జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం

జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం

…………..
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన అజెండాలో జర్నలిస్టు సంక్షేమం ఒక ప్రాధాన్య అంశంగా మారిందనే విషయాన్ని గుర్తెరుగాలి. వారి సంక్షేమం కోసం ఒక దశ-దిశను నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నది. ఇది తెలంగాణలోని జర్నలిస్టులకు ఒక భరోసా కల్పించడమే కాకుండా దేశంలోని ఇతర రాష్ర్టాలకు కూడా మార్గదర్శకంగా ఉంటుందనడంలో సందేహం లేదు.ఈ క్రమంలో ప్రభుత్వాన్ని ఒప్పించుకోవడం ద్వారా ఇన్నేళ్లుగా ఎవరికీ పట్టకుండా అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించుకుందాం.
——————–

ప్రజలే కేంద్రంగా వారి సమస్యలు ఇతివృత్తంగా, సమాజ వికాసమే లక్ష్యంగా పాలన సాగాలి అన్న దార్శనికతతో పాలనకు మానవీయ కోణా న్ని జోడించి సమాజంలోని అన్నివర్గాల ప్రజల అభ్యున్నతి, వికాసానికి దోహదపడే ప్రణాళికలు రూపొందించుకున్నది తెలంగాణ. అందులో భాగంగానే తెలంగాణ కోస మే తెలంగాణ జర్నలిస్టులు అనే సైద్ధాంతిక భూమికతో రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందుండి పనిచేసిన వేలాదిమంది తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమం, అభ్యున్నతి కోసం ఉద్యమకాలంలో ఉద్యమసారథిగా నాడు ఇచ్చి న హామీని నిలబెట్టుకున్నారు సీఎం కేసీఆర్. దేశంలో ఎక్కడాలేని విధం గా జర్నలిస్టులు, వారి కుటుంబాల సంక్షేమం, అభ్యున్నతి, ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించారు. అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రంలో పలుకుబడి గల కొందరు మినహాయిస్తే సగటు జర్నలిస్టుల సంక్షేమానికి ఒక దశ-దిశను నిర్ధేశించింది కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం. సామాన్య జర్నలిస్టు దుఃఖాన్ని తీర్చేందుకు దేశంలోనే కనీవిని ఎరుగని రీతిలో నూత న ఒరవడికి శ్రీకారం చుట్టింది. వంద కోట్లతో జర్నలిస్టు సంక్షేమ నిధి ఏర్పాటు, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు, ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్‌రూం ఇండ్ల మంజూరుకు నిర్దిష్ట హామీ. వివిధ కారణాలతో మరణించిన జర్నలిస్టు కూతురు వివాహానికి 3 లక్షల ఆర్థిక సాయం తదితరాలు ఇందుకు నిదర్శనం. అంతేకాదు ఎవరైనా జర్నలిస్టు కు ఆకస్మికంగా ఏదైనా ఆపద వస్తే నేనున్నానంటూ ఓ పెద్దన్నలా ఆపన్న హస్తం అందించి తన మానవతా దృక్పథాన్ని చాటిన నేత కేసీఆర్.

రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం 10 కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తామని ఉద్యమ సమయంలో కేసీఆర్ హామీ ఇచ్చారు. దానినే టీఆర్‌ఎస్ 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ పొందుపరిచారు. అధికార పగ్గా లు చేపట్టగానే ఇచ్చిన హామీకి పది రెట్లు అంటే 100 కోట్లతో సంక్షేమ నిధికి సంకల్పించి ఇప్పటికే 60 కోట్లు విడుదల చేసి జర్నలిస్టు సమాజం పట్ల తనకున్న ప్రేమాభిమానాలు చాటుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాల జర్నలిస్టుల కోసం గత పాలకులు కేవలం కోటి రూపాయలు కేటాయించి చేతులు దులుపుకున్నారు. ఆ కోటి రూపాయల కోసం జర్నలిస్టు సమాజం ఎన్ని వీధి పోరాటాలు చేయాల్సి వచ్చిందో మరిచిపోలేదు. ఆ అత్తెసరు నిధితో జర్నలిస్టులకు జరిగిన మేలు ఎంత? అటువంటిది తెలంగాణ ప్రభుత్వం 100 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటుచేసింది నిజం కాదా? ఉమ్మడి పాలకుల కేటయింపులకు, దీనికి ఏమైన పోలిక ఉన్నదా? రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంక్షేమ నిధిపై వచ్చిన వడ్డీతో వివిధ కారణాలతో మరణించిన జర్నలిస్టు కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయంగా లక్ష రూపాయలు, బాధిత కుటుంబ పోషణా ర్థం నెలకు 3 వేల చొప్పున ఐదేండ్ల పాటు పింఛన్, అలాగే ఆ కుటుంబంలో పది లోపు చదువుకునే పిల్లలున్నట్లయితే వారికి నెలకు వెయ్యి చొప్పున వారు పదవ తరగతి పూర్తిచేసేంత వరకూ ఆర్థికసాయం సంక్షేమ నిధి నుంచి అందుతుంది.

దీనికితోడుగా మరణించిన జర్నలిస్టు కుటుంబంలో ఆడపిల్ల పెళ్లికి 3 లక్షలను సీఎం సహాయనిధి నుంచి ఇవ్వడానికి కేసీఆర్ సంకల్పించారు. తీవ్ర అనారోగ్యానికి గురై పనిచేయలేని స్థితిలో ఉన్న జర్నలిస్టు కుటుంబానికి యాభై వేలు సంక్షేమ నిధి నుంచి ఇచ్చే వెసులుబాటు కలిపించారు. 2017 ఫిబ్రవరి 17న కేసీఆర్ జన్మదిన వేడు క సందర్భంగా శ్రీకారం చుట్టిన సంక్షేమ నిధి నుంచి ఇప్పటివరకు సుమా రు కోటి 25 లక్షలకు పైగా.. చనిపోయిన వంద మంది జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష చొప్పున ఇవ్వడమే కాకుండా వారికి నెలకు 3 వేల చొప్పున పింఛన్ చెల్లించే ప్రక్రియ ఏప్రిల్ నుంచి మొదలైంది. అలాగే మరో 32 మంది పనిచేయలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులకు 50 వేల చొప్పున ఇచ్చా రు. జర్నలిస్టు కుటుంబాలకు ఇంతగా భరోసా కల్పించిన ఘనత మన రాష్ర్టానిదే. 20 ఏండ్లకు పైగా జర్నలిస్టుగా పనిచేసిన వారికి సమీప భవిష్యత్‌లో పింఛన్ స్కీం ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.

హెల్త్‌కార్డుల విషయానికొస్తే.. ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్టుల కంట్రిబ్యూషన్‌తో బీమా ఆధారితంగా గరిష్ఠంగా లక్ష పరిమితి ఉండేది. 2012 తర్వాత అది కూడా అమలుకు నోచుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, అధికారులతో సమానంగా ఒక పైసా చెల్లించనవసరం లేకుండానే జర్నలిస్టులకు నగదురహిత హెల్త్‌కార్డుల స్కీంకు శ్రీకారం చుట్టింది. అక్రిడిటేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా అర్హులైన ప్రతి వర్కింగ్, రిటైర్డ్ జర్నలిస్టులకు దీన్ని వర్తింపజేసింది. దీనిద్వారా జర్నలిస్టుల భార్యా పిల్లలకు, తల్లిదండ్రులకు అపరిమిత కార్పొరేట్ వైద్యసాయం అందుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 20 వేల జర్నలిస్టుల కుటుంబాలకు హెల్త్ కార్డు లు ఇచ్చే విషయంలో ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 13,033 మంది జర్నలిస్టులకు హెల్త్ కార్డులను సూత్రప్రాయంగా మంజూరు చేసింది. వారికి యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌లు చేరాయి. వారిలో 4,288 మందికి పైగా హెల్త్‌కార్డులు జారీ అయ్యాయి. విధివిధానాలు రూపకల్ప న కారణంగా కానీ, కార్పొరేట్ దవాఖానలతో ప్రభుత్వ ఒప్పందాల కారణంగా కానీ హెల్త్‌కార్డుల జారీలో కొంత జాప్యం జరిగిందన్న మాట వాస్తవం. ఈ సమయంలో ఏ జర్నలిస్టుకైనా అత్యవసర వైద్య సదుపాయం అవసరమైనట్లయితే సీఎం సహాయనిధి నుంచి ఆర్థిక సాయం అందించింది ప్రభుత్వం.

దేశంలోనే తొలిసారిగా డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ల కార్డులను ఇచ్చిన ఘనత కూడా తెలంగాణదే. రాష్ట్రవాప్తంగా ఇప్పటివరకు సుమారు 14 వేల మందికి కార్డులు జారీ కాగా, మిగిలిన వారికి జారీచేసే ప్రకియ కొనసాగుతున్నది. హైదరాబాద్ కమిషనరేట్ ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 2,400 మందికి కార్డులు ఇవ్వగా, ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఆ సంఖ్య 2800. దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న హైదరాబాద్‌లో ని ఇళ్ల స్థలాల సమస్య ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ఒక కొలిక్కి వచ్చింది. కోర్టు వివాదం ముగిసిన వెంటనే హైదరాబాద్‌లోని సుమారు 3 వేల మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కసరత్తు జరుగుతు న్నది. అదేవిధంగా, గ్రామీణ జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపునకు సంబంధించి సూత్రప్రాయంగా ఒప్పించుకోగలిగాం.

దేశంలో అన్ని రాష్ర్టాల కన్నా జర్నలిస్టుల సంక్షేమంలో మన రాష్ట్రం ముందున్నది. నిజాయితీగా మాట్లాడుకుంటే ఇప్పటి వరకూ దేశంలోనే ఏ ప్రభుత్వానికి జర్నలిస్టుల సంక్షేమం ఓ అజెండానే కాదు. కానీ ఇవ్వాళ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన అజెండాలో జర్నలిస్టు సంక్షేమం ఒక ప్రాధాన్య అంశంగా మారిందనే విషయాన్ని గుర్తెరుగాలి. వారి సంక్షేమం కోసం ఒక దశ-దిశను నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నది. ఇది తెలంగాణలోని జర్నలిస్టులకు ఒక భరోసా కల్పించడమే కాకుండా దేశంలోని ఇతర రాష్ర్టాలకు కూడా మార్గదర్శకంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని ఒప్పించుకోవడం ద్వారా ఇన్నేళ్లుగా ఎవరికీ పట్టకుండా అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించుకుందాం.

పల్లె రవికుమార్
(వ్యాసకర్త: టీయూడబ్ల్యూజే ఉపాధ్యక్షులు)