తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా చూపిస్తాం : రాహుల్

rahulకొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ వైస్ ప్రసిడెంట్ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. తెలంగాణ పర్యటనలో భాగంగా నిజామాబాద్ డిచ్ పల్లి సభలో మాట్లాడారు రాహుల్. టీఆర్ఎస్ పుట్టక ముందే కాంగ్రెస్ తెలంగాణ తీర్మాణం చేసిందని గుర్తు చేశారు. కేసీఆర్ తమ ఇంట్లో ఒక మాట మాట్లాడి బయట మరో మాట మార్చాడన్నారు. తమ ఇంటికి వచ్చి ఎప్పటికీ మీతోనే ఉంటామని మాట ఇచ్చి,   మాట తప్పి వెన్నుపోటు పొడిచారన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ వెనక్కి వెళ్లలేదన్నారు. తెలంగాణను బీజేపీ, టీడీపీ, వైసీపీలు వ్యతిరేకించాయన్నారు. అధికారంలోకి వస్తే తెలంగాణలో 4వేల మెగావాట్ల విద్యత్ ప్రాజెక్టు నిర్మిస్తామన్నారు. తెలంగాణకు 10 ఏళ్లపాటు ట్యాక్స్ హాలిడే అమలు చేస్తామన్నారు. హైదరాబాద్ ఆదాయం తెలంగాణకు చెందుతుందన్నారు. ప్రాణహిత చేవెళ్ల, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చి పూర్తి చేస్తామన్నారు. తెలంగాణ యువకులు రాష్ట్ర అభివృద్ధిలో పాల్గొనాలన్నారు.

తెలంగాణ అభివృద్ధిలో యువత పాలుపంచుకోవాలి :

ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ఏ వస్తువును చూసినా మేడ్ ఇన్ చైనా అని కనిపిస్తుందన్నారు. చైనాలో తయారైన వాటిని కొంటే ఆదాయమంతా చైనాకే వెళ్తుందన్నారు. రాబోయే రోజుల్లో మేడ్ ఇన్ తెలంగాణ అని చూడాలని ఆకాంక్షించారు. అమెరికా, జపాన్, జర్మనీ.. ఇలా ఏ దేశ మన వస్తువులు కొన్నా మేడ్ ఇన్ తెలంగాణ అనే ముద్ర ఉండాలన్నారు. ఆ సంతృప్తి తెలంగాణ ప్రజల్లో చూడాలని ఆకాంక్షించారు. ఇదంతా టీఆర్ఎస్ తో సాధ్యం కాదన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మూడు హామీలు ఇచ్చారు. పేదలకు పక్కా ఇళ్లు, వృద్ధులకు పెన్షన్లు, విద్యా వైద్య సదుపాయాలు కల్పిస్తామన్నారు. దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించామని, పేదవాడికి 100 రోజుల ఉపాధి ఇచ్చామన్నారు. కోటి మంది విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దే నన్నారు. ఉచిత వైద్య సదుపాయం, ఆపరేషన్లకు సదుపాయాలు కల్పిస్తానన్నారు. 50 శాతం మహిళా రిజర్వేషన్లు, 2 వేల మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు.  స్వయం సేవక బృందాల అమలు ఏపీలో బాగా జరిగిందని, దీన్ని దేశ వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. దేశ వ్యాప్తంగా 15 కోట్ల మందిని దారిద్ర్యరేఖనుంచి బయటికి తెచ్చామన్నారు. వచ్చే 5 ఏళ్లలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్లను మధ్యతరగతి ప్రజలుగా మారుస్తామని హామీ ఇచ్చారు. పిల్లల కోసం పాఠశాలలు, కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇవన్నీ కావాలంటే తెలంగాణతో పాటు, ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ ను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.