అస్టిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు Phd తప్పనిసరి

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు పీహెచ్‌డీని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(UGC) తప్పనిసరి చేసింది. 2021 జూలై 1 తరువాత చేపట్టే నియామకాలకు ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది UGC. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల్లో పదోన్నతికీ Phd ఉండాలని స్పష్టం చేసింది. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్, తాత్కాలికం.. పేరేదైనా ఉన్నత విద్యా సంస్థలకు మంజూరైన పోస్టుల్లో తాత్కాలిక సిబ్బంది 10 శాతానికి మించకూడదు. ఈ మేరకు వర్సిటీలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల్లో బోధన సిబ్బంది నియామకాలకు సరికొత్త నిబంధనలు రూపొందించింది యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌.

సీనియర్‌ ప్రొఫెసర్, ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ప్రిన్సిపాల్‌ తదితర పోస్టుల భర్తీ, పదోన్నతులు, అర్హతలు, పనిదినాలు, అకడమిక్‌ అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకొని మార్గదర్శకాలను రూపొందించింది UGC. ఈ అంశాలపై ఈ నెల 28లోగా అభిప్రాయాలు తెలపాలని వర్సిటీలు, కాలేజీలను కోరింది. అభిప్రాయ సేకరణ తరువాత తుది మార్గదర్శకాలను జారీ చేసి అమల్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని వివిధ వర్సిటీల్లో త్వరలో భర్తీ చేయనున్న 1,061 పోస్టులకూ ఈ నిబంధనలు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.

మార్గదర్శకాల్లోని ప్రధానాంశాలు

*  ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు దరఖాస్తు చేసే వారికి పీహెచ్‌డీ  ఉండాలి.
*    అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు పోస్టు గ్రాడ్యుయేషన్‌లో 55 శాతం మార్కులుండాలి. అలాగే నెట్, స్లెట్, సెట్, పీహెచ్‌డీలలో ఒక అర్హత ఉండాలి.
*  1991 సెప్టెంబర్‌ 19కి ముందు పీహెచ్‌డీ చేసిన వారికి పీజీలో 50% మార్కులున్నా సరిపోతుంది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 50 శాతం మార్కులున్నా చాలు.
*    2021 జూలై 21 తరువాత అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే పీహెచ్‌డీ ఉండాల్సిందే.
*  విద్యా సంస్థలో మంజూరైన మొత్తం పోస్టుల్లో తాత్కాలిక అధ్యాపకులు 10 శాతానికి మించకూడదు.
*    పేరేదైనా తాత్కాలిక పద్ధతిలో పని చేసే అధ్యాపకులకు రెగ్యులర్‌ అధ్యాపకులతో సమానంగా వేతనమివ్వాలి.
*   కనీసం 180 పని దినాలు అమలు చేయాలి. వారంలో 6 రోజుల పనిదినాలు ఉంటే.. విద్యా సంవత్సరంలో 30 వారాలు ప్రధాన బోధన కొనసాగించాలి.
*    మిగిలిన సమయంలో 12 వారాలు ప్రవేశాలు, పరీక్షల నిర్వహణ, పాఠ్య కార్యక్రమాలు, స్పోర్ట్స్, కాలేజ్‌డే కార్యకలాపాలకు కేటాయించాలి.
*    8 వారాలు సెలవులు, 2 వారాలు ప్రజా సెలవులకు కేటాయించాలి.
*    వారంలో 40 గంటలకు తక్కువ కాకుండా పనిదినాలు ఉండాలి. రోజుకు 7 గంటలు అధ్యాపకులు కాలేజీలో ఉండాలి.
*    విద్యార్థులకు వివిధ అంశాలపై మార్గదర్శనం కోసం 2 గంటలు కేటాయించాలి. కమ్యూనిటీ డెవలప్‌మెంట్, సాంస్కృతిక, గ్రంథాలయ కార్యక్రమాలకు సమయమివ్వాలి. ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక లెక్చరర్‌ను కోఆర్డినేటర్‌గా నియమించాలి.

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ భర్తీలో..

-అకడమిక్‌ స్కోర్‌కు 80 మార్కులు
-రీసెర్చ్‌ పబ్లికేషన్స్‌కు 10 మార్కులు
-బోధన అనుభవానికి 10 మార్కులు
-మొత్తంగా 100 మార్కులు

అకడమిక్‌ స్కోర్‌లో గరిష్టంగా ఇచ్చే మార్కులు

♦డిగ్రీలో 80 శాతానికి పైగా మార్కులొస్తే.. 15 మార్కులు
♦ 60 నుంచి 80 శాతం లోపు ఉంటే.. 13 మార్కులు
♦55 నుంచి 60 శాతం లోపు ఉంటే.. 10 మార్కులు
♦ పీజీలో 80 శాతానికి పైగా మార్కులొస్తే.. 28 మార్కులు
♦ 60 నుంచి 80 శాతం లోపు ఉంటే.. 25 మార్కులు
♦ 55 నుంచి 60 శాతం లోపు ఉంటే.. 20 మార్కులు
♦ ఎంఫిల్‌లో 60 శాతానికి పైగా మార్కులొస్తే.. 7 మార్కులు
♦ 55 నుంచి 60 శాతం లోపు మార్కులుంటే 5 మార్కులు
♦ పీహెచ్‌డీకి 30 మార్కులు
♦ నెట్, జేఆర్‌ఎఫ్‌ ఉంటే 7 మార్కులు
♦ నెట్‌/సెట్‌/స్లెట్‌ ఉంటే 5 మార్కులు

ఆ వేలిముద్ర అమ్మది కాకపోతే.. మరెవరిది

జయలలిత మరణించిన రెండు నెలల తర్వాత.. ఆస్పత్రిలో చేరిన 115 రోజుల తర్వాత మొదటిసారి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చిన అపోలో ఆస్పత్రి డాక్టర్లు.. విలేకరుల ప్రశ్నలకు ఖంగుతిన్నారు. వరస ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయ్యి.. అతిపెద్ద నిజాన్ని తప్పు అని తేల్చారు. సెప్టెంబర్ 22వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో జయలలిత ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. నవంబర్ 19వ తేదీన తమిళనాడులోని తంజావూర్, అరవకురిచి, తిరుపరాంకుంద్రం నియోజకవర్గాల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో.. పార్టీ బి.ఫాంపై అమ్మ సంతకం చేయాల్సి ఉంది. ఆస్పత్రిలో ఉన్న పార్టీ అధినేత్రి.. సంతకం చేయలేని స్థితిలో ఉన్నది కాబట్టి.. వేలిముద్ర వేసిన బి.ఫాం పేపర్స్ ఈసీకి పంపారు. విలేకరుల సమావేశంలో జయలలిత వేలిముద్రలు వేశారా అన్న ప్రశ్నకు.. డాక్టర్లు నో అని చెప్పారు. మెడికల్ ట్రీట్ మెంట్ లో జయలలిత నుంచి ఎలాంటి వేలి ముద్రలు తీసుకోలేదు.. ఆ అవకాశం ఇవ్వలేదని డాక్టర్ బాబు చెప్పటం విశేషం. ఈసీకి ఇచ్చిన బి.ఫాం కాగితాల్లోని వేలిముద్ర జయలలితది కాకపోతే.. అది ఎవరిది అనేది ఇప్పుడు సంచలనం అయ్యింది. ఆస్పత్రిలో పక్కనే ఉన్న శశికళకు తెలియకుండా ఎవరైనా జయతో వేలిముద్ర వేయించారా అనేది కూడా ఆసక్తికరం. జయ వేలిముద్ర కాకపోతే.. తప్పుడుది అయితే ఇప్పుడు ఈసీ ఎలా చర్యలు తీసుకుంటుంది.. మళ్లీ ఎన్నికలకు వెళుతుందా అనేది ఆసక్తికర అంశం.

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ఖాళీ అవుతున్న… ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్రంలో ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ..ఆంధ్రప్రదేశ్ లో మూడు గ్రాడ్యుయేట్స్, రెండు టీచర్స్ ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 29న మొత్తం ఆరు స్థానాలకు పదవి కాలం ముగుస్తుండటంతో… ఈ నెల 13న ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది ఎన్నికల సంఘం. ఫిబ్రవరి 20 వరకు నామినేషన్ల స్వీకరణ, ఫిబ్రవరి 21న పరిశీలన, 23న ఉపసంహరణకు చివరి తేదిగా నిర్ణయించింది. మార్చ్ 9న ఎన్నికలు, 15న కౌంటింగ్ జరగనుంది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ కాటెపల్లి జనార్థన్ రెడ్డి పదవీకాలం ముగియనుంది. మహబూగ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ టీచర్స్ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లోఎంవీఎస్ శర్మ, ఎందపల్లి శ్రీనివాసులు రెడ్డి, డాక్టర్ గేయానంద్, బలసుబ్రహ్మణ్యం, బాచల పుల్లయ్యల పదవీ కాలం ముగియనుంది. ఈ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

రేపే చిన్న‌మ్మ ప్ర‌మాణ‌స్వీకారం

అన్నాడీఎంకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ‌శిక‌ళ రేపు సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నుంది. ఉద‌యం 9:30 గంట‌ల‌కు మ‌ద్రాస్ యూనివ‌ర్శిటీ సెంట్ర‌ల్‌హాల్‌లో ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇందుకు ఏర్పాట్లు చురుగ్గాసాగుతున్నాయి. శ‌శిక‌ళ‌తోపాటు మ‌రికొంత మంది మంత్రులు ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. మ‌రోవైపు నిన్న ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వికి రాజీనామా చేసిన ప‌న్నీర్ సెల్వంకు చిన్న‌మ్మ స్పీక‌ర్ ప‌దవి ఇస్తాన‌ని చెప్ప‌గా అందుకు ఆయ‌న సున్నితంగా తిర‌స్క‌రించిన‌ట్లు స‌మాచారం. హోంమంత్రి, ఆర్థిక‌శాఖలు ప‌న్నీర్‌సెల్వంకు క‌ట్ట‌బెట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకేలో ప‌న్నీర్ సెల్వం ఎప్పటికీ అగ్ర‌స్థానంలోనే ఉంటార‌ని శ‌శిక‌ళ పేర్కొన్నారు. ప‌న్నీర్ సెల్వం ఏది అడిగిన ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్న‌ట్లు శశిక‌ళ చెప్పారు. ఓవైపు చిన్నమ్మ ప్రమాణస్వీకారానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతుండగా ఇంఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు ఇంకా చెన్నైకి చేరుకోలేదు. ఈ సాయంత్రం చెన్నైకి చేరుకునే అవకాశం ఉంది లేదా రేపు ఉదయానికల్లా ఆయన చెన్నై చేరుకోవచ్చని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.

పంజాబ్, గోవాలలో ముగిసిన ఎన్నికలు

పంజాబ్, గోవా రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పంజాబ్ లో మూడు గంటలవరకు దాదాపు 55 శాతం పోలింగ్ నమోదైంది. గోవాలో మూడు గంటలవరకు 67శాతం ఓటింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. ఓవరాల్ గా పంజాబ్ లో 70 శాతం దాటుతుందని అంచనాలున్నాయి. పంజాబ్ లో అక్కడి పీసీసీ చీఫ్ కెప్టెన్ అమరీందర్ సింగ్, మాజీ క్రికెటర్ నవజ్యోత్  సింగ్  సిద్ధూ, ఆప్ అభ్యర్థి భగవంత్ మాన్ , పంజాబ్  సీఎం ప్రకాశ్  సింగ్ బాదల్, డిప్యూటీ సీఎం సుఖ్ బీర్  సింగ్  బాదల్  ప్రధాన అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. 85 శాతం పోలింగ్ నమోదు చేయడమే లక్ష్యంగా ఈసీ పనిచేసింది. ఐతే… ఎంమేరకు సక్సెస్ అవుతుందన్నది చూడాలి. పంజాబ్ లోని 117, గోవాలో 40 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. పోలింగ్ బూత్ లలో ఇప్పటికే  క్యూ లైన్లలో నిల్చున్నవారికి ఓటు వేసే అవకాశం ఇస్తున్నారు రిటర్నింగ్ అధికారులు.

స్కీమ్ అదిరింది : మరుగుదొడ్డి వాడితే నెలనెలా డబ్బు

ప్ర‌జ‌లు క్ర‌మం త‌ప్ప‌కుండా టాయ్‌లెట్స్ ఉప‌యోగించేలా ఓ స‌రికొత్త విధానాన్ని అమ‌లు చేశారు రాజ‌స్థాన్ రాష్ట్రం బార్మ‌ర్ జిల్లా క‌లెక్ట‌ర్ సుధీర్ శ‌ర్మ‌. రెగ్యుల‌ర్‌గా మ‌రుగుదొడ్లు వాడే కుటుంబాల‌కు నెల‌కు రూ.2500 క్యాష్ ప్రైజ్‌ను ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం జిల్లాలోని రెండు పంచాయ‌తీల‌కు ఈ స్కీమ్‌ను వ‌ర్తింప‌జేశారు.

స్వ‌చ్ఛ్ భార‌త్ మిష‌న్ ప్ర‌మోష‌న్‌లో భాగంగా గ్రామీణాభివృద్ధి శాఖ‌, జిల్లా పాల‌నా విభాగంతో క‌లిసి కైర్న్ ఇండియా ఈ వినూత్న ప‌థ‌కానికి నాంది ప‌లికింది. బేటు,గిడా పంచాయ‌తీల్లో ఈ ప‌థ‌కాన్ని లాంచ్ చేశారు. తొలిసారిగా భార‌త‌దేశంలో ఇలాంటి వినూత్న ప‌థ‌కానికి శ్రీకారం చుట్టిన‌ట్లు క‌లెక్ట‌ర్ సుధీర్ శ‌ర్మ తెలిపారు. టాయ్‌లెట్స్ క్ర‌మం త‌ప్ప‌కుండా వాడిన వారికి ప్రతినెలా రూ.2వేల 500 బ‌హుమానం ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌ని దీంతో 1500 కుటుంబాల‌కు లబ్ధి చేకూరుతుంద‌ని అన్నారు. ఈ ప‌థ‌కం మంచి ఫ‌లితాలు సాధిస్తే ఇత‌ర ప్రాంతాల్లోకూడా అమ‌లు చేస్తామ‌ని సుధీర్ శ‌ర్మ వివ‌రించారు.

ప్ర‌చారానికి సోనియా దూరం

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ త‌గిలింది. ఆ పార్టీ అధ్య‌క్షురాలు, స్టార్ క్యాంపెయిన‌ర్ సోనియా గాంధీ ప్రచారానికి దూరంగా ఉండాల‌ని నిర్ణయించారు. ఎలాంటి ర్యాలీలు, స‌భ‌ల్లో సోనియా పాల్గోవ‌డం లేదు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న సోనియా.. పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాల‌కు కూడా స‌రిగా హాజ‌రుకాలేదు. అయితే ప్ర‌చారం చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం ఆమె ఆరోగ్యం కాద‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. పార్టీ 40 మంది స్టార్ క్యాంపెయిన‌ర్స్‌లో సోనియా అగ్ర‌స్థానంలో ఉన్నా.. ఆమె మాత్రం సాధ్య‌మైనంత వ‌ర‌కు రాహుల్ గాంధీకే ప్ర‌చార బాధ్య‌త‌లు ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. యూపీ సీఎం అఖిలేష్‌తో క‌లిసి రాహుల్ సంయుక్తంగా ర్యాలీలు, స‌భ‌లు నిర్వ‌హించ‌నున్నారు. కాంగ్రెస్‌, స‌మాజ్‌వాదీ మ‌ధ్య స‌యోధ్య కుదిర్చింది సోనియా కూతురు ప్రియాంకా గాంధీ. అటు అఖిలేష్ తండ్రి ములాయం కూడా తాను యూపీలో ప్ర‌చారానికి దూరంగా ఉంటాన‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. శ‌నివారం ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న పంజాబ్‌, గోవాల్లో మ‌రో రెండు రోజుల్లో ప్ర‌చారం ముగియ‌నుంది.

జ‌ల్లిక‌ట్టు చ‌ట్టంపై స్టే నిరాకరించిన సుప్రీం

జ‌ల్లిక‌ట్టుపై త‌మిళ‌నాడు అసెంబ్లీ తీసుకొచ్చిన చ‌ట్టంపై సుప్రీంకోర్టు స్టే విధించ‌లేదు. అయితే ఆందోళ‌న‌ల‌పై మాత్రం తీవ్ర అసంతృప్తి వ్య‌క్తంచేసింది సుప్రీంకోర్టు. జ‌ల్లిక‌ట్టు నిర్వ‌హ‌ణ‌పై తాము గ‌తేడాది స్టే విధిస్తే, ఇప్పుడు ఆందోళ‌న చేయ‌డమేంట‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. ఇలాంటివి మ‌ళ్లీ జ‌ర‌గ‌కూడ‌ద‌ని ఆదేశించింది. అయితే జ‌ల్లిక‌ట్టు నిర్వ‌హించుకునేలా రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త చ‌ట్టంపై మాత్రం స్టే విధించ‌లేదు. త‌మిళ‌నాడు తీసుకొచ్చిన చ‌ట్టంపై ఎన్జీవోలు దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై సుప్రీం విచార‌ణ జ‌రిపింది. కానీ స్టే ఇవ్వడానికి నిరాకరించింది.

బడ్జెట్ ఆశ : హోంలోన్ వడ్డీ తగ్గుతుందా!

బడ్జెట్ – 2017పై భారీ ఆశలు పెట్టుకున్నారు జనం. నోట్ల రద్దు తర్వాత వస్తున్న బడ్జెట్ కావటంతో.. జనంలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే వరాల మూట ప్రిపరేషన్ జరుగుతుంటే.. జనం మాత్రం పెద్ద ఎత్తున ఆర్థిక శాఖకు రికమండేషన్స్ పంపిస్తున్నారు. లక్షల రిక్వస్ట్ లు వస్తున్నా.. అన్నింటిలో టాప్ 5లో ఉన్న డిమాండ్ మాత్రం గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గింపు. మధ్య తరగతి ఈ ప్రకటనపై కోటి ఆశలతో ఉన్నారు. ప్రస్తుతం రూ.12లక్షల గృహ రుణంపై మూడుశాతం, రూ.9లక్షల వరకు ఉండే లోన్లపై 4శాతం వడ్డీ రాయితీ లభిస్తోంది. టైర్‌ 3 పట్టణాలే లక్ష్యంగా దీనిని అమలులోకి తెచ్చారు. దీన్ని పెద్ద నగరాలకు కూడా వర్తింప జేస్తే అక్కడ ఉండే మధ్య తరగతి వర్గానికి కొంతైనా ఉపశమనం లభిస్తుంది. ఇళ్ల కొనుగోలుపై వడ్డీ తగ్గింపు ప్రకటన ఉంటుందనే ఆశ పెట్టుకున్నారు సిటీ జనం. నోట్ల రద్దు తర్వాత రేట్లు దిగి వస్తాయని ఆశిస్తున్నారు. బడ్జెట్ ప్రిపరేషన్ లో ఉన్న కేంద్రానికి ఈ విషయంపై లక్షల సంఖ్యలో వినతులు వచ్చాయంట. దేశవ్యాప్తంగా వచ్చిన డిమాండ్లలో టాప్ 5లో ఇళ్ల రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించాలని ఉందంట. దీంతో కేంద్రం ఈ విషయంపై సీరియస్ గా ఆలోచిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రియాల్టీ రంగం ఊపందుకోవటానికి కూడా వడ్డీ రేట్ల తగ్గింపు బూస్టింగ్ ఇస్తుందంటున్నారు.

ఉచిత విద్య, రైతు రుణమాఫీ : బీజేపీ

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీనే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా. మూడింట రెండొంతుల మెజార్టీని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి శనివారం లక్నోలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు అమిత్ షా. యూపీలో అధికారంలోకి వస్తే యువకులకు 1 జీబీ ఇంటర్నెట్‌ సదుపాయంతో ఉచితంగా ల్యాప్‌ టాప్‌ లను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.. దీనికి ‘లోక్ కల్యాణ్‌ సంకల్ప పత్ర’గా నామకరణం చేశారు. అధికారంలోకి రావడమే లక్ష్యంగా జనాకర్షక పథకాలను ప్రకటించారు. రైతుల రుణాలను మాఫీ చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. రాజ్యాంగానికి లోబడి రామమందిరాన్ని నిర్మాస్తామని హామీ ఇచ్చారు. అన్ని యూనివర్శిటీల్లో ఉచిత వై ఫై సదుపాయం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూపీ బీజేపీ చీఫ్‌ కేశవ్ ప్రసాద్‌ మౌర్య, యోగి ఆదిత్యనాథ్‌ పాల్గొన్నారు. వచ్చే ఐదేళ్లకు రాష్ట్ర వ్యవసాయాభివృద్ధికి 150 కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అవినీతి రహిత సుపరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు. మహిళల విద్యకు, ఆరోగ్య రంగానికి ప్రాధాన్యం ఇస్తామని.. ఉద్యోగాల్లో 90 శాతం స్థానికులకే ఇస్తామని హామీ ఇచ్చారు. ల్యాండ్‌ మాఫియా అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. సాగునీటి కోసం 20 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని వెల్లడించారు. ఇంటర్‌ వరకు ఉచిత విద్యను అందిస్తామని,  పేదలకు గరీబ్‌ కల్యాణ్‌ కార్డులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. పోలీస్‌ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. ప్రపంచ స్థాయి వసతులతో 10 కొత్త యూనివర్శిటీలను ఏర్పాటు చేస్తామని  తెలిపారు అమిత్ షా