ స‌మ‌స్య ఒక్క‌టే కాదు, ప్రాజెక్టుల నిర్మాణం వ‌ల్ల పొరుగు రాష్ట్రానికి చెందిన భూముల ముంపు స‌మ‌స్య కూడా. ఈ రెండు అంశాల‌ను ఆస‌రాగా చేసుకున్న ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాల‌కు నాయ‌క‌త్వం వ‌హించిన సీమాంధ్ర‌,పెద్ద‌లు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విష‌యంలో కుట్ర‌పూరితంగా వ్య‌వ‌హ‌రించార‌న‌డం అక్ష‌ర‌స‌త్యం. పొరుగు రాష్ట్రాలైన మ‌హారాష్ట్ర‌, క‌ర్నాట‌క‌, చత్తీష్‌గ‌ఢ్‌ల‌తో సామ‌ర‌స్య‌పూర్వ‌కంగా కాకుండా- నీటి వాటా విష‌యంలోనైనా లేదా భూముల ముంపు విష‌యంలోనైనా వివాదాలు త‌లెత్తేట‌ట్లుగా తెలంగాణ ప్రాజెక్టుల డిజైన్లు ప్ర‌తిపాదించి ఏండ్ల త‌ర‌బ‌డిగా అవి పూర్తికాకుండా వ్య‌వ‌హ‌రించార‌న్న‌ది చారిత్మ‌క వాస్త‌వం. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి స‌రిహ‌ద్దుల్లో ఉండే తెలంగాణ ప్రాజెక్టుల విష‌యంలో పొరుగు రాష్ట్రాల‌తో త‌లెత్తే వివాదాలు చ‌ర్చ‌లు, సంప్ర‌దింపుల ద్వారా సామ‌ర‌స్య‌పూర్వ‌కంగా ప‌రిష్క‌రించుకుని ప్ర‌తిపాదిత ప్రాజెక్టులు స‌త్వ‌ర‌మే పూర్తి చేసే ప్ర‌య‌త్నం చేయ‌క‌పోగా, వివాదాల‌ను మ‌రింత జ‌ఠిలం చేసేందుకు ఘ‌ర్ష‌ణ‌పూరిత వాతావ‌ర‌ణం నెల‌కొనేట‌ట్లు ఉద్దేశ్య‌పూర్వ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. అందుకు అనుగుణంగా వంత పాడేందుకు సీమాంధ్ర పెద్ద‌లు తెలంగాణ‌లో త‌మ తాబేదార్ల‌ను త‌యారుచేసుకున్నారు. ఫ‌లితంగా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎగువ‌న‌, పొరుగు రాష్ట్రాల‌కు స‌రిహ‌ద్దుల్లో ఉన్న తెలంగాణ ప్రాంతంలో కృష్ణా, గోదావరి న‌దుల‌పై ప్ర‌తిపాదిత ఏ ఒక్క ప్రాజెక్టు కూడా స‌వ్యంగా ముందుకు సాగ‌కుండా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. దాంతో తెలంగాణ‌కు దిగువ‌న ఉన్న సీమాంధ్ర ప్రాజెక్టులకు కృష్ణా, గోదావ‌రి జ‌లాల‌ను య‌ధేచ్ఛ‌గా త‌ర‌లించుకుపోగ‌లిగారు. ఫ‌లితంగా నాలుగు ద‌శాబ్ధాలుగా తెలంగాణ‌లో ప్ర‌తిపాదిత సాగునీటి ప్రాజెక్టుల‌న్నీ పెండింగ్ ప్రాజెక్టులుగానే మిగిలిపోయాయి. చిన్న‌పాటి ముంపు స‌మ‌స్య‌తో కృష్ణా న‌దిపై జూరాల ఇందిరా ప్రియ‌ద‌ర్శిని ప్రాజెక్టు ద‌శాబ్ధాలుగా నిర్దేశిత ల‌క్ష్యానికి అనుగుణంగా పూర్తికాలేదు. గోదావ‌రి న‌దిపై ద‌శాబ్ధాల క్రితం ప్ర‌తిపాదించిన ప్రాణహిత‌, ఇచ్చంప‌ల్లి, ఎల్లంప‌ల్లి ప్రాజెక్టుల‌కు ఇంకా ఒక రూపం కూడా రాలేదు. కానీ అదేస‌మ‌యంలో సీమాంధ్ర‌కు సంబంధించిన ప్రాజెక్టులు, అక్ర‌మ ప్రాజెక్టులు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పూర్త‌య్యాయి. ప‌ర్య‌వ‌సానంగా బ‌చావ‌త్ ట్రిబ్యున‌ల్ కృష్ణా జ‌లాల్లో తెలంగాణ‌కు కేటాయించిన 299 టీఎంసీలు, గోదావ‌రి న‌దీ జ‌లాల్లో కేటాయించిన 950టీఎంసీల జ‌లాల్లో స‌గం కూడా వినియోగానికి రాలేదు. ఫ‌లితంగా తెలంగాణ‌లో 2కోట్ల 67ల‌క్ష‌ల ఎక‌రాల విస్తీర్ణంలో భూమి ఉండ‌గా- అందులో సాగుయోగ్యమైన భూమి 1కోటి 67ల‌క్ష‌ల ఎక‌రాలు, అందులో ప్రాజెక్టుల కింద కేవ‌లం 17ల‌క్ష‌ల ఎక‌రాలు, 40ల‌క్ష‌ల ఎక‌రాలు బావులు, బోరుబావులు కింద సాగ‌వుతున్న‌ది. మిగిలిన దాంట్లో రైతాంగానికి వ‌ర్షాధార‌మే కావ‌డంతో- వ‌ర్షాభావ ప‌రిస్థితులు నెల‌కొన్న‌ట్ల‌యితే రైతాంగం అత‌లాకుత‌లం కావ‌డం అనివార్య‌మైపోయింది. ప‌ర్య‌వ‌సానంగా తెలంగాణ‌లో శాశ్వ‌తంగా దుర్భిక్ష ప‌రిస్థితులు, ఫ్లోరైడ్‌, వెన‌క‌బాటు త‌నం, రైతుల ఆత్మ‌హ‌త్య‌లు.

ఇదిలా ఉండ‌గా మ‌రోవైపున గోదావ‌రి జ‌లాల్లో తెలంగాణ‌కు 950టీఎంసీలు కేటాయిస్తే, ఇప్ప‌టివ‌ర‌కు 350టీఎంసీల‌కు మించి వాడుకోలేదు. స‌గ‌టున ప్ర‌తియేటా 2,423టీఎంసీల గోదావ‌రి జ‌లాలు వృథాగా స‌ముద్రంలో క‌లుస్తున్న‌ట్లు గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి. ఇంత‌కాలంగా తెలంగాణ ప్రాజెక్టుల ప‌ట్ల సీమాంధ్ర పాల‌కులు కుట్ర‌పూరితంగా వ్య‌వ‌హ‌రించిన వైఖ‌రే ఈ దుస్థితికి కార‌ణం. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ద‌శాబ్ధాలుగా కుట్ర‌లు, కుతంత్రాలకు బ‌లైన తెలంగాణ ప్రాజెక్టులు స్వీయ రాజ‌కీయ అస్థిత్వం, స్వీయ ప‌రిపాల‌న‌లోనూ విముక్తికి నోచుకోవ‌ద్దా? కుట్ర‌పూరిత వ్యూహాల నుంచి బ‌య‌ట‌ప‌డి స‌త్వ‌ర‌మే పూర్తి కావ‌ద్దా? ఇంకా సీమాంధ్ర నేత‌ల క‌నుస‌న్న‌ల్లోనే తెలంగాణ ప్రాజెక్టులు కునారిల్లాల్సిందేనా? ఏళ్ల త‌ర‌బ‌డి సీమాంధ్ర పెద్ద‌ల దుర్భుద్ధిని చేధించి ‘బ‌తుకుదాం-బ‌త‌క‌నిద్దాం’ అన్న నినాదంతో పొరుగు రాష్ట్రాల‌తో స్నేహ‌పూర్వ‌క సంబంధాల‌ను నెలకొల్పారు. రాజ‌కీయ పంతాలు, ప‌ట్టింపులకు పోకుండా విజ్ఞ‌త‌, బాధ్య‌త‌తో వ్య‌వ‌హ‌రించి 156 మీట‌ర్ల ఎత్తుకు బ‌దులుగా, మ‌హారాష్ర్ట ప్ర‌భుత్వం కోరిన‌ట్లుగా 148మీట‌ర్ల ఎత్తుకు అంగీక‌రించ‌డం ఒక సాహ‌సోపేతం నిర్ణ‌యం. ఆ ఒప్పందంపై తెలంగాణ ముఖ్య‌మంత్రిగా సంత‌కం చేసిన‌ప్ప‌టికీ- ప‌దిహేనేళ్లుగా కోట్లాది మంది ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల నుంచి ఎదిగొచ్చిన ఉద్య‌మ నేత‌గా, తెలంగాణ క‌న్నీటి ఆర్థ్ర‌త, గుండె త‌డి తెలిసిన కేసీఆర్ గా ఆ నిర్ణ‌యం తీసుకోగ‌లిగారు. త‌న ప్ర‌జ‌ల‌ను మెప్పించుకోగ‌ల‌న‌న్న అచంఛ‌ల విశ్వాస‌మే ఆయ‌న‌తో ఆ ప‌ని చేయించింది. అందుకే ఆ ఒప్పందంపై కాంగ్రెస్‌, తెలుగు దేశం పార్టీ నేత‌ల వాద‌న‌ల‌ను తెలంగాణ ప్ర‌జానీకం ప‌ట్టించుకునే స్థితిలో లేదు.

ఇక ఇప్పుడు చేయాల్సింద‌ల్లా ఒక్క‌టే- ఏ ల‌క్ష్యంతోనైతే ఈ సాహ‌సోపేత ఒప్పందానికి ముందుకు సాగాడ, కేసీఆర్ అదే స్ఫూర్తి, ప‌ట్టుద‌లతో రెండుమూడేళ్ల‌లో ఈ ప్రాజెక్టుల‌ను పూర్తి చేయ‌గ‌లిగిన‌ట్ల‌యితే గోదావ‌రి నీటితో ల‌క్ష‌లాది తెలంగాణ మాగాణి పారుతుంది. క‌రువు, కాట‌కాల‌తో నెర్రెలు బారిన తెలంగాణ నేల పుల‌కిస్తుంది. అపుడు తెలంగాణ ప్ర‌తి గుండె గొంతుక ”సుజ‌లాం… సుఫ‌లాం… తెలంగాణ స‌స్య‌శ్యామ‌లాం…” అని ప‌లుకుతుంది.
***

 

ప‌ల్లె ర‌వి కుమార్‌
ఉపాధ్య‌క్షుడు, తెలంగాణ జ‌ర్న‌లిస్టుల ఫోర‌మ్‌
Ph:+91-8008001233; email: palleravi@live.com