గణాంకాల్లో తెలంగాణ

గణాంకాల్లో తెలంగాణ
– తెలంగాణ సామాజిక‌, ఆర్థిక స‌ర్వే వెల్ల‌డించిన రాష్ట్ర సంక్షిప్త సమాచారం
హైద‌రాబాద్ః హ‌రాష్ట్రంలో వివిధ విభాగాల్లో భర్తీ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల్లో తెలంగాణకు సంబంధించిన అంశాలకే అధిక ప్రాధాన్యం ఉంటున్నది. తెలంగాణ భౌగోళిక, ఆర్థిక, రాజకీయ పారిశ్రామిక, సేవా తదితర రంగాలపై లోతైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రచురితమైన తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వేల్లోని అంశాలపై ఉద్యోగార్థులకు సమగ్ర అవగాహ ఉండాలి. ఈ నేపథ్యంలో పాఠకుల కోసం వివిధ అంశాలకు సంబంధించిన తెలంగాణ సంక్షిప్త సమాచారాన్ని అందిస్తున్నాం..
* తెలంగాణ విస్తీర్ణం – 1,12,077 చ.కి.మీ
* విస్తీర్ణపరంగా దేశంలో 12వ పెద్ద రాష్ట్రం.
* దేశంలో రాష్ట్ర విస్తీర్ణం – 3.40 శాతం
* పెద్ద జిల్లా – మహబూబ్‌నగర్
* చిన్న జిల్లా – హైదరాబాద్
* తెలంగాణ జనాభా – 3,50,03,674… అందులో పురుషులు – 1,76,11,633 ఉండ‌గా, మహిళలు – 1,73,92,041 మంది ఉన్నారు. జ‌నాభాపరంగా దేశంలో తెలంగాణది 12 స్థానం. దేశ జనాభాలో రాష్ట్ర జనాభా – 2.89 శాతం
* అత్యధిక జనాభాగల జిల్లా – రంగారెడ్డి (52,96,741)
* అత్యల్ప జనాభాగల జిల్లా – నిజామాబాద్ (25,51,335)
* 2001-11 మధ్య రాష్ట్రంలో జనాభా పెరుగుదల – 13.58 శాతం
* 2001-11 మధ్య జాతీయస్థాయిలో జనాభా పెరుగుదల – 17.7 శాతం
* 1991 – 2001 మధ్య రాష్ట్రంలో జనాభా పెరుగుదల – 18.77 శాతం

* గ్రామీణ జనాభా
-తెలంగాణలో గ్రామీణ జనాభా – 2,13,95,009
-గ్రామీణ జనాభా శాతం- 61.12 శాతం
-అత్యధిక గ్రామీణ జనాభాగల జిల్లా – మహబూబ్‌నగర్
-అత్యల్ప గ్రామీణ జనాభాగల జిల్లా – హైదరాబాద్
* పట్టణ జనాభా
-రాష్ట్రంలో పట్టణ జనాభా – 1,36,08,665
-రాష్ట్ర మొత్తం జనాభాలో పట్టణ జనాభా శాతం – 38.88
-2001-11 మధ్య పట్టణ జనాభా పెరుగుదల – 38.12 శాతం
-1991-2001 మధ్య పట్టణ జనాభా పెరుగుదల – 25.13 శాతం
-అత్యధిక పట్టణ జనాభాగల జిల్లా – హైదరాబాద్
-అత్యల్ప పట్టణ జనాభాగల జిల్లా – నిజామాబాద్

* రాష్ట్రంలో జిల్లాలు – 10
-మొత్తం పట్టణాలు – 158
-రెవెన్యూ డివిజన్లు – 42
-మున్సిపల్ కార్పొరేషన్లు – 6
-మున్సిపాలిటీలు – 37
-నగర పంచాయతీలు – 25
-జిల్లా పరిషత్‌లు – 9
-మండల ప్రజా పరిషత్‌లు – 438
-అత్యధిక మండలాలుగల జిల్లా – మహబూబ్‌నగర్ (64)
-అత్యల్ప మండలాలుగల జిల్లా – హైదరాబాద్ (16)
-గ్రామ పంచాయతీలు – 8,687

-అత్యధిక గ్రామ పంచాయతీలుగల జిల్లా – మహబూబ్‌నగర్ (1331)
-అత్యల్ప గ్రామ పంచాయతీలుగల జిల్లా – ఖమ్మం (671)
-రెవెన్యూ మండలాలు – 459
-రెవెన్యూ గ్రామాలు – 10,434
-ఎంపీటీసీలు – 6,456
-జడ్పీటీసీలు – 438
–ఎమ్మెల్యేలు – 119+1
-119 మంది ఓట్ల ద్వారా ఎన్నికవుతారు. ఒకరిని గవర్నర్ నియమిస్తారు.
-అత్యధిక ఎమ్మెల్యే స్థానాలుగల జిల్లా – హైదరాబాద్ (15)
-అతి తక్కువ ఎమ్మెల్యే స్థానాలుగల జిల్లా – నిజామాబాద్ (9)
-ఎమ్మెల్సీలు – 40
-ఎంపీలు – 17
-అత్యధిక ఎంపీ స్థానాలుగల జిల్లా – హైదరాబాద్ (3)
* అక్షరాస్యత
-మొత్తం అక్షరాస్యులు – 2,60,96,778 (66.54 శాతం)
-పురుషుల్లో అక్షరాస్యత – 75.04 శాతం
-స్త్రీలల్లో అక్షరాస్యత – 57.99 శాతం
-పట్టణాల్లో అక్షరాస్యత – 81.09 శాతం
-గ్రామాల్లో అక్షరాస్యత – 57.30 శాతం
-అత్యధిక అక్షరాస్యతగల జిల్లా – హైదరాబాద్ (83.25 శాతం)
-అత్యల్ప అక్షరాస్యతగల జిల్లా – మహబూబ్‌నగర్ (55.04 శాతం)
-స్త్రీ, పురుష నిష్పత్తి – 1000:988
-అత్యధిక స్త్రీ, పురుష నిష్పత్తి – నిజామాబాద్ (1040). ప్రతి 1000 మంది పురుషులకు 1040 మంది స్త్రీలు.
-అత్యల్ప స్త్రీ, పురుష నిష్పత్తి – హైదరాబాద్ (954). ప్రతి 1000 మంది పురుషులకు 954 మంది స్త్రీలు.

* జనసాంద్రత
-రాష్ట్ర జనసాంద్రత 312. అంటే ప్రతి చదరపు కిలోమీటర్‌కు 312 మంది జనం ఉన్నారు.
-అత్యధిక జనసాంద్రతగల జిల్లా – హైదరాబాద్ (ఒక చదరపు కిలోమీటర్‌కు 18,172 మంది)
-అత్యల్ప జనసాంద్రతగల జిల్లా – ఆదిలాబాద్ (ఒక చదరపు కిలోమీటర్‌కు 170 మంది)
* ఎస్సీలు
-రాష్ట్రంలో 54,08,800 మంది ఎస్సీ జనాభా ఉంది.
-ఎస్సీ పురుషులు – 26,93,127
-ఎస్సీ మహిళలు – 27,15,673
-రాష్ట్ర జనాభాలో ఎస్సీలు – 15.45 శాతం
-అత్యధికంగా ఎస్సీలుగల జిల్లా – కరీంనగర్-7,09,757 (18.80 శాతం)

-అత్యల్పంగా ఎస్సీలుగల జిల్లా – హైదరాబాద్-2,47,927 (6.29 శాతం)
-ఎస్సీల్లో అక్షరాస్యులు – 28,53,371 (58.9 శాతం)
-ఎస్సీల్లో లింగ నిష్పత్తి – 1000:1008
-ఎస్సీల్లో అత్యధిక అక్షరాస్యతగల జిల్లా – హైదరాబాద్ (77.72 శాతం)
-ఎస్సీల్లో అత్యల్ప అక్షరాస్యతగల జిల్లా – మహబూబ్‌నగర్
* ఎస్టీలు
-రాష్ట్రంలో ఎస్టీ జనాభా 31,77,940
-ఎస్టీ పురుషులు – 16,07,656
-ఎస్టీ మహిళలు – 15,70,284
-రాష్ట్ర జనాభాలో ఎస్టీల శాతం – 9.08
-ఎస్టీల్లో స్త్రీ, పురుష నిష్పత్తి – 1000:977
-అత్యధిక ఎస్టీ జనాభాగల జిల్లా – ఖమ్మం-6,56,577 (25.18 శాతం)
-అత్యల్ప ఎస్టీ జనాభాగల జిల్లా – హైదరాబాద్-48,937 (1.24 శాతం)
-ఎస్టీల్లో అక్షరాస్యులు – 14,12,617 (49.51 శాతం

1948, సెప్టెంబ‌ర్‌17… చ‌రిత్ర‌లో ఒక పుట * నిరంకుశ రాచ‌రిక‌పాల‌న‌పై సామాన్యుడి దండ‌యాత్ర‌

1948, సెప్టెంబ‌ర్‌17… చ‌రిత్ర‌లో ఒక పుట * నిరంకుశ రాచ‌రిక‌పాల‌న‌పై సామాన్యుడి దండ‌యాత్ర‌

అది మట్టి మనుషుల పోరాటం… అస‌హాయుల‌చే ఆయుధాలు ప‌ట్ట్టించిన మ‌హ‌త్త‌ర స‌మ‌రాంగ‌ణం… ప్ర‌పంచ చ‌రిత్ర‌లో సామాన్యుడు కేంధ్రంగా సాగిన విప్ల‌వ పోరాటం…భూమికోసం, భుక్తికోసం, స్వేచ్ఛ‌కోసం మ‌ట్టి మ‌నిషి మ‌ర‌ఫిరంగై పేలిన వీరోచిత పోరాట‌గాథ‌…ప్ర‌పంచ విప్ల‌వోద్య‌మాల చ‌రిత్ర‌లో చెద‌ర‌ని నెత్తుటి చ‌రిత్ర‌… పాల‌కులు ప్ర‌జాకంఠ‌కులైతే ఎంత‌టివారైనా ప‌త‌నం త‌ప్ప‌ద‌ని చాటిచెప్పిన అస‌మాన పోరు… మ‌నిషిని మ‌నిషిగా చూడ‌ని గ‌డీల కిరాత‌క దొర‌త‌నాన్ని స‌మాధి చేసిన సాయుధ స‌మ‌రం… నిరంకుశ‌ నిజాం రాజ్యాన్ని నేలమట్టం చేసిన ఒక మ‌హా యుద్దం. వెట్టిచాకిరి, క‌ట్టు బానిసత్వానికి బలైపోయిన వెట్టి జీవుల తిరుగుబాటు. మనిషిని మనిషిగా గౌరవించే సంస్కృతిని స్వప్నించి… సామాన్య‌ జనం నడిపిన అసామాన్య విప్లవం. బాంచన్ దొర.. కాల్మొ.క్త అన్న గొంతుకలే, ఆయుధ‌మందుకొని భూస్వామ్య దొరతనం, పెత్తందారీ వ్య‌వ‌స్థ‌ పునాదులను పెకిలించిన పోరాటం తెలంగాణ రైతాంగా సాయుధ పోరాటం.
1948, సెప్టెంబర్ 17…
ఇది క్యాలండ‌ర్‌లో ఒక తేదీ మాత్ర‌మే కాదు… ప్రపంచ చరిత్రలో చెరగని అధ్యాయం… సామాన్యులు చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసిన రోజు… ప్ర‌పంచ విప్ల‌వ పోరాటాల‌న్నింటికీ ఒక స్ఫూర్తి, ప్రేర‌ణ‌- తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. వీర తెలంగాణ విప్లవ పోరాటం. సెప్టెంబర్ 17 ను గుర్తుచేసుకుంటే ఎన్నో పోరాటాలు కళ్లముందు కదులుతాయి. మరెన్నో దారుణాలు గుర్తుకొస్తాయి. వ‌రంగ‌ల్ జిల్లా బైరాన్‌ప‌ల్లి, న‌ల్ల‌గొండ జిల్లా గుండ్రాంప‌ల్లి నెత్తుటి పొత్తిళ్లు… ఎందరో యోథుల వీర‌గాథ‌లు గుర్తుకొస్తాయి. తెలంగాణ ఏ ప‌ల్లెను, ఏ గ‌డ‌ప‌ను తాకినా ఉసిల్ల పుట్ట‌లా క‌దిలే రోమాంచిత‌ జ్ఞాప‌కాలు… దశాబ్దాలుగా స్వేచ్ఛా, స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఉద్యమాల పురిటిగ‌డ్డ తెలంగాణ- ధిక్కారం, సాహ‌సం, త్యాగం, పోరాట స్ఫూర్తి, చైత‌న్యం గుర్తుకొస్తుంది. అన్నింటికీ మించి- వ్య‌వ‌స్థ పునాదులు పెకులుతున్నాయంటే పాల‌కుడు(ఏ రూపంలో ఉన్న‌ప్ప‌టికీ) ఏ ప‌క్షం వ‌హిస్తాడో సామాన్యుడికి తెలిసొచ్చిన రోజు.

హైదరాబాద్ సంస్థానం… 1712-1948 నిజాం రాచ‌రికం.
1948 ముందు వరకూ హైద‌రాబాద్‌ సంస్ధానాన్ని ప్రత్యేక దేశంగా పరిగణించేవారు. దీన్నే తెలంగాణ, హైదారాబాద్ రాష్ట్రం అని కూడా పిలిచేవాళ్ళు. 1712 నుంచి 1948 సెప్టెంబ‌ర్ 17వ తేదీ వ‌ర‌కు సుమారు రెండు వంద‌ల సంవ‌త్స‌రాల పాటు నిజాం న‌వాబుల ఏలుబ‌డిలో ఉంది. హైదరాబాద్ సంస్థానం పరిధిలో 16 పరగణాలుండేవి. భాషా ప్రాతిపదికన ఈ పదహారు జిల్లాలను మూడు ప్రాంతాలుగా విభజించి పాలించేది నైజాం సర్కార్. తెలుగు వాళ్లకు 8 జిల్లాలు… మరాఠీలకు 5 జిల్లాలు… కన్నడిగులకు 3 జిల్లాలుండేవి. తమ‌ పాలన కొనసాగిస్తూనే నిజాం ప్రభువు బ్రిటీష్ వారికి సామంతుడిగా వ్యవహరించేవారు. నిజాం రాచ‌రిక పాలనలో- గ్రామాలన్నీ భూస్వాములు, పెత్తందార్లు, పటేల్లు, పట్వారీలు, దేశ్‌ముఖ్‌ల ఆధీనంలో ఉండేవి. తెలంగాణలోని 10 వేల గ్రామాల్లో సుమారు 3 వేల గ్రామాలు నిజాం జాగీరు గ్రామాలే. జాగిరంటే సొంత ఆస్థి అని. మిగతావి జమీన్ దార్, పటేల్, పట్వారీల ఆధీనంలో ఉండేవి. వీళ్లంతా నిజాం ప్రభువుకు గ్రామాల్లో తొత్తులుగా వ్యవహరించే వాళ్లు. ప్రజలకు నిజాం పై కన్నా ఈ దొర‌లు, భూస్వాములు, పెత్తందార్ల అరాచ‌కాలు, దౌర్జ‌న్యాల మీద‌నే ఎక్కువ వ్య‌తిరేక‌త‌, క‌సి ఉండేది. అధికారం, అహంకారం క‌లిస్తే అరాచ‌క‌మే. స‌రిగ్గా నిజాం రాచ‌రిక పాల‌న‌లో అదే జ‌రిగింది.
గోళ్లూడ‌గొట్టి… 90 రకాల ప‌న్నులు వ‌సూలు.
త‌మ విలాసాలు, భోగ‌బాగ్యాల కోసం ప్ర‌తిదానిపై ప‌న్ను విధించేవారు. పుట్టుకకు పన్ను, చావుకు పన్ను. ఏ వేడుకైనా… వేదనకైనా…పన్ను కట్టాల్సిందే. చెల్లించే ప‌రిస్థితులు, స్తోమ‌త‌ లేకున్నా ప్ర‌జ‌ల గోళ్లూడ‌గొట్టి ప‌న్నులు వ‌సూలు చేసేవారు. మనుషులన్న ఒక్క గుర్తింపు తప్ప… బతుకు దుర్భరంగా సాగే రోజులవి. శ్రమ దోపిడీ, ఆర్థిక దోపిడీ, వెట్టి చాకిరీ, అణ‌చివేత‌. అలాంటి పరిస్థితుల్లో… ఆలోచనలే ఆయుధాలయ్యాయి. పోతే ప్రాణాలు… వస్తే స్వాతంత్ర్యం అన్న ఒకే ఒక్క నినాదంతో రజాకార్లకు, జమీందార్లకు, ప‌టేల్‌-పట్వారీలకు ఎదురు తిరిగాయి తెలంగాణ గ్రామాలు.

దండుక‌ట్టి దండ‌యాత్ర చేసిన సామాన్యుడు…
సామాన్యుల బ‌తుకుల‌తో దొర‌లు, పెత్తందార్లు, భూస్వాములు, ప‌టేల్‌, ప‌ట్వారీలు, దేశ్‌ముఖ్‌లు నెత్తుటి ఆట ఆడారు. అరాచ‌కం రాజ్య‌మేలింది. దీనికి తోడుగా నాగువ‌డ్డీ వ్యాపారం, అది క‌ట్ట‌లేక‌పోతే త‌ర‌త‌రాలుగా వెట్టిచాకిరి, క‌ట్టుబానిస‌త్వం… వ్య‌తిరేకంగా తెలంగాణ‌లో ఎక్క‌డిక‌క్క‌డే పోరాటాలు మొద‌ల‌య్యాయి. 1946 నాటికి తెలంగాణ ఒక అగ్నిగుండంగా మారింది. నాటి న‌ల్ల‌గొండ జిల్లా జ‌న‌గామ తాలూకాలోని విసునూర్ జాగీర్దారు విసునూరు రామ‌చంద్రా రెడ్డి అరాచాకాల‌పై సామాన్యులు దండుక‌ట్టారు. రెచ్చిపోయిన ఆయ‌న గుండాలు 1946 జూలై4న విచ‌క్ష‌ణార‌హితంగా జ‌రిపిన కాల్పుల్లో దొడ్డి కొముర‌య్య నెల‌కొరిగాడు. ఈ సంఘ‌ట‌న‌తో అప్ప‌టివ‌ర‌కు ఎక్క‌డిక‌క్క‌డ పాయ‌లుపాయ‌లుగా సాగుతున్న పోరాటం సాయుధ పోరాట రూపం తీసుకున్న‌ది. ఖిలా వ‌రంగ‌ల్‌లో కొద‌మ సంహంలా ర‌జాకార్ల‌తో వీరోచిత పోరాటం చేసి నెల‌కొరిగిన బ‌త్తిని మొగిల‌య్య గౌడ్ సంఘ‌ట‌న‌తో తెలంగాణ సామాన్యుడి గుండె ప్ర‌తీకార జ్వాల‌తో ర‌గిలిపోయింది. `భూమికోసం.. భుక్తికోసం.. విముక్తికోసం…` అన్న నినాదంతో 1947సెప్టెంబ‌ర్‌11న రావి నారాయ‌ణ రెడ్డి, మ‌ద్ధం ఎల్లారెడ్డి, మ‌గ్దూం మెహియుద్దీన్ త‌దిత‌ర క‌మ్యూనిస్టు నాయ‌కులు రైతాంగ సాయుధ పోరాటానికి అధికారికంగా పిలుపునిచ్చారు. ఫ్యూడ‌లిజం, భూస్వాముల అరాచ‌కాలు, అకృత్యాల‌కు వ్య‌తిరేకంగా గ్రామ‌గ్రామాన అగ్నిపూల‌ను పూయించారు క‌మ్యూనిస్టులు. కార్చిచ్చులా వ్యాపించిన పోరాటం తెలంగాణ ప్ర‌తి అంగుళాన్ని ఉద్య‌మ‌ప‌థంలో న‌డిపించింది. `దున్నేవాడికే భూమి` అన్న ర‌ణ‌న్నినాదంతో గ‌ర్జించిన తెలంగాణ ప్ర‌పంచ విప్ల‌వాల‌కు కొత్త పాఠాలు నేర్పింది.

ఎంద‌రో యోధులు…

నిజాం నిరంకుశ పాలన నుంచి స్వేచ్ఛ‌, స్వాతంత్ర్యం కోసం సామన్య జనం తిరగబడి… ` మ‌న కోసం-మ‌న భావిత‌రాల కోసం` అంటూ తెలంగాణ స‌మాజాన్నిముందుకు న‌డిపించారు. మహిళలు సైతం బంధూకులు పట్టి పోరాడిన మహాత్తర ఘట్టం అది. ఈ పోరాటానికి క‌మ్యూనిస్టుల నేతృత్వంలోని ఆంధ్రమహాసభ నాయ‌క‌త్వం వ‌హించింది. బ‌త్తిని మొగిల‌య్య గౌడ్‌, షేక్ బంద‌గీ, దొడ్డి కొముర‌య్య‌, తానూ నాయ‌క్‌, రావి నారాయ‌ణ రెడ్డి, బ‌ద్ధం ఎల్లా రెడ్డి, భీంరెడ్డి న‌ర్సింహ రెడ్డి, ఆరుట్ల రాంచంద్రా రెడ్డి, ఆరుట్ల క‌మ‌లాదేవి, బొమ్మ‌గాని ధ‌ర్మ‌భిక్షం, న‌ల్ల న‌ర్సింహులు, మ‌ల్లు స్వ‌రాజ్యం….ఇలాంటి ఎంద‌రో నేతాజీలు, భ‌గ‌త్ సింగ్‌లు, అల్లూరి సీతారామ రాజులు, చెగువేరాలు ఈ మ‌హ‌త్త‌ర పోరాటంలో ప్ర‌జ‌ల‌ను న‌డిపించారు, 1946 నుంచి 1951 వరకు మహోద్యమంగా జరిగిన ఈ పోరాటంలో నాలుగువేల మందికి పైగా యోధులు నెల‌కొరిగారు…ఉద్య‌మ‌క్ర‌మంలో వ‌రంగ‌ల్ జిల్లా బైరాన్ ప‌ల్లి, ప‌ర‌కాల‌, న‌ల్ల‌గొండ జిల్లా గుండ్రాంప‌ల్లి లాంటి ఎన్నో చోట్ల జ‌రిగిన ఊచ‌కోత ఆనాటి అరాచ‌కాల‌కు సాక్షిబూతాలుగా నిలిచాయి. మూడు వేల గ్రామాల్లో ప్ర‌జా ప్ర‌భుత్వాలు ఏర్ప‌డ్డాయి. ఆ గ్రామ క‌మిటీల సార‌థ్యంలో భూమిలేని నిరుపేద‌ల‌కు ప‌ది ల‌క్ష‌ల భూమి పంపిణీ జ‌రిగింది. నిజానికి 1947 ఆగస్టు 15న దేశానికి విముక్తి లభించింది. కాని తెలంగాణలో నిజాం ర‌క్క‌సి మూక‌లు, పెత్తందార్ల‌, భూస్వాములు, దొర‌ల అరాచ‌కాలు, దాష్టీకం కొన‌సాగుతూనే ఉన్న‌ది. దానికి వ్య‌తిరేకంగా క‌మ్యూనిస్టులు 1947సెప్టెంబ‌ర్ 11న సాయుధ‌పోరాటానికి పిలుపునివ్వ‌డంతో తెలంగాణవ్యాప్తంగా గెరిల్లా ద‌ళాల స‌హ‌కారంతో గ్రామ క‌మిటీలు దొర‌లు, పెత్తందార్లు, జాగీర్థార్ల‌ను గ్రామాల నుంచి త‌రిమికొట్ట‌డంతో ప‌ట్ట‌ణాల‌కు పారిపోయి.. నిజాం న‌వాబును ఆశ్ర‌యించారు. రెండు శ‌తాబ్దాల త‌మ పాల‌న‌కు అంతిమ గ‌డియ‌లు స‌మీపించాయ‌న్న‌ది గ్ర‌హించిన ఏడో నిజాం న‌వాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌.. ఉత్తుంగ‌త‌రంగంలా లేచిన రైతాంగ సాయుధ పోరాటం నుంచి త‌న‌ను, త‌న తాబేధార్ల‌యిన దొర‌లు, భూస్వాములు, జాగీర్థార్ల‌ను ర‌క్షించుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ముందు మోక‌రిల్లాడు. భార‌త్‌కు స్వాతంత్ర్యం వ‌చ్చిన‌ప్ప‌టికీ హైద‌రాబాద్ సంస్థ నిరంకుశ నిజాం పాల‌న ప్ర‌జ‌ల‌తో నెత్తుటి ఆట ఆడుతుంటే పెద్ద‌గా ప‌ట్టించుకోని యూనియ‌న్ ప్ర‌భుత్వ పెద్ద‌లు… రెండున్న‌ర శ‌తాబ్దాల నిజాం రాచ‌రికానికి, ఆయ‌న తాబేధార్ల అకృత్యాల‌కు మ‌హ‌త్త‌ర రైతాంగ సాయుధ పోరులో ప్ర‌జ‌లు స‌మాధి క‌ట్టే అంతిమ గ‌డియ‌ల్లో- నాటి ఉపప్రధాని, కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జ‌న‌ర‌ల్ చౌద‌రి ఆధ్వ‌ర్యంలో 1948 సెప్టెంబ‌ర్ 12న `ఆప‌రేష‌న్ పోలో` పేరిట సైనిక చ‌ర్య ప్రారంభించారు… అంటే 1948 సెప్టెంబర్ 17(అంటే భార‌త్‌కు స్వాతంత్యం సిద్ధించిన 13నెల‌ల రెండురోజుల‌కు) నిజాం న‌వాబు వ‌ల్ల‌బాయ్ ప‌టేల్ ముందు లొంగిపోయారు. హైద‌రాబాద్ సంస్థానం భార‌త యూనియ‌న్‌లో విలీన‌మైంది హైదరాబాద్ స్టేట్. కేంద్ర ప్ర‌భుత్వ సైనిక చ‌ర్య‌తో తిర‌గ‌బ‌డి ప్ర‌జ‌ల నుంచి నిజాం న‌వాబుకు, పెత్తందార్ల‌కు విమోచ‌న ల‌భించ‌డ‌మే కాదు, భార‌త ప్ర‌భుత్వం నిజాం న‌వాబును రాజప్ర‌ముఖ్‌(1948 నుంచి 1956వ‌ర‌కు)గా నియ‌మించింది. 1956 న‌వంబ‌ర్ ఒక‌టో తేదీన ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఏర్ప‌డి, గ‌వ‌ర్న‌ర్ నియ‌మితులయ్యే వ‌ర‌కు ఆయ‌న రాజ‌ప్ర‌ముఖ్‌గా కొన‌సాగాడు ఏడో నిజాం- మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌. కానీ ఉద్య‌మించిన ప్ర‌జ‌ల ఊచ‌కోత కొన‌సాగింది. దాంతో రైతాంగ ఉద్య‌మ ఉధృతిలో గ‌ఢీలు వ‌దిలి ప‌ట్నాల‌కు పారిపోయిన దొర‌లు, భూస్వాములు, జాగీర్థార్లు పోలీసుల అండ‌తో మ‌ళ్లీ గ‌ఢీల‌కొచ్చారు.

చ‌రిత్ర‌లో ద‌క్క‌ని స‌ముచిత‌ స్థానం…
ప్ర‌పంచంలోని ఎన్నో విముక్తి పోరాటాలు, విప్ల‌వాలు, ఉద్య‌మాల‌కు స్ఫూర్తిగా. ప్రేర‌ణ‌గా నిలిచిన ఇంత‌టి మ‌హ‌త్త‌ర పోరాటానికి దేశ చరిత్రలో ద‌క్కాల్సిన గౌర‌వం, స్థానం ద‌క్క‌లేదు. ప్ర‌పంచ ఉద్య‌మాల గ‌తిని మార్చిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆన‌వాళ్లుగానీ, ఒక స్మృతి చిహ్నం కూడా ఎక్క‌డా లేక‌పోవ‌డమే పాల‌కులు ఏపాటి బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించారో వెల్ల‌డిస్తున్న‌ది. ఎంద‌రో వీరుల త్యాగ‌ఫ‌లంగా స్వేచ్ఛావాయువులు పీల్చిన తెలంగాణ‌కు… ప్ర‌జ‌లు గ్రామాల నుంచి త‌రిమితే ప‌ట్నాలు, న‌గ‌రాలకు పారిపోయిన దొర‌లు, భూస్వామ‌లు, పెత్తందార్లే రంగు, రూపు, టోపీ మార్చి పాల‌కులుగా రావ‌డ‌మే ఈ దుస్థితికి కార‌ణం. అందుకే ఆరున్న‌ర ద‌శాబ్దాల త‌ర్వాత కూడా సెప్టెంబ‌ర్ 17, 1948… విభిన్న‌వాద‌న‌లు ఉన్నాయి. కొందరు దీన్నివిలీన దిన‌మ‌ని… మరికొందరు విమోచ‌న దిన‌మ‌ని… ఇంకొందరు విద్రోహ దిన‌మ‌ని… ఎవరి వాదన ఏదైనా… ఈ రోజుకు వెన‌కా, ముందున్న అస‌మాన చ‌రిత్ర‌ను ఎవరూ కాదన లేనిది. తెలంగాణ నేల‌ దాస్య శృంఖలాల విముక్తి కోసం సాగిన మహాయుద్ధంలో నేల‌కొరిగిన వేలాది మంది అమ‌రవీరులను స్మ‌రించుకోవాల్సిన రోజు… త‌ర‌త‌రాలుగా సాగిన నిజాం రాక్ష‌స పాల‌న‌ను అంత‌మొందించిన రోజు… మాన‌వ‌జాతి వికాసం కోసం జ‌రిగే ప్ర‌జాపోరాటాల చ‌రిత్ర‌ను రాగ‌ధ్వేషాల‌కు అతీతంగా భావిత‌రాల‌కు అందించాల‌ని ప్ర‌జాస్వామ్య పాల‌కుల‌కే కాదు చ‌రిత్ర‌కారుల బాధ్య‌త‌నూ గుర్తు చేసే రోజు… తెలంగాణ చ‌రిత్ర‌లోనే కాదు ప్ర‌పంచ‌ చరిత్రలోనే ఈ రోజు ఓ ప్రత్యేక పుట‌.
ఎందరెందరో త్యాగధనులకు… అలాంటి మ‌హ‌నీయుల పురిటిగడ్డకు… వంద‌నం.

***

ప‌ల్లె ర‌వి కుమార్‌

ఉపాధ్య‌క్షుడు, తెలంగాణ జ‌ర్న‌లిస్టుల ఫోర‌మ్‌(టీజేఎఫ్‌)

email: palleravi@live.com