ట్రంప్ కు వ్యతిరేకంగా గూగుల్‌ ఉద్యోగుల ఆందోళన

అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా వేలాదిమంది గూగుల్‌‌‌కు చెందిన ఉద్యోగులు వివిధ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో టెక్నాలజీ ఇండస్ట్రీలో పెరుగుతున్న ఆందోళన తేటతెల్లమవుతోంది. గూగుల్ పేరెంట్ కంపెనీ అయిన ఆల్ఫాబెట్ ఇంక్‌ కు చెందిన దాదాపు 2000 మంది ఉద్యోగులు వివిధ కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కాలిఫోర్నియా, మౌంటెన్ వ్యూలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్, సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీరిద్దరూ వలస వచ్చినవారే కావడం విశేషం. ముస్లింలు అధికంగా ఉన్న ఏడు దేశాల నుంచి అమెరికాకు ప్రయాణించడంపై పరిమితులు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై పిచాయ్, బ్రిన్ ఆందోళన వ్యక్తం చేశారు.

ట్రంప్‌తో ముందే ప్ర‌పంచ వినాశ‌నం!

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కార‌ణంగా ప్ర‌పంచం ఊహించిన‌దాని కంటే ముందే వినాశ‌నం దిశ‌గా ప‌య‌నిస్తోందా? అణు ఆయుధాలు, వాతావ‌ర‌ణ మార్పుల‌పై ట్రంప్ చేసిన వ్యాఖ్య‌లను అటామిక్ సైంటిస్ట్స్ బులెటిన్ తేలిగ్గా తీసుకోవ‌డం లేదు. ఆయ‌న కార‌ణంగా ప్ర‌పంచం ముందే అంత‌మ‌వుతుంద‌ని హెచ్చ‌రించిన సైంటిస్టులు.. త‌మ సింబాలిక్ డూమ్స్ డే క్లాక్‌ను మిడ్‌నైట్‌కు చేరువ‌గా 30 సెకన్లు ముందుకు జ‌రిపారు. చివ‌రిసారి ఈ క్లాక్‌ను 2015లో ఐదు నిమిషాల నుంచి మూడు నిమిషాల‌కు స‌వ‌రించారు. ఇప్పుడు మ‌రో 30 సెకన్లు త‌గ్గించారు. దీంతో మిడ్‌నైట్‌కు రెండున్న‌ర నిమిషాల దూరంలో డూమ్స్‌డే క్లాక్ నిలిచింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా జాతీయ‌భావం పెరిగిపోతుండ‌టం, అణు ఆయుధాలు, వాతావ‌ర‌ణ మార్పుల‌పై డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య‌లు, అత్యాధునిక సాంకేతిక‌త సాయంతో పెరిగిపోతున్న ఆయుధాలు, శాస్త్రీయ నైపుణ్య‌త‌కు పెరుగుతున్న నిరాధ‌ర‌ణ‌తో ప్ర‌పంచ వినాశ‌నంపై ఆందోళ‌న‌లు పెరుగుతున్నాయి అని ఓ శాస్త్ర‌వేత్తల బృందం విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో అభిప్రాయ‌పడింది. ఈ బృందంలో 15 మంది నోబెల్ బ‌హుమ‌తి గ్ర‌హీత‌లు కూడా ఉన్నారు. వాతావ‌ర‌ణ మార్పుల‌పై ఆందోళ‌న అంతా ఒట్టి పుకార్లే అన్న రీతిలో ట్రంప్ మాట్లాడారు. ఇక అమెరికా అణ్వాయుధాల‌ను పెంచుకోవాల‌ని గ‌త డిసెంబ‌ర్‌లో ట్రంప్ అన్నారు.

గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా డూమ్స్ డే క్లాక్ మిడ్‌నైట్‌కు చేరువైంద‌ని బులెటిన్ బోర్డు చైర్మ‌న్‌ లారెన్స్ క్రౌస్ తెలిపారు. చివ‌రిసారి ఈ క్లాక్ మిడ్‌నైట్‌కు 63 ఏళ్ల కింద‌ట 1953లో చేరువైంద‌ని, అప్పుడు సోవియ‌ట్ యూనియ‌న్ త‌మ తొలి హైడ్రోజ‌న్ బాంబు పేల్చి ఆధునిక ఆయుధాల త‌యారీ పోటీకి తెర‌లేపింద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ప్ర‌పంచంలోని ఒక‌రిద్ద‌రు నేత‌ల విధానాలు ప్ర‌పంచ గ‌తినే మార్చే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని ట్రంప్‌, పుతిన్‌ను ఉద్దేశించి క్రౌస్ అన్నారు. అమెరికా ఎన్నిక‌ల్లో జోక్యం చేసుకొని సైబ‌ర్ టెక్నాల‌జీ వ‌ల్ల ప్ర‌పంచానికి క‌లిగే ముప్పు ఏంటో ర‌ష్యా క‌ళ్ల‌కు క‌ట్టింద‌ని ఆయ‌న చెప్పారు.

మాన‌వ త‌ప్పిదం కార‌ణంగా జ‌రిగిన వాతావ‌ర‌ణ మార్పుల వ‌ల్ల గ‌తేడాది భూమి ఎప్పుడూ లేనంత వేడెక్కింది. అయినా వీటిని ప‌ట్టించుకోకుండా ప్ర‌పంచ నేత‌లు నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అణ్వాయుధాలంటూ ఒక‌రినొక‌రు రెచ్చ‌గొట్టుకునే వ్యాఖ్య‌లు చేస్తున్నారు అని క్రౌస్ విమ‌ర్శించారు. ప్ర‌పంచంలో అత్య‌ధిక అణ్వాయుధాలు ఉన్న అమెరికా, ర‌ష్యా రానున్న కాలంలో త‌మ ఆయుధాల‌ను తగ్గించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న అన్నారు. మంచి స్నేహితులైన ట్రంప్‌, పుతిన్ ఈ దిశ‌గా ఆలోచించి.. మ‌న పిల్ల‌ల‌ భ‌విష్య‌త్తుకు భ‌రోసా క‌ల్పించాలని కోరారు. డూమ్స్ డే క్లాక్ స‌మ‌యాన్ని స‌వ‌రించాల‌న్న త‌మ కీల‌క నిర్ణ‌యం వెన‌క ట్రంపే ముఖ్య కార‌ణ‌మ‌ని ఆయ‌న తేల్చి చెప్పారు.

డూమ్స్ డే క్లాక్‌ను 1947లో సృష్టించారు. అప్ప‌టి నుంచి దీనిని 19సార్లు స‌వ‌రించారు. 1953లో మిడ్‌నైట్‌కు మ‌రీ చేరువ‌గా రెండు నిమిషాల‌కు స‌వ‌రించ‌గా.. 1991కి ముందు దీనిని 17 నిమిషాల వ‌ర‌కూ తీసుకెళ్లారు. ప్ర‌పంచంలో వ‌స్తున్న రాజ‌కీయ‌, సామాజిక‌, వాతావ‌ర‌ణ మార్పుల‌కు అనుగుణంగా ఈ క్లాక్‌ను స‌వ‌రిస్తుంటారు.

వ్యాపారవేత్తలకు ట్రంప్ సీరియస్ వార్నింగ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బిజినెస్ మెన్లు, సీఈవోలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికన్ కంపెనీలు ఒకవేళ ఉద్యోగాలను విదేశాలకు తరలించాలనుకుంటే…భారీ మొత్తంలో సరిహద్దు పన్నును చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అదేవిధంగా అమెరికాలోనే ఉత్పత్తులను ప్రొడ్యూస్ చేస్తూ ఉద్యోగాలు కల్పించే సంస్థలకు బంపర్ ఆఫర్లు ప్రకటించారు. కంపెనీలను ప్రోత్సహించడానికి భారీమొత్తంలో పన్ను కోత, నిబంధనల్లో వెసులుబాటు కల్పించనున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాకు చెందిన 12 మంది టాప్ బిజినెస్ లీడర్లతో సోమవారం ట్రంప్ వైట్ హౌస్ లో బ్రేక్  ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. మ్యానుఫాక్చరింగ్ అనేది తిరిగి అమెరికా స్వాధీనంలోకి తెచ్చుకోవాలని ట్రంప్ బిజినెస్ లీడర్లకు పిలుపునిచ్చారు. ఒకవేళ విదేశాలకు ఉద్యోగాలు తరలిస్తే, తదుపరి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ”ఇక్కడ ప్రజలను దూషిస్తూ.. వేరే ప్రాంతంలో ఫ్యాక్టరీని నెలకొల్పి, అమెరికాలోకి ఉత్పత్తులను తరలించాలనుకుంటే కుదరదన్నారు. దానికి అవసరమైన సరిహద్దు పన్నును కంపెనీలు చెల్లించాల్సిందే నని బిజినెస్ లీడర్ల భేటీలో ట్రంప్ తెలిపారు.

ఆక్స్‌ఫ‌ర్డ్‌ యూనివ‌ర్సిటీపై భార‌త విద్యార్థి కేసు

ప‌్ర‌పంచంలోని ప్ర‌తిష్టాత్మ‌క యూనివ‌ర్సిటీల్లో లండ‌న్‌కు చెందిన ఆక్స్‌ఫ‌ర్డ్ కూడా ఒక‌టి. అలాంటి యూనివ‌ర్సిటీపైనే కోర్టుకెక్కాడు ఓ భార‌తీయ విద్యార్థి. యూనివ‌ర్సిటీలో టీచింగ్ సరిగా లేనందుకే త‌న కెరీర్ దెబ్బ‌తిన్న‌ద‌ని భార‌త్‌కు చెందిన ఫ‌యాజ్ సిద్దిఖీ (38) కేసు వేశాడు. అంతే కాదు 85 కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ కేసు వేశాడు. సిద్దిఖీ వేసిన కేసును కొట్టేయాల్సిందిగా కోరుతూ ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివర్సిటీ లండ‌న్‌లోని హైకోర్టుకు వెళ్లింది. అయితే అక్క‌డ కూడా ఆక్స్‌ఫ‌ర్డ్‌కు ఎదురుదెబ్బ త‌గిలింది. ఇది క‌చ్చితంగా యూనివ‌ర్సిటీ స‌మాధానం చెప్పాల్సిందేనని త‌న 18 పేజీల తీర్పులో జ‌స్టిస్ కెర్ అభిప్రాయ‌ప‌డ్డారు. 2000 ఏడాదిలో యూనివ‌ర్సిటీకి చెందిన బ్రేస్‌నోస్ కాలేజీలో సిద్దిఖీ మోడ‌ర్న్ హిస్ట‌రీ చ‌దివాడు. అయితే టీచింగ్ స్టాఫ్ త‌న ఎంపిక స‌బ్జెక్ట్ ఇండియ‌న్ ఆదునిక హిస్ట‌రీని స‌రిగా చెప్పలేదని.. దీనివ‌ల్ల తాను రెండో గ్రేడ్‌లో పాస‌య్యాన‌ని సిద్దిఖీ తాను ఫైల్ చేసిన కేసులో వాదించాడు.
త‌న‌కు లోయ‌ర్ గ్రేడ్ రాక‌పోయి ఉంటే అంత‌ర్జాతీయ స్థాయిలో క‌మ‌ర్షియ‌ల్ లాయ‌ర్‌గా మంచి కెరీర్ ఉండేద‌ని సిద్దిఖీ వాదిస్తున్నాడు. అయితే సిద్దిఖీ ఆరోప‌ణ‌ల‌ను ఆక్స్‌ఫ‌ర్డ్ నిరాధారమ‌ని కొట్టిపారేసింది. గ్రాడ్యుయేష‌న్ పూర్తయిన 16 ఏళ్ల‌కు కేసు వేయ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నిస్తోంది. లాంటి కేసులు యూనివ‌ర్సిటీల జ‌వాబుదారీత‌నాన్ని పెంచుతాయంటున్నారు కొందరు ప్రొఫెసర్స్.

మీడియాపై నిప్పులు చెరిగిన ట్రంప్‌

మీడియాపై నిప్పులు చెరిగారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌. ఈ భూమ్మీద అత్యంత నిజాయితీలేని మనుషులు ఎవరన్న ఉన్నారంటే వారు జర్నలిస్టులేనని ధ్వజమెత్తారు ఆయన. గత కొంతకాలంగా మీడియాతో తాను యుద్ధం చేస్తున్నానని, వారు అవాస్తవాలను ప్రసారం చేస్తుంటే హెచ్చరిస్తూ వస్తున్నానని చెప్పారు ట్రంప్. తత్ఫలితంగా తన ప్రమాణ స్వీకారానికి చాలా తక్కువ మంది వచ్చినట్లు ప్రసారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ఇంకోసారి ఇలా చేస్తే బాగుండదని మీడియాను హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు.

‘నేను ప్రమాణం చేస్తుండగా ముందు పెద్ద ప్రజాసమూహం ఉంది. అది మీరు కూడా చూశారు. మొత్తం నిండిపోయింది. అయితే నేను ఈ రోజు ఉదయం లేచి ఓ మీడియా నెట్ వర్క్‌ పరిశీలించాను. అందులో వారు జనాలు ఉన్నప్రదేశాన్ని విడిచిపెట్టి ఖాళీ చోటును చూపించారు. వాస్తవానికి మాట్లాడే సమయంలో ఒకసారి నేనంతా పరిశీలించాను.. దాదాపు మిలియన్‌ నుంచి మిలియన్నరమంది హాజరయ్యారు. కానీ మీడియా మాత్రం ఖాళీ స్థలాలను చూపించింది’ అని ఆయన మండిపడ్డారు ట్రంప్.

టుస్సాడ్స్‌లో డోనాల్డ్ ట్రంప్

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలోకి డోనాల్డ్ ట్రంప్ వ‌చ్చేశారు. ట్రంప్ మైన‌పు బొమ్మ‌ను శుక్ర‌వారం అధికారికంగా ఆవిష్క‌రించ‌నున్నారు. అమెరికా అధ్య‌క్షుడిగా బ‌రాక్ ఒబామా ప‌ద‌వీ కాలం ముగియ‌నుంది. దీంతో ఆయ‌న స్థానంలో డోనాల్డ్ ట్రంప్ బొమ్మ‌ను ప్ర‌తిష్టించ‌నున్నారు. నేవీ షూట్‌లో వైట్ ష‌ర్ట్‌, రెడ్ టైతో మైన‌పు ట్రంప్ ఆక‌ట్టుకుంటున్నారు. ఎప్పుడూ ద‌ర్శ‌న‌మిచ్చే స్ట‌యిల్‌లో క‌నిపిస్తున్న ట్రంప్‌తో ఓ అభిమాని అప్పుడే సెల్ఫీ కూడా దిగింది. ట్రంప్ త‌ల‌వెంట్రుక‌ల‌ను తీర్చిదిద్దేందుకు ప్ర‌త్యేకంగా స్పెష‌లిస్టుల‌ను తీసుకొచ్చారు. గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో గెలిచిన ట్రంప్‌, రేపు దేశాధ్య‌క్షుడిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. టుస్సాడ్స్ మ్యూజియంలో ప్ర‌ఖ్యాత రాజ‌కీయ‌వేత్త‌ల్లో పుతిన్‌, బోరిస్ జాన్స‌న్ మైన‌పు బొమ్మ‌లు కూడా ఉన్నాయి.

హిందువు కూడా అమెరికా అధ్యక్షులు కావొచ్చు!

హిందూ మతానికి చెందిన ఓ వ్యక్తి.. అమెరికా అధ్యక్షుడయ్యే అవకాశం ఉందా అంటే.. అవుననే అంటున్నారు బరాక్ ఒబామా. ఈ విషయాన్ని తన లాస్ట్ వైట్ హౌస్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో తెలిపారు.

అమెరికాలో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయని, ఇక్కడ భవిష్యత్తులో కేవలం మహిళలే కాక హిందువులు, లాటినోలు, యూదులు కూడా అధ్యక్షులయ్యే అవకాశం ఉందన్నారు బరాక్ ఒబామా. ప్రతి జాతికి, మతానికి, ఈ దేశంలో ప్రతి మూలకు చెందిన ప్రతిభావంతులు ఎదుగుతున్నారని, అదే అమెరికా అసలైన బలమన్నారు ఆయన. ఈ అవకాశాలను మనం ప్రతి ఒక్కరికీ ఇవ్వడం కొనసాగిస్తే, త్వరలోనే ఒక మహిళ అధ్యక్షురాలవుతుందని చెప్పారు. అలాగే ఒక లాటినో, యూదు, హిందూ అధ్యక్షులు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. దేశానికి ఒక నల్ల జాతీయుడైనా మీరు అధ్యక్షులు అయ్యారు.. అలాంటిది మళ్లీ జరిగే అవకాశం ఉందా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు ఒబామా ఈ విధంగా స్పందించారు. మీడియా ఉండటం వల్లే తాము నిజాయితీగా ఉండగలుగుతూ, మరింత కష్టపడి పనిచేస్తున్నామన్నారు ఒబామా. వాస్తవానికి వైట్‌హౌస్‌ నుంచి మీడియాను దూరంగా ఉంచాలని ట్రంప్ భావిస్తున్న క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఒబామా.

జనం లేక బ్యాన్ ఎత్తేసిన పాక్

నాలుగు అంటే నాలుగు నెలలకే పాకిస్తాన్ దిగొచ్చింది. ఉరి సైనిక స్థావరంపై దాడి, సర్జికల్ స్ట్రక్స్ తర్వాత రెండు దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో.. పాకిస్తాన్ లో బాలీవుడ్ సినిమాలపై నిషేధం విధించారు. కాకమీదు ఉన్నప్పుడు భలేభలే అన్నోళ్లు ఇప్పుడు దిగొచ్చారు. పాక్ లోని ధియేటర్లలో జనంలేక ఈగలు తోలుకుంటున్నారంట. పాక్ లోనూ జనం చూసేది బాలీవుడ్ సినిమాలనే. దీంతో ప్రేక్షకులు లేక థియేటర్లలో షోలే పడటం లేదంట. రెండు నెలలుగా నవాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన థియేటర్ల యాజమాన్యాలు.. చివరకు గెలిచాయి.

హిందీ సినిమాల నిషేధంతో అక్కడి థియేటర్ల యజమానులు ఆర్థికంగా నష్టపోతున్నారు. స్థానిక థియేటర్ల యజమానుల డిమాండ్లను పరిశీలించాలంటూ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ పరిశీలనతో బాలీవుడ్‌ సినిమాలపై నిషేధం ఎత్తేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పాక్‌లోని థియేటర్లలో 70శాతం బిజినెస్‌ బాలీవుడ్‌, హాలీవుడ్‌ సినిమాలదే. నిషేధం ఇంకా కొనసాగిస్తే థియేటర్లు మూసుకోవాల్సి వస్తుందని అక్కడి యజమానులు ఆందోళన చెందుతున్నారు. దీంతో పాకిస్థాన్‌లో బాలీవుడ్‌ సినిమాలపై నిషేధం ఎత్తివేయాలనే నిర్ణయానికి వచ్చింది పాక్ ప్రభుత్వం.

ముగిసిన MH 370 విమాన గాలింపు చర్యలు

మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎంహెచ్‌ 370 విమాన గాలింపు మిస్టరీగానే ముగిసిపోయింది. 239 మందితో హిందూ మహాసముద్రంలో కుప్పకూలిన విమానం గురించి మూడేళ్లుగా వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు.కానీ మారిషస్‌ వద్ద తీరానికి కొట్టుకొచ్చిన శకలాల్ని మాత్రం ఎంహెచ్‌ 370కి చెందినవిగా గుర్తించారు అధికారులు. అంతకుమించి విమానం గురించి ఎలాంటి సమాచారం లభ్యంకాలేదు. ఆస్ట్రేలియా పశ్చిమ ప్రాంతంలో సముద్రం లోపల లక్షా 20వేల చదరపు కిలోమీటర్ల మేర సెర్చ్‌జోన్‌లో చేపట్టిన గాలింపు చర్యలు ఎలాంటి ఆధారాలు దొరకకుండానే ముగియడంతో ఇక విమానం గాలింపును ముగిస్తున్నట్లు తెలిపింది ఆస్ట్రేలియాలోని జాయింట్‌ ఏజెన్సీ కోఆర్డినేషన్‌ సెంటర్‌.  2014 మార్చి 8న మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎంహెచ్‌ 370 విమానం కౌలాలంపూర్‌ నుంచి బీజింగ్‌ వెళ్తుండగా గల్లంతైన సంగతి తెలిసిందే. అందులో ప్రయాణిస్తున్న 239 మంది జలసమాధి అయ్యారని భావించారు అధికారులు. హిందూ మహాసముద్రంలో విమానం కూలినట్లుగా నిర్ధారించుకుని పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. మూడేళ్ల పాటు గాలించినా ప్రయోజనం లేకపోవడంతో గాలింపు చర్యలు ముగించారు.

దేశంలో స్వల్పంగా పెర‌గ‌నున్న నిరుద్యోగం

భార‌త్‌లో నిరుద్యోగం పెర‌గ‌నున్న‌ది. 2017, 2018 సంవ‌త్స‌రాల్లో నిరుద్యోగ శాతం స్వ‌ల్పంగా పెరుగుతుంద‌ని ఐక్యరాజ్య‌స‌మితి పేర్కొంది. దేశంలో ఉద్యోగ క‌ల్ప‌న త‌గ్గిపోతుంద‌ని యూఎన్‌కు చెందిన కార్మిక సంస్థ త‌న నివేదిక‌లో వెల్ల‌డించింది. అంత‌ర్జాతీయ కార్మిక సంఘం గురువారం ప్ర‌పంచ ఉద్యోగ ప‌ట్టిక‌ను విడుద‌ల చేసింది. ఆర్థిక ప్ర‌గ‌తి మంద‌గించ‌నున్న‌ట్లు ఆ నివేదిక‌లో ఐక్యరాజ్య‌స‌మితి అభిప్రాయ‌ప‌డింది. దాని వ‌ల్ల నిరుద్యోగం, సామాజిక అస‌మాన‌ల‌తు పెరుగుతాయ‌ని పేర్కొంది. భార‌త్‌లో నిరుద్యోగుల సంఖ్య 17.7 మిలియ‌న్ల నుంచి 17.8 మిలియ‌న్ల‌కు పెర‌గ‌నున్న‌ట్లు యూఎన్ పేర్కొంది. నిరుద్యోగ శాతం 2017లో 3.4 శాతంగానే ఉండ‌నున్న‌ట్లు ఐక్య‌రాజ్య‌స‌మితి వెల్ల‌డించింది.