ప్ర‌జ‌ల మ‌నిషి బొమ్మ‌గాని ధ‌ర్మ‌బిక్షం

ప్ర‌పంచ చ‌రిత్ర‌లో సామాన్యులు అత్యంత శ‌క్తివంత‌మైన రాచ‌రికాన్ని కూక‌టివేళ్ల‌తొ పెక‌లించేందుకు సాగించిన‌ పోరు మ‌హ‌త్త‌ర‌ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. క‌ట్టుబానిస‌త్వం, వెట్టిచాకిరి నుంచి స్వేచ్ఛ‌, స్వాతంత్ర్యం, స‌మాన‌త్వం కోసం క‌ర్క‌శ నిజాం నిరంకుశ పాల‌న‌పై ఉక్కు పిడికిలి బిగించిన ఈ అస‌మాన పోరు భార‌తావ‌నికి పోరాట ప‌టిమ‌, త్యాగం, నిస్వార్థం, నిజాయితీ, నిబ‌ద్ధ‌త‌లాంటి అనేక‌ గొప్ప సామాజిక‌, రాజ‌కీయ‌, నైతిక విలువ‌ల‌ను అందించింది. ‘జీవిత‌మే ప్ర‌జ‌లు… ప్ర‌జ‌లే జీవితం’గా ఆజ‌న్మాంతం స‌మాజం కోసం నిల‌బ‌డి పోరాడే ఎంద‌రో యోధుల‌ను తీర్చిదిద్దింది. అలాంటి సంగ్రామ సింహాల్లో అగ్ర‌జుడు, తొలిత‌రం యోధుడు బొమ్మ‌గాని ధ‌ర్మ‌బిక్షం. నిజాం ప్ర‌భువు, ఆయ‌న తాబేదార్ల రాక్ష‌స పాల‌న‌, ఆకృత్యాల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌జా ఉద్య‌మ సేనానిగా త‌న‌ను తాను తీర్చిదిద్దుకున్నాడు. పాఠ‌శాల విద్యార్థిగా నిజాం ప్ర‌భువు ప‌ట్టాభిషేక ర‌జ‌తోత్స‌వ వేడుక బ‌హిష్క‌ర‌ణ‌తో మొద‌లైన ధిక్కార స్వ‌రం… ఆ త‌ర్వాత ప్ర‌జాస్వామ్య ప్ర‌భువుల వ‌ద్ద కూడా వెర‌వ‌కుండా సాగింది. దాదాపు ఏడు ద‌శాబ్ధాల పాటు ప్ర‌జా ఉద్య‌మాలే ఉచ్ఛ్వాస‌, నిశ్వాస‌లుగా ఎదిగి ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మైన అరుదైన నాయ‌కుడాయ‌న‌. ప్ర‌తి మ‌లుపులో ప్ర‌జ‌లు, ప్ర‌జా ఉద్య‌మాల ప‌క్షాన నిల‌బ‌డి జిల్లా, రాష్ట్ర‌, కేంద్ర స్థాయి నేత‌గా ఎదిగి తుది శ్వాస వ‌ర‌కు రాజీప‌డ‌కుండా అవిశ్రాంతంగా పోరాడిన నిశ్వార్థ‌, నిరాడంబ‌ర యోగిపుంగ‌వుడు ప్ర‌జ‌ల మ‌నిషి బొమ్మ‌గాని ధ‌ర్మబిక్షం. జీవితాంతం క‌ట్టుబ‌డి నిర్వ‌ర్తించిన సామాజిక ధ‌ర్మ‌మే త‌ల్లిదండ్రులు పెట్టిన ‘బిక్షం’ పేరు ప్రజల్లో ధ‌ర్మ‌బిక్షంగా స్థిర‌ప‌డిపోయేలా చేసింది.
బొమ్మ‌గాని ముత్తు లింగం, గోప‌మ్మ దంప‌తుల‌కు 1922 ఫిబ్ర‌వ‌రి 15న జ‌న్మించాడు ధ‌ర్మ‌బిక్షం. ఆయ‌న‌ స్వ‌స్థ‌లం న‌ల్ల‌గొండ జిల్లా మారుమూల ప్రాంత‌మైన మునుగోడు మండ‌లం ఊకొండి గ్రామం. కొంత కాలానికి వారి కుటుంబం సూర్యాపేట ప‌ట్ట‌ణంలో స్థిర‌ప‌డింది. నిజాం రాచ‌రికానికి ఎదురులేకుండా సాగుతున్న రోజులవి. ఆ రోజు సూర్యాపేట‌ ఉన్న‌త పాఠ‌శాల‌లో నిజాం ప‌ట్టాభిషేక ర‌జ‌తోత్స‌వం. విద్యార్థిగా విద్యార్థులంద‌రినీ కూడ గ‌ట్టి పాఠ‌శాల‌లో ర‌జ‌తోత్స‌వం వేడుక‌ల‌ను విజ‌య‌వంతంగా బ‌హిష్క‌రించి… నూనూగు మీసాల వ‌య‌సులోనే నిరంకుశ నిజాం రాచ‌రికాన్ని ఎదురించిన ధీరుడు ధ‌ర్మ‌భిక్షం. పాఠ‌శాల విద్యార్థిగా ఉన్న‌కాలంలో దేశ స్వాతంత్ర్య పోరాటం, నిరంకుశ నిజాం పాల‌న‌, మున‌గాల ప‌ర‌గ‌ణాలో జ‌రుగుతున్న రైతు పోరాటాల ప్ర‌భావంతో పాఠ‌శాల విద్యార్థిగానే నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు పుణికి పుచ్చుకున్నారు.
నిరంకుశ పాల‌న‌, దోపిడీ, అన్యాయాల‌కు వ్య‌తిరేకంగా మ‌న‌సులో బ‌ల‌మైన భీజాలు నాటుకున్నాయి. దానికి తోడైన అభ్యుద‌య సాహిత్యం చైతన్యాన్ని ర‌గిలించి ఆయ‌న ద‌శ‌దిశ‌ను మార్చివేసింది. దేశ స్వాతంత్ర్యం కోసం, నిజాం రాక్ష‌స పాల‌న నుంచి తెలంగాణ నేల విముక్తి కోసం పోరుదారి ప‌ట్టారు. స్వాతంత్ర్య పోరాటంలో క్రియాశీల‌క కార్య‌క‌ర్త‌గా ప‌నిచేస్తూనే పేద విద్యార్థుల కోసం సూర్యాపేట‌లో విద్యార్థి వ‌స‌తిగృహం(హాస్ట‌ల్‌)ను ప్రారంభించాడాయ‌న‌. న‌ల్ల‌గొండ జిల్లా విద్యార్థి సంఘ స్థాప‌న‌కు, విద్యార్థి ఉద్య‌మ నిర్మాణానికి ఆ హాస్ట‌ల్ వేదికైంది. ప్ర‌ముఖ కాంగ్రెస్ నాయ‌కుడు, మాజీ మంత్రి ఉప్పునూత‌ల పురుషొత్తం రెడ్డి, సీపీఎం అగ్ర‌నేత మ‌ల్లు వెంక‌ట న‌ర్సింహ రెడ్డి, త‌దిత‌ర నేత‌లు ఈ హాస్ట‌ల్‌లో ఆశ్ర‌యం పొంది చ‌దువుకుని ఎదిగిన వారే. అంతేకాకుండా ప‌లువురు ఐఎఎస్‌, ఐపీఎస్, సీనియ‌ర్ అధికారులైన వారు కూడా ఉన్నారు. స్వాతంత్రోద్య‌మ కార్య‌క్ర‌మాల్లో నిత్యం తీరిక‌లేకుండా ఉన్న‌ప్ప‌టికీ… హాస్ట‌ల్ నిర్వ‌హ‌ణ కోసం ప్ర‌జ‌ల నుంచి బిచ్చం ఎత్తేవాడు. ఆ విధంగా ప్ర‌జ‌ల వ‌స్త‌వులు, స‌రుకుల రూపంలో తెచ్చి హాస్ట‌ల్ నిర్వ‌హించి, విద్యాభ్యున్నతి కోసం ఒక అద్భుత‌మైన న‌మూనాను స‌మాజానికి అందిచ్చిన దార్శ‌నికుడాయ‌న‌. అందుకే ఆ హాస్ట‌ల్ వార్షికోత్స‌వానికి ముఖ్య అతిథిగా వ‌చ్చిన రాజా బ‌హ‌దుర్ వెంక‌ట్రాం రెడ్డి అక్క‌డికి వ‌చ్చిన జ‌న సందోహాన్ని చూసి ఆశ్చ‌ర‌చ‌కితుడై విష‌యం తెలుసుకుని ‘భిక్షం మాంగా ధ‌ర్మ్ కియా ఇన్‌కా నామ్ ధ‌ర్మ్‌భిక్షు హై’ అని సంభోదించారు. అప్ప‌టివ‌ర‌కు బొమ్మ‌గాని భిక్షంగా ఉన్న ఆయ‌న‌ను ప్ర‌జ‌లు ధ‌ర్మ‌భిక్షం అని పిల‌వ‌డం ప్రారంభిచార‌ట‌. ఆ పేరు ఆరు ద‌శాబ్ధాల త‌ర్వాత ఒక అద్భుత‌, అరుదైన‌, అసాదార‌ణ‌, అవ్య‌క్త‌మైన‌, అపురూప‌-అస‌మాన వ్య‌క్తిత్వానికి రూప‌మైంది.
మొద‌ట జాతీయ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌గా, ఆ త‌ర్వాత ఆర్య స‌మాజ్ కార్య‌క‌ర్త‌గా ప‌నిచేసిన ఆయ‌నలోని చైత‌న్యం, ప్ర‌శ్నించేత‌త్వం, తిరుగుబాటుత‌త్వం అక్క‌డ ఇమ‌డ‌నీయ‌లేదు. ఆయ‌న స‌హ‌జ‌శీల స్వ‌భావం ఆంధ్ర మ‌హాస‌భ వైపు అడుగులు వేయించింది. ఆంధ్ర మ‌హాస‌భ కార్య‌క‌ర్త‌గా ప‌నిచేస్తూనే 1942లో క‌మ్యూనిస్టు పార్టీల చేరాడు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌కోసం రాజ‌కీయ‌, సైద్ధాంతిక వైరుధ్యాల‌ను ప‌క్క‌న‌బెట్టి సంఘ‌టిత‌మై పోరాడిన‌ట్లుగానే… ఆనాడు నిజాం దాష్టీకాన్ని తుది ముట్టించేందుకు ఆంధ్ర మ‌హాస‌భ నాయ‌క‌త్వంలో స‌బ్బ‌న్న‌వ‌ర్గాలు మ‌హ‌త్త‌ర తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చాయి. పుచ్చ‌ల‌ప‌ల్లి సుంద‌ర‌య్య, రావి నారాయ‌ణ రెడ్డి, భీం రెడ్డి న‌ర్సింహ‌రెడ్డి, దేవుల‌ప‌ల్లి వెంక‌టేశ్వ‌ర రావు, చాక‌లి ఐల‌మ్మ‌, వ‌ట్టికోట ఆళ్వార్ స్వామి, దాశ‌ర‌థి కృష్ణ‌మాచారి వంటి యోధానుయోధుల‌తో క‌లిసి న‌డిచాడు. తెలంగాణ విముక్తికోపం పోరుస‌ల్పిన‌ ఎంద‌రో భార్యాబిడ్డ‌లు, ఆస్తులు, వ్య‌క్తిగ‌త జీవితాల‌ను త్య‌జించి ఉద్య‌మాల‌కు జీవితాన్ని అర్పించిన సంద‌ర్భ‌మ‌ది. ఉద్య‌మ అవ‌స‌రాల రీత్యా యువ‌కులు కొంత‌కాలం పెళ్లి చేసుకోవద్ద‌న్న సూచ‌న‌ను అంద‌రి క‌న్న ముందుగా ఆహ్వానించి, ఆచ‌రించి అంద‌రికీ ఆద‌ర్శంగా నిలిచిన మ‌హోన్న‌త వ్య‌క్తిత్వం ఆయ‌నిది. ఆయ‌న ఆద‌ర్శం, ఆచ‌ర‌ణ ఉద్య‌మానికే గ‌ర్వ‌కార‌ణంగా, గీటురాయిగా నిలిచింది. నూనూగు మీసాల య‌వ్వ‌నంలో పుణికి పుచ్చుకుని, తుది శ్వాస విడిచేంత వ‌ర‌కు జీవితాంతం ఆ విలువ‌ల‌ను ఆచ‌రించి వాటికే వ‌న్నె తెచ్చిన‌ నిఖార్సైన వ్య‌క్తిత్వం ఆయ‌నిది. వామ‌ప‌క్ష, విప్ల‌వోద్య‌మాల‌లోనూ నేటికీ ఆ విలువ‌లే ప్రామాణికంగా ఉన్నాయి.

ఆయ‌న జీవిత‌మంతా ఆటుపోట్లు, అరెస్టులు, అజ్ఞాతం, అర‌ణ్య‌వాసాలే. జ‌న‌గామ తాలూకా విసునూరు దేశ్‌ముఖ్‌కు వ్య‌తిరేకపోరాటానికి సంఘీభావంగా సూర్యాపేట‌లో సార్వ‌త్రిక స‌మ్మె చేయించినందుకు ఆయ‌న‌పై నిజాం ప్ర‌భుత్వం 1946లో అరెస్టు వారెంట్ జారీ చేయ‌డంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయ‌న్ను ప్ర‌మాద‌క‌ర‌మైన వ్య‌క్తిగా భావించిన నిజాం ప్ర‌భుత్వం వెంటాడివేటాడి 1948లో అరెస్టుచేయ‌డంతో… న‌ల్ల‌గొండ‌, చంచ‌ల్‌గూడ‌, గుల్బ‌ర్గా, ఔరంగాబాద్ జైళ్ల‌లో ఐదున్న‌ర సంవ‌త్స‌రాల పాటు క‌ఠిన‌కారాగార శిక్ష‌ను అనుభ‌వించారు. ఈ క్ర‌మంలోనే ఉవ్వెత్తున ఎనిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నిజాం రాచ‌రికాన్ని కూక‌టివేళ్ల‌తో పెకిలించింది. హైద‌రాబాద్ సంస్థానం భార‌త్ యూనియ‌న్‌లో విలీన‌మైంది. ఈ క్ర‌మంలో 1952లో జ‌రిగిన తొలిసార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో న‌కిరేక‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పీపుల్స్ డెమొక్ర‌టిక్ ఫ్రంట్‌(పిడిఎఫ్) అభ్య‌ర్థిగా పోటీచేసి, అంద‌రికంటే ఎక్కువ మెజారిటీతో తొలి శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. 1957లో రెండోసారి, ఆ త‌ర్వాత 1962లో న‌ల్ల‌గొండ అసెంబ్లీ స్థానానికి శాస‌న స‌భ్యుడిగా… 1991, 1996లో న‌ల్ల‌గొండ లోక్‌స‌భ స్థానానికి పార్ల‌మెంట్ స‌భ్యుడిగా బ్ర‌హ్మండ‌మైన మెజారిటీతో గెలుపొందారు.

అదే స‌మ‌యంలో త‌న కుల వృత్తి అయిన క‌ల్లుగీత కార్మికుల ద‌య‌నీయ స్థితిన గ్ర‌హించిన ఆయ‌న వారి హ‌క్కులు, వృత్తి ప‌రిర‌క్ష‌ణ‌కోసం 1956లోనే గీత ప‌నివారల సంఘం ఏర్పాటుచేసి, ల‌క్ష‌లాది మంది క‌ల్లుగీత కార్మికుల‌ను కూడ‌గ‌ట్టి దేశంలోనే వృత్తి పోరాటాల‌కు ఆధ్యుడయ్యాడు. ఆ త‌ర్వాత ఎన్నో వృత్తిదారుల పోరాటాల‌కు మార్గ‌ద‌ర్శి అయ్యాడు. భూస్వాముల ఆగ‌డాల నుంచి క‌ల్లు గీత ప‌నివార‌ల భ్ర‌ద‌త కోసం ‘గీసే వాడిదే చెట్టు’ నినాదంతో జాతీయ స్థాయిలో నిర్దిష్ట విధాన రూప‌క‌ల్ప‌న‌లో ముఖ్య‌భూమిక పోషించి.. క‌ల్లు గీత కార్మికుల రెండు క‌ళ్లు అయ్యాడు. దేశంలోనే గీత‌కార్మికుల బ‌తుకు భ‌గ‌వ‌ధ్గీతాచార్యుడయ్యాడు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడిగా, ప్ర‌జా పోరాటాల నాయ‌కుడిగా, లోక్‌స‌భ స‌భ్యుడిగా, శాస‌న స‌భ్యుడిగానూ ప్ర‌జ‌ల వాణి వినిపించి త‌న ధ‌ర్మాన్ని నిఖార్సుగా నిర్వ‌ర్తించి సార్థ‌క‌నామ‌ధేయుడ‌య్యాడు. నూనూగు మీసాల వ‌య‌సులోనే క‌ర్క‌శుడైన నిజాం రాచ‌రికాన్ని ధిక్క‌రించడంతో మొద‌లైన జీవిత ప్ర‌స్థానం 2011, మార్చి26న తుది శ్వాస విడిచేంత వ‌ర‌కు ఏడు ద‌శాబ్ధాల పాటు ప్ర‌జా ఉద్య‌మాలే ఉచ్ఛ్వాస‌, నిశ్వాస‌లుగా సాగింది. ‘పుట్టుక ఒక‌టే త‌న‌ది – బ‌తుకంతా ప్ర‌జ‌ల‌ది… జీవ‌మొక‌టే త‌న‌ది – జీవితం ఉద్య‌మాల‌ది… అన్యాయం ఎదురైతే నిప్పులు కురిసిన క‌న్నులు… రాచ‌కొండ గుట్ట‌ల‌పై తుప్పులు న‌రికిన చేతులు… నిజాయితీకి నిలువెత్తు రూపం… పోరాట‌పు అనుభ‌వాలు పండిన త‌ల వెండికొండ‌- నేల‌పై న‌డుస్తున్న ఆర‌డ‌గుల ఎర్ర‌జెండా… స‌మ‌స‌మాజ ల‌క్ష్యం-ఎరుపెక్కిన వృక్షం… పీడిత జ‌న‌ప‌క్షం బొమ్మ‌గాని ధ‌ర్మ‌బిక్షం…’ అంటూ ప్ర‌జాక‌వి సుద్దాల అశోక్ తేజ నివాళుల‌ర్చించారు. ఆ మ‌హ‌నీయుడి జీవితం ఈ త‌రం ఉద్య‌మ‌కారులు, సామాజిక జీవితంలో ఉండేవారికి ఆచ‌ర‌ణీయం.
(ఈ రోజు… మార్చి26 నాడు ఆయ‌న వ‌ర్థంతి సంద‌ర్భంగా ఆ మ‌హానీయుడికి వంద‌నాల‌తో)
* * *

ప‌ల్లె ర‌వి కుమార్‌
ఉపాధ్య‌క్షుడు, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(TUWJ)
Email: palleravi@live.com

జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం

జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం

…………..
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన అజెండాలో జర్నలిస్టు సంక్షేమం ఒక ప్రాధాన్య అంశంగా మారిందనే విషయాన్ని గుర్తెరుగాలి. వారి సంక్షేమం కోసం ఒక దశ-దిశను నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నది. ఇది తెలంగాణలోని జర్నలిస్టులకు ఒక భరోసా కల్పించడమే కాకుండా దేశంలోని ఇతర రాష్ర్టాలకు కూడా మార్గదర్శకంగా ఉంటుందనడంలో సందేహం లేదు.ఈ క్రమంలో ప్రభుత్వాన్ని ఒప్పించుకోవడం ద్వారా ఇన్నేళ్లుగా ఎవరికీ పట్టకుండా అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించుకుందాం.
——————–

ప్రజలే కేంద్రంగా వారి సమస్యలు ఇతివృత్తంగా, సమాజ వికాసమే లక్ష్యంగా పాలన సాగాలి అన్న దార్శనికతతో పాలనకు మానవీయ కోణా న్ని జోడించి సమాజంలోని అన్నివర్గాల ప్రజల అభ్యున్నతి, వికాసానికి దోహదపడే ప్రణాళికలు రూపొందించుకున్నది తెలంగాణ. అందులో భాగంగానే తెలంగాణ కోస మే తెలంగాణ జర్నలిస్టులు అనే సైద్ధాంతిక భూమికతో రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందుండి పనిచేసిన వేలాదిమంది తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమం, అభ్యున్నతి కోసం ఉద్యమకాలంలో ఉద్యమసారథిగా నాడు ఇచ్చి న హామీని నిలబెట్టుకున్నారు సీఎం కేసీఆర్. దేశంలో ఎక్కడాలేని విధం గా జర్నలిస్టులు, వారి కుటుంబాల సంక్షేమం, అభ్యున్నతి, ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించారు. అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రంలో పలుకుబడి గల కొందరు మినహాయిస్తే సగటు జర్నలిస్టుల సంక్షేమానికి ఒక దశ-దిశను నిర్ధేశించింది కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం. సామాన్య జర్నలిస్టు దుఃఖాన్ని తీర్చేందుకు దేశంలోనే కనీవిని ఎరుగని రీతిలో నూత న ఒరవడికి శ్రీకారం చుట్టింది. వంద కోట్లతో జర్నలిస్టు సంక్షేమ నిధి ఏర్పాటు, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు, ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్‌రూం ఇండ్ల మంజూరుకు నిర్దిష్ట హామీ. వివిధ కారణాలతో మరణించిన జర్నలిస్టు కూతురు వివాహానికి 3 లక్షల ఆర్థిక సాయం తదితరాలు ఇందుకు నిదర్శనం. అంతేకాదు ఎవరైనా జర్నలిస్టు కు ఆకస్మికంగా ఏదైనా ఆపద వస్తే నేనున్నానంటూ ఓ పెద్దన్నలా ఆపన్న హస్తం అందించి తన మానవతా దృక్పథాన్ని చాటిన నేత కేసీఆర్.

రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం 10 కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తామని ఉద్యమ సమయంలో కేసీఆర్ హామీ ఇచ్చారు. దానినే టీఆర్‌ఎస్ 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ పొందుపరిచారు. అధికార పగ్గా లు చేపట్టగానే ఇచ్చిన హామీకి పది రెట్లు అంటే 100 కోట్లతో సంక్షేమ నిధికి సంకల్పించి ఇప్పటికే 60 కోట్లు విడుదల చేసి జర్నలిస్టు సమాజం పట్ల తనకున్న ప్రేమాభిమానాలు చాటుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాల జర్నలిస్టుల కోసం గత పాలకులు కేవలం కోటి రూపాయలు కేటాయించి చేతులు దులుపుకున్నారు. ఆ కోటి రూపాయల కోసం జర్నలిస్టు సమాజం ఎన్ని వీధి పోరాటాలు చేయాల్సి వచ్చిందో మరిచిపోలేదు. ఆ అత్తెసరు నిధితో జర్నలిస్టులకు జరిగిన మేలు ఎంత? అటువంటిది తెలంగాణ ప్రభుత్వం 100 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటుచేసింది నిజం కాదా? ఉమ్మడి పాలకుల కేటయింపులకు, దీనికి ఏమైన పోలిక ఉన్నదా? రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంక్షేమ నిధిపై వచ్చిన వడ్డీతో వివిధ కారణాలతో మరణించిన జర్నలిస్టు కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయంగా లక్ష రూపాయలు, బాధిత కుటుంబ పోషణా ర్థం నెలకు 3 వేల చొప్పున ఐదేండ్ల పాటు పింఛన్, అలాగే ఆ కుటుంబంలో పది లోపు చదువుకునే పిల్లలున్నట్లయితే వారికి నెలకు వెయ్యి చొప్పున వారు పదవ తరగతి పూర్తిచేసేంత వరకూ ఆర్థికసాయం సంక్షేమ నిధి నుంచి అందుతుంది.

దీనికితోడుగా మరణించిన జర్నలిస్టు కుటుంబంలో ఆడపిల్ల పెళ్లికి 3 లక్షలను సీఎం సహాయనిధి నుంచి ఇవ్వడానికి కేసీఆర్ సంకల్పించారు. తీవ్ర అనారోగ్యానికి గురై పనిచేయలేని స్థితిలో ఉన్న జర్నలిస్టు కుటుంబానికి యాభై వేలు సంక్షేమ నిధి నుంచి ఇచ్చే వెసులుబాటు కలిపించారు. 2017 ఫిబ్రవరి 17న కేసీఆర్ జన్మదిన వేడు క సందర్భంగా శ్రీకారం చుట్టిన సంక్షేమ నిధి నుంచి ఇప్పటివరకు సుమా రు కోటి 25 లక్షలకు పైగా.. చనిపోయిన వంద మంది జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష చొప్పున ఇవ్వడమే కాకుండా వారికి నెలకు 3 వేల చొప్పున పింఛన్ చెల్లించే ప్రక్రియ ఏప్రిల్ నుంచి మొదలైంది. అలాగే మరో 32 మంది పనిచేయలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులకు 50 వేల చొప్పున ఇచ్చా రు. జర్నలిస్టు కుటుంబాలకు ఇంతగా భరోసా కల్పించిన ఘనత మన రాష్ర్టానిదే. 20 ఏండ్లకు పైగా జర్నలిస్టుగా పనిచేసిన వారికి సమీప భవిష్యత్‌లో పింఛన్ స్కీం ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.

హెల్త్‌కార్డుల విషయానికొస్తే.. ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్టుల కంట్రిబ్యూషన్‌తో బీమా ఆధారితంగా గరిష్ఠంగా లక్ష పరిమితి ఉండేది. 2012 తర్వాత అది కూడా అమలుకు నోచుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, అధికారులతో సమానంగా ఒక పైసా చెల్లించనవసరం లేకుండానే జర్నలిస్టులకు నగదురహిత హెల్త్‌కార్డుల స్కీంకు శ్రీకారం చుట్టింది. అక్రిడిటేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా అర్హులైన ప్రతి వర్కింగ్, రిటైర్డ్ జర్నలిస్టులకు దీన్ని వర్తింపజేసింది. దీనిద్వారా జర్నలిస్టుల భార్యా పిల్లలకు, తల్లిదండ్రులకు అపరిమిత కార్పొరేట్ వైద్యసాయం అందుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 20 వేల జర్నలిస్టుల కుటుంబాలకు హెల్త్ కార్డు లు ఇచ్చే విషయంలో ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 13,033 మంది జర్నలిస్టులకు హెల్త్ కార్డులను సూత్రప్రాయంగా మంజూరు చేసింది. వారికి యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌లు చేరాయి. వారిలో 4,288 మందికి పైగా హెల్త్‌కార్డులు జారీ అయ్యాయి. విధివిధానాలు రూపకల్ప న కారణంగా కానీ, కార్పొరేట్ దవాఖానలతో ప్రభుత్వ ఒప్పందాల కారణంగా కానీ హెల్త్‌కార్డుల జారీలో కొంత జాప్యం జరిగిందన్న మాట వాస్తవం. ఈ సమయంలో ఏ జర్నలిస్టుకైనా అత్యవసర వైద్య సదుపాయం అవసరమైనట్లయితే సీఎం సహాయనిధి నుంచి ఆర్థిక సాయం అందించింది ప్రభుత్వం.

దేశంలోనే తొలిసారిగా డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ల కార్డులను ఇచ్చిన ఘనత కూడా తెలంగాణదే. రాష్ట్రవాప్తంగా ఇప్పటివరకు సుమారు 14 వేల మందికి కార్డులు జారీ కాగా, మిగిలిన వారికి జారీచేసే ప్రకియ కొనసాగుతున్నది. హైదరాబాద్ కమిషనరేట్ ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 2,400 మందికి కార్డులు ఇవ్వగా, ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఆ సంఖ్య 2800. దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న హైదరాబాద్‌లో ని ఇళ్ల స్థలాల సమస్య ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ఒక కొలిక్కి వచ్చింది. కోర్టు వివాదం ముగిసిన వెంటనే హైదరాబాద్‌లోని సుమారు 3 వేల మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కసరత్తు జరుగుతు న్నది. అదేవిధంగా, గ్రామీణ జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపునకు సంబంధించి సూత్రప్రాయంగా ఒప్పించుకోగలిగాం.

దేశంలో అన్ని రాష్ర్టాల కన్నా జర్నలిస్టుల సంక్షేమంలో మన రాష్ట్రం ముందున్నది. నిజాయితీగా మాట్లాడుకుంటే ఇప్పటి వరకూ దేశంలోనే ఏ ప్రభుత్వానికి జర్నలిస్టుల సంక్షేమం ఓ అజెండానే కాదు. కానీ ఇవ్వాళ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన అజెండాలో జర్నలిస్టు సంక్షేమం ఒక ప్రాధాన్య అంశంగా మారిందనే విషయాన్ని గుర్తెరుగాలి. వారి సంక్షేమం కోసం ఒక దశ-దిశను నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నది. ఇది తెలంగాణలోని జర్నలిస్టులకు ఒక భరోసా కల్పించడమే కాకుండా దేశంలోని ఇతర రాష్ర్టాలకు కూడా మార్గదర్శకంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని ఒప్పించుకోవడం ద్వారా ఇన్నేళ్లుగా ఎవరికీ పట్టకుండా అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించుకుందాం.

పల్లె రవికుమార్
(వ్యాసకర్త: టీయూడబ్ల్యూజే ఉపాధ్యక్షులు)

జర్నలిస్ట్ ల దుఃఖం అంతం కావాలి: కేసీఆర్

దేశం సంగతి బాగానే రాస్తారు గానీ.. మీ సంగతి బాగాలేదన్నారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ క్యాంప్ ఆఫీస్ లోని జనహిత హాల్లో సీఎం 69 మంది చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు లక్ష రూపాయల చెక్కులను అందజేశారు. జర్నలిస్టు కుటుంబాలు తనకు హృదయవిదారక విషయాలు చెప్పారన్నారు. ఇళ్లు లేని కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను వెంటనే కేటాయిస్తామన్నారు.

ఇది చాలా చక్కటి కార్యక్రమం అన్నారు కేసీఆర్. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ,ప‌ల్లె ర‌వి కుమార్ టీంకి కృతజ్ఞతలు తెలిపారు. లక్ష రూపాయలే కాకుండా.. నెలకు రూ. 3 వేల పింఛన్ అందిస్తామన్నారు. జర్నలిస్టు కుటుంబాల్లో పెళ్లికాని అమ్మాయిలకు రూ.3 లక్షల ఆర్థిక సాయం చేస్తామన్నారు. పిల్లల చదువుకోసం ప్రెస్ అకాడమీ రూ.వెయ్యి ఇస్తోందన్నారు. జర్నలిస్టు పిల్లలకు రెసిడెన్షియల్ పాఠశాలలో సీట్లు కేటాయిస్తామన్నారు. ఈ రాష్ట్రంలో దు:ఖం అంతం కావాలన్నారు. సమస్యలుంటే ప్రెస్ అకాడమీ తెలియజేయమన్నారు.

ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను సంప్రదించాలన్నారు. స్పెషల్ కేసులుగా పరిగణించి జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. మీడియా ఆర్గనైజేషన్స్ జర్నలిస్టులకు ప్రావిండెంట్ ఫండ్, ఈఎస్ఐ తప్పకుండా కట్టాలన్నారు. జర్నలిస్ట్ ఫండ్ కోసం రూ.20 కోట్ల ఇప్పటికే ఇచ్చాం.. మరో 30 కోట్ల రూపాయలను రాబోయే బడ్జెట్ లో కేటాయిస్తామన్నారు. రూ.50 కోట్లకు కూడా పెంచుకుందామన్నారు. దేశంలోనే జర్నలిస్టుల వెల్ఫేర్ స్టేట్ గా ఎదగాలన్నారు.

జర్నలిస్టుల సంక్షేమానికి పాటుబడుతున్న సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ. బాధిత కుటుంబాలను తీసుకొచ్చిన జిల్లా రిపోర్టర్ లకు ధన్యవాదాలు తెలిపారాయన.

జర్నలిస్టు కుటుంబాలకు చెక్కులందజేసిన కేసీఆర్

ప్రజలను నేరుగా కలుసుకునేందుకు జనహిత భవన్ ను ప్రారంభించారు సీఎం కేసీఆర్. తొలి రోజు జనహిత భవన్లో జర్నలిస్టు కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 84 మంది జర్నలిస్టుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున చెక్కులను ముఖ్యమంత్రి కేసీఆర్‌, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అందజేశారు.

చనిపోయిన స్పోర్ట్స్‌ జర్నలిస్టు శ్రీనివాసులు కుటుంబానికి సీఎం రూ.4 లక్షల ఆర్థికసాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ, ఇతర సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

ఆ వేలిముద్ర అమ్మది కాకపోతే.. మరెవరిది

జయలలిత మరణించిన రెండు నెలల తర్వాత.. ఆస్పత్రిలో చేరిన 115 రోజుల తర్వాత మొదటిసారి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చిన అపోలో ఆస్పత్రి డాక్టర్లు.. విలేకరుల ప్రశ్నలకు ఖంగుతిన్నారు. వరస ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయ్యి.. అతిపెద్ద నిజాన్ని తప్పు అని తేల్చారు. సెప్టెంబర్ 22వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో జయలలిత ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. నవంబర్ 19వ తేదీన తమిళనాడులోని తంజావూర్, అరవకురిచి, తిరుపరాంకుంద్రం నియోజకవర్గాల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో.. పార్టీ బి.ఫాంపై అమ్మ సంతకం చేయాల్సి ఉంది. ఆస్పత్రిలో ఉన్న పార్టీ అధినేత్రి.. సంతకం చేయలేని స్థితిలో ఉన్నది కాబట్టి.. వేలిముద్ర వేసిన బి.ఫాం పేపర్స్ ఈసీకి పంపారు. విలేకరుల సమావేశంలో జయలలిత వేలిముద్రలు వేశారా అన్న ప్రశ్నకు.. డాక్టర్లు నో అని చెప్పారు. మెడికల్ ట్రీట్ మెంట్ లో జయలలిత నుంచి ఎలాంటి వేలి ముద్రలు తీసుకోలేదు.. ఆ అవకాశం ఇవ్వలేదని డాక్టర్ బాబు చెప్పటం విశేషం. ఈసీకి ఇచ్చిన బి.ఫాం కాగితాల్లోని వేలిముద్ర జయలలితది కాకపోతే.. అది ఎవరిది అనేది ఇప్పుడు సంచలనం అయ్యింది. ఆస్పత్రిలో పక్కనే ఉన్న శశికళకు తెలియకుండా ఎవరైనా జయతో వేలిముద్ర వేయించారా అనేది కూడా ఆసక్తికరం. జయ వేలిముద్ర కాకపోతే.. తప్పుడుది అయితే ఇప్పుడు ఈసీ ఎలా చర్యలు తీసుకుంటుంది.. మళ్లీ ఎన్నికలకు వెళుతుందా అనేది ఆసక్తికర అంశం.

అలా అయితే జియోకు కష్టాలే

రిల‌య‌న్స్ జియోకు క‌ష్టాలు ఇప్పుడు అప్పుడే వీడ‌న‌ట్లు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే మరోటెలికాం సంస్థ భార‌తీ ఎయిర్‌టెల్ జియో నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తోంద‌ని ట్రాయ్ వ‌ద్ద మొర్ర‌పెట్ట‌గా.. ఆ సంస్థ‌కు చేదు అనుభ‌వ‌మే మిగిలింది. జియో ఆఫర్లు నిబంధ‌న‌ల‌కు లోబ‌డే ఉన్నాయ‌ని ట్రాయ్ తెలిపింది. అయినా ఎయిర్‌టెల్ మాత్రం త‌న పోరాటం ఆప‌లేదు. తాజాగా జియోపై కాంపిటీష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియాకు(సీసీఐ) ఫిర్యాదు చేసింది. జియో దీర్ఘ‌కాలంలో లాభాల‌ను ఆర్జించేందుకు నిబంధ‌న‌లు ఉల్లంఘించి వినియోగ‌దారుల‌కు ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తోంద‌ని, టెలికాం మార్కెట్‌ను అక్ర‌మంగా శాసించాల‌ని చూస్తోంద‌ని ఎయిర్‌టెల్ సీసీఐకు ఫిర్యాదు చేసింది. దీనివ‌ల్ల టెలికాం సంస్థ‌ల మ‌ధ్య నెలకొన్న ఆరోగ్య‌క‌ర‌మైన పోటీత‌త్వానికి హాని చేకూరుస్తోంద‌ని పేర్కొంది. ముందుగా ఉచిత డేటా వాయిస్ కాలింగ్ ఆఫ‌ర్స్ ఇచ్చి ఆ త‌ర్వాత మార్కెట్‌లో టెలికాం ప్రొవైడ‌ర్లు లేకుండా చేసి, మెజార్టీ మార్కెట్ త‌న గుప్పిట్లోకి వ‌చ్చాక వాయిస్ కాలింగ్ ఛార్జీలు విధించాల‌నే ప్ర‌ణాళిక జియో ర‌చిస్తోంద‌ని ఎయిర్‌టెల్ సంస్థ వెల్ల‌డించింది. ఎయిర్‌టెల్ ఇచ్చిన ఫిర్యాదును త్వ‌ర‌లోనే సీసీఐ విచార‌ణ జ‌ర‌ప‌నుంది. విచార‌ణ‌లో భాగంగా ఎయిర్‌టెల్ చేసిన ఆరోప‌ణ‌లు నిజ‌మ‌ని తేలితే జియోకు క‌ష్టాలు త‌ప్ప‌వ‌నే చెప్పొచ్చు. ఉచిత ఆఫర్ పైనా ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. మార్చి తర్వాత సరికొత్త ఆఫర్స్ తో జియో రానున్నట్లు ఇప్పటికే సంకేతాలు వచ్చాయి. రిలయన్స్ గ్యాస్ సిలిండర్ ను కూడా జియో కస్టమర్లకు యాడ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఎయిర్ టెల్ వ్యూహాత్మకంగా జియోను ఎదుర్కోవాలని అడుగులు వేస్తోంది. ఎయిర్ టెల్ ఆరోపణలు, విమర్శల్లో ఏ మాత్రం వాస్తవం ఉన్నట్లు విచారణ కమిషన్ అభిప్రాయపడినా.. ఉచిత ఆఫర్ పై ప్రభావం పడనున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ఖాళీ అవుతున్న… ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్రంలో ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ..ఆంధ్రప్రదేశ్ లో మూడు గ్రాడ్యుయేట్స్, రెండు టీచర్స్ ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 29న మొత్తం ఆరు స్థానాలకు పదవి కాలం ముగుస్తుండటంతో… ఈ నెల 13న ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది ఎన్నికల సంఘం. ఫిబ్రవరి 20 వరకు నామినేషన్ల స్వీకరణ, ఫిబ్రవరి 21న పరిశీలన, 23న ఉపసంహరణకు చివరి తేదిగా నిర్ణయించింది. మార్చ్ 9న ఎన్నికలు, 15న కౌంటింగ్ జరగనుంది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ కాటెపల్లి జనార్థన్ రెడ్డి పదవీకాలం ముగియనుంది. మహబూగ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ టీచర్స్ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లోఎంవీఎస్ శర్మ, ఎందపల్లి శ్రీనివాసులు రెడ్డి, డాక్టర్ గేయానంద్, బలసుబ్రహ్మణ్యం, బాచల పుల్లయ్యల పదవీ కాలం ముగియనుంది. ఈ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

పానీపూరీలో టాయ్‌లెట్ క్లీన‌ర్

ఫాస్ట్ ఫుడ్ పేరుతో ప్ర‌జ‌ల ఆరోగ్యాల‌తో చెల‌గాటం ఆడుకుంటున్నారు కొంద‌రు ఫాస్ట్ ఫుడ్ య‌జ‌మానులు. నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించే కేవ‌లం డ‌బ్బే ప‌ర‌మావ‌ధిగా భావిస్తున్న కొంద‌రు క‌నీస ఆహార భ‌ద్ర‌త‌ను పాటించ‌డం మ‌రిచిపోతున్నారు. తాజాగా గుజ‌రాత్‌లో పానీపూరి అమ్మేవాడు అందులో టాయ్‌లెట్ క్లీన‌ర్ క‌లుపుతున్న‌ట్లు ఆహార ప‌రీక్ష ల్యాబ‌రేట‌రీ అధికారులు ధృవీక‌రించారు.

అహ్మ‌దాబాద్‌కు చెందిన చేత‌న్ నాంజీ అనే వ్య‌క్తి పానీపూరీ సెంట‌ర్‌ను న‌డుపుతున్నాడు. పానీపూరీ టేస్ట్ వేరుగా ఉండ‌టంతో అక్క‌డి స్థానికులు చేత‌న్‌ను నిల‌దీశారు. వారిపై  మాట‌ల‌తో ఎదురుదాడికి దిగాడు. పానీపూరీలు అమ్మ‌గా మిగిలిన వ్య‌ర్థాన్ని అంతా రోడ్డుపైనే పోసి పాద‌చారుల‌కు తీవ్ర ఇబ్బంది క‌లిగించేవాడు. దీంతో స్థానికులు అహ్మ‌దాబాద్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ అధికారుల‌కు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు ప‌లుమార్లు హెచ్చ‌రించిన‌ప్ప‌టికీ చేత‌న్ తీరు మార‌క‌పోవ‌డంతో మున్పిప‌ల్ అధికారులు పానీపూరీల‌ను, అందులోకి వినియోగించే నీటిని ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేట‌రీకి పంపించారు.

పానీపూరీని ప‌రీక్షించిన ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేట‌రీ చేత‌న్ టాయ్‌లెట్ క్లీనర్ వాడిన‌ట్లు నిర్ధారించింది. టాయ్‌లెట్ క్లీన‌ర్‌లో వినియోగించే ఆక్సాలిక్ యాసిడ్ అధిక‌మోతాదులో ఉండ‌టంతో చేత‌న్ బుక్ అయ్యాడు. స్థానిక కోర్టు 6నెల‌లు జైలు శిక్ష విధించింది.

కోర్టుకు రావాలని మహేష్ కు ఆదేశం

హీరో మహేష్ నటించిన శ్రీమంతుడు చిత్రం కథ 2012 సంవత్సరం లో స్వాతి మాసపత్రిక లో చచ్చేంత ప్రేమ అనే నవల ను శ్రీమంతుడు  చిత్రం గా మలచారంటూ రచయిత శరత్ చంద్ర గతంలో నాంపల్లి కోర్ట్ లో పిటిషన్ ధాఖలు చేశారు..అప్పుడు చిత్ర యూనిట్ సభ్యులకు నోటీసులు కూడా ఇచ్చింది మళ్ళీ దీనిపై ఈరోజు విచారించిన నాంపల్లి కోర్ట్ సెక్షన్  కాపీ రైట్స్  యాక్ట్ 63 కుట్ర పూరిత నేరం భారతీయ శిక్షా స్మృతి 120 బి కింద కేసు నమోదు చేయాలంటూ పిటిషన్ తరపు న్యాయవాది కోర్ట్ లో వాదించాడు…వాదోపవాదనలు విన్న కోర్ట్ ఈరోజు ఎమ్ బి క్రియేషన్స్ అధినేత మహేష్ బాబు కు మైత్రి మూవీస్ అధినేత ఎర్నేని నవీన్ కు చిత్ర దర్శకుడు కొరటాల శివ లను మార్చి 3 వ తేదీన  నాంపల్లి కోర్ట్ కు హాజరు కావాలని ఆదేశించింది.

ఎన్టీఆర్ జీవితంపై సినిమా : బాలయ్య

నందమూరి తారక రామారావు జీవితంపై సినిమా తీస్తానని ప్రకటించారు బాలకృష్ణ. ఇప్పటికే కథ చర్చలు, కథనం రెడీ అవుతుందని చెప్పి సంచలనం రేపారు. ప్రజలకు తెలియని విషయాలను చూపిస్తానని తెలిపారు. కృష్ణాజిల్లా నిమ్మకూరులో 30 పడకల ఆస్పత్రికి భూమిపూజ చేసిన సందర్భంగా ఈ ప్రకటన చేసి కలకలం రేపారు బాలయ్య. ఎన్టీఆర్ సినిమాలో హీరోగా నేనే నటిస్తున్నానని స్పష్టం చేశారు. డైరెక్టర్, నిర్మాత, బ్యానర్ త్వరలోనే ప్రకటిస్తానన్నారు. ఈ సినిమాను కొందరు కుటుంబ సభ్యులు వద్దని.. మరికొందరు తీయాలి అంటున్నారు.. నేను మాత్రం సినిమా తీయటానికే రెడీ అయినట్లు తెలిపారు. అన్ని కోణాలను మూవీలో చూపిస్తానని చెప్పారు. చంద్రబాబును విలన్ గా చూపిస్తారా.. హీరోగా మలుస్తారనే అనేది ఆసక్తి. లక్ష్మీపార్వతి క్యారెక్ట్ ఎవరు చేస్తారు.. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, భువనేశ్వరి, దగ్గుబాటి పాత్రలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఆసక్తి రేపుతోంది. వైస్రాయ్ హోటల్ వేదికగా జరిగిన కుట్రను ఎలా ప్రజంట్ చేయబోతున్నారు అనేది ఇప్పడు అందరినోట హాట్ టాపిక్ అయ్యింది.