తొలిసారి ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం

నందమూరి తారకరామారావు ఆర్ట్స్‌ బ్యానర్‌పై కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న కొత్త సినిమాలో త్రిపాత్రాభినయం చేయబోతున్నారు ఎన్టీఆర్‌. ఈ కొత్త చిత్రానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 10న పూజా కార్యక్రమాలు జరుపుకోని,  15 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు తన ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపారు నందమూరి కల్యాణ్‌రామ్‌. ఈ చిత్రానికి ‘జై.. లవ కుశ..’ పేరు పరిశీలనలో ఉంది. బాబి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా సీకే మురళీధరన్‌ను ఎంపిక చేశారు.

య‌ముడు-3 విడుద‌ల వాయిదా

సింగమ్-3 గా వస్తున్న సినిమా య‌ముడు-3″ విడుదల వాయిదా పడింది. జనవరి 26న విడుదల కావాల్సిన ఈ సినిమా తమిళనాడులో జల్లికట్టు నిర్వహణ కారణంగా ఏర్పడిన పరిస్థితుల్లో విడుదల వాయిదా వేశారు. సూర్య , శ్రుతిహ‌స‌న్‌, అనుష్క‌లు జంట‌గా నటిస్తున్న చిత్రం య‌ముడు-3″.ఈ చిత్రానికి హ‌రి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా  స‌మ‌ర్పిస్తుండగా.. తెలుగులో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్నారు. హారిస్ జైరాజ్ సంగీతం అందించారు.

రెండు రాష్ట్రాల్లో అన్ని ప‌రిస్థితులు అనుకూలంగా వున్న టైంలో చిత్రాన్ని విడుద‌ల చేస్తామని తెలిపింది సినిమా టీం. విడుద‌ల తేది ని అతిత్వ‌ర‌లో తెలియ‌జేస్తామంది.

మంచి స్క్రిప్ట్ దొరికితే చిరుతో సినిమా..

మంచి స్క్రిప్ట్ దొరికితే మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ప్రకటించారు. శతమానంభవతి సినిమా చూసిన చిరంజీవి తనకు ఫోన్ చేసి అభినందించారన్నారు. బుధవారం చిరు ఇంటికెళ్లి ఆయనను కలిసి వచ్చినట్లు దిల్‌రాజు తెలిపారు. తాను ఇప్పటివరకు 22 సినిమాలు తీశానని..ఈ ఏడాది అల్లు అర్జున్‌తో డీజే, నానితో నేను లోకల్, వరణ్‌తేజ్‌తో ఫిదా చిత్రాలు చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో రాంచరణ్‌తో ఒక సినిమా, మరో సినిమాలో నటించనున్నట్లు చెప్పారు. దిల్‌రాజు నిర్మించిన శతమానం భవతి సక్సెస్‌తో ముందుకెళ్తున్న విషయం తెలిసిందే.

సెట్‌లో ప్ర‌మాదం: ప్రియాంకా చోప్రాకు గాయాలు

హాలీవుడ్ టీవీ సీరియ‌ల్ క్వాంటికో సిరీస్‌లో భాగంగా ఓ స్టంట్ సీన్ చేస్తుండ‌గా బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రాకు గాయాల‌య్యాయి. స్టంట్ సీన్ చేస్తుండ‌గా ప్రియాంకా కాలు జారి ప‌డిపోవ‌డంతో త‌ల‌కు స్వ‌ల్ప గాయాల‌య్యాయి. వెంట‌నే హాస్పిట‌ల్‌కు త‌ర‌లించి చికిత్స అందించారు. కొన్ని గంట‌ల త‌ర్వాత ప్రియాంకాను వైద్యులు డిశ్చార్జ్ చేసిన‌ట్లుగా క్వాంటికో సిరీస్ ప్రొడ‌క్ష‌న్ టీమ్ తెలిపింది. ప్ర‌స్తుతం ప్రియాంకా ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నార‌ని ప్రియాంకా సెక్రెట‌రీ తెలిపారు. గాయం నుంచి కోలుకోగానే ప్రియాంకా మ‌ళ్లీ సెట్స్‌పై క‌నిపిస్తార‌న్నారు.

‘కాటమరాయుడు’ టీజర్ రిలీజ్ డేట్ మారింది

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న ‘కాటమరాయుడు’ సినిమా టీజర్‌ విడుదల తేదీ మారింది. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను జనవరి 14న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. అయితే కొన్ని కారణాల తో జనవరి 26న టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు  పేర్కొంది. సంక్రాంతికి కేవలం డిజిటల్‌ పోస్టర్‌ను విడుదల చేస్తున్నట్లు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. కిషోర్‌కుమార్‌ పార్ధసాని దర్శకత్వం వహించిన ‘కాటమరాయుడు’ చిత్రంలో శ్రుతిహాసన్‌ హీరోయిన్ గా నటిస్తున్నారు. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శరత్‌మరార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజయ్‌, శివబాలాజీ, కమల్‌ కామరాజు, అలీ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఉగాదికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

శాతకర్ణికి ప్రశంసల జల్లు

సాహో బసవతారకరామ పుత్ర బాలయ్య అంటూ బాలయ్యపై ప్రశంసలు కురింపించాడు బాహుబలి రాజమౌళి. శాతకర్ణి బెనిఫిట్ షోను బాలయ్య, క్రిష్ తో కలిసి చూశారు. మీకు సెల్యూట్ చేస్తున్నాను.. శాతకర్ణి లాంటి చారిత్రాత్మక చిత్రంతో నందమూరి తారకరామారావు గారిని గుర్తు చేసారు. ఆయన బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయన్నారు రాజమౌళి. ఇక అంజనాపుత్ర క్రిష్ నీకు 12 కోట్ల మంది తెలుగు ప్రజల దీవెనలు ఉంటాయని ట్విట్ చేశారు. నీ నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉంది అన్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి ఓ మహాకావ్యాన్ని 79 రోజుల్లో పూర్తి చేయడం నమ్మలేకపోతున్నాను అన్నారు. సాయిమాధవ్ రాసిన డైలాగ్స్ అద్బుతం అన్నారు. కెమెరా పనితనం అద్భుతంగా ఉందన్నారు. తెలుగు ఎప్పటికీ గుర్తుండి పోయే చిత్రం అవుతుందని కీర్తించారు రాజమౌళి.

రీఎంట్రీకి మెగా విషెస్

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఖైదీ నెంబ‌ర్ 150 హిట్ టాక్ సంపాదించుకుంది. తొమ్మిదేళ్ల త‌ర్వాత త‌న కొడుకుని తెర‌పై చూసిన చిరంజీవి త‌ల్లి అంజ‌నా దేవి భావోద్వేగానికి గుర‌య్యారు. అర‌వై ఏళ్ల వ‌య‌స్సులోను చిరంజీవి అద‌ర‌గొట్టాడ‌ని తెలిపారు. ఖైదీ నెంబ‌ర్ 150 చిత్రం చాలా బాగుంద‌న్నారు. చిరంజీవి సూప‌ర్బ్‌గా న‌టించార‌ని అంజ‌నాదేవి కొనియాడారు. సినిమా రిలీజైన రోజున  అభిమానుల కేరింత‌ల మ‌ధ్య ప‌లువురు ప్రముఖులు ఈ సినిమాను చూసి త‌మ అభిప్రాయాన్ని సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ట్వీట్ చేశారు. చిరంజీవిగారిని ప‌దేళ్ల పాటు మిస్ అయ్యామ‌ని చెప్పుకొచ్చారు. ఇంత‌టి భారీ ప్రాజెక్ట్‌కు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన మెగా ప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్‌కు అభినంద‌న‌లు తెలిపారు. వీవీ వినాయ‌క్ కుమ్మేశార‌ని ఈ ప్రాజెక్టును వినాయ‌క్ త‌ప్ప మ‌రొక‌రు డీల్ చేయ‌లేర‌ని కొనియాడారు. ఖైదీ నెంబ‌ర్ 150 చిత్ర బృందానికి ఈ సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపారు బాహుబ‌లి జ‌క్క‌న్న‌. ట్వీట్స్ చేసిన‌వారిలో చాలామంది ప్ర‌ముఖులు ఉన్నారు.‘బాక్సాఫీస్‌ బద్దలు.. అన్ని ఏరియాల్లో రఫ్‌ ఆడిస్తున్న మెగాస్టార్‌’ అని దర్శకుడు హరీష్‌ శంకర్‌ ట్వీట్‌ చేయగా.. ‘అమ్మడూ లెట్స్‌ డూ రికార్డ్స్‌ కుమ్ముడూ’ అని అల్లు అర్జున్‌ ట్వీట్‌ చేశాడు. అలాగే సీనియర్‌ హీరోలు మోహన్‌బాబు, నాగార్జున, రామ్‌, అల్లు శిరీష్‌ తదితరులు ట్విట్టర్‌ ద్వారా మెగాస్టార్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘చిరంజీవి గారూ.. ‘ఖైదీ నెంబర్‌ 150’ మీ సినిమాలన్నింటి కంటే బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలవాలని కోరుకుంటున్నాన’ని నాగార్జున ట్వీట్‌ చేశాడు. మ‌రో వైపు నేచుర‌ల్ స్టార్ నానీ కూడా ట్వీట్ చేశాడు. నేను లోక‌ల్ చిత్రం షూటింగ్‌లో ఉన్నందున ఖైదీ నెంబ‌ర్ 150  చూడ‌లేక‌పోయిన‌ట్లు తెలిపాడు. చిరు సినిమా రిలీజ్ అయితే చాలు… త‌ను చిన్న‌ప్పుడు చేసిన అల్ల‌రి గుర్తుకు వ‌స్తోంద‌ని  ఇప్పుడు అది మిస్ అవుతున్న‌ట్లు ట్వీట్ చేశాడు నేచుర‌ల్ స్టార్.

మా నాన్నే ‘గౌతమిపుత్ర’ అవకాశమిచ్చారు..

పౌరాణికం, చారిత్రకం, జానపదం, సోషియో ఫాంటసీ, సాంఘికం… ఇలా అన్ని రకాల కథల్లోనూ ఒదిగిపోయిన అరుదైన నటుడు… నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్‌ నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆయన, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకొన్నారు. మరోసారి ఆయన చారిత్రక కథని ఎంచుకొని, తెలుగు జాతి పరాక్రమాన్ని చాటిచెప్పిన శకపురుషుడు గౌతమిపుత్ర శాతకర్ణి పాత్రని పోషించారు. క్రిష్‌ దర్శకత్వం వహించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ రేపు  ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు నందమూరి బాలకృష్ణ. వందో చిత్రంగా ఈ కథ కుదరడం నా పూర్వ జన్మ సుకృతంగా భావించానన్నారు బాలకృష్ణ. ఎందుకంటే ఇప్పటిదాకా తెరపై ఆవిష్కరించని పాత్ర ఇది. శాతవాహనుల గురించి మనకు కొద్దిగానే తెలుసు. అశోకుడు, శ్రీకృష్ణ దేవరాయలు, గణపతి దేవుడు, రుద్రమదేవిల గురించి మనం చదువుకొన్నంతగా శాతవాహనుల గురించి తెలియదు. మనకంటూ ఒక సంస్కృతిని, వారసత్వాన్ని, ప్రపంచపటంలో మన దేశానికి ఒక గుర్తింపునిచ్చిన కానరాని ఓ భాస్కరుడు గౌతమీపుత్ర శాతకర్ణి. విశ్వవ్యాప్తంగా తన వెన్నెముక మీద తెలుగు జెండా మోసిన నందమూరి తారక రామారావు గారి వారసుడిగా, ఆయన బిడ్డగా ఈ సినిమా చేయడం మరింత ఆనందాన్నిచ్చిందన్నారు ఆయన. నాన్నగారు చేయాలనుకొన్న పాత్ర ఇది. అప్పట్లో ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించడం వల్ల చేయలేకపోయారు. ఓ అదృశ్య శక్తిలా మారి ఈ అవకాశం ఆయనే కల్పించారేమోనని అనుకొంటున్నానన్నారు బాలకృష్ణ. మన చరిత్ర, వారసత్వం చాలా గొప్పవి. వాటిని గుర్తు చేసుకోవడానికి, కాపాడుకోవడానికి, భావితరాలకి అందించడానికి ఇటువంటి సినిమాలు చాలా అవసరం. కరీంనగర్‌ జిల్లా కోటి లింగాల నుంచి, ఉజ్జయిని వరకు భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంతో పాలించిన తెలుగు వీరుడు శాతకర్ణి. ఇలాంటి శకపురుషుల గురించి మనం తెలుసుకోవల్సిన అవసరం చాలా ఉందని భావించే ఈ చిత్రానికి ఒప్పుకన్నానన్నారు బాలకృష్ణ.

నా సినిమాలే నాకు పోటీ
నా సినిమాలే నాకు పోటీ. నా రికార్డులే నాకు లక్ష్యం. నేను ఇదివరకు చేసిన ‘లెజెండ్‌’ ఎన్నో రికార్డులు సాధించింది. అలా నా రికార్డులన్నింటినీ ఈ చిత్రం అధిగమిస్తుందని నమ్ముతున్నానన్నారు బాలకృష్ణ. పోటీలేనిదే మనలో ప్రతిభ బయటికి రాదు. ఈ పండక్కి మంచి సినిమాలొస్తున్నాయి. చిరంజీవిగారి సినిమా, నా సినిమా అన్నీ బాగా ఆడాలి. అన్ని సినిమాలు ఆడితేనే పరిశ్రమకి మేలు జరుగుతుంది. వాళ్లకి కూడా నా శుభాకాంక్షలు అన్నారు ఆయన.

నాకు అభిమానులే బలం

నాకు అభిమానులే బలమన్నారు బాలకృష్ణ. నన్ను ప్రతివాళ్లూ తమ సొంత మనిషిగా, పక్కింటి వ్యక్తిగా భావిస్తారు. అందుకే కొత్త ప్రయత్నాలు చేయడానికి నేనెప్పుడూ భయపడనన్నారాయన. ఇప్పుడు తరం మారుతోంది. ఇప్పటి నుంచి నేనెలాంటి సినిమాలు చేస్తానన్నది చాలా కీలకం. నటుడిగా బాలకృష్ణ శకం మొదలవుతుందని కచ్చితంగా చెబుతా. పాత్రలు, కథల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు నందమూరి అందగాడు.