ప్ర‌జ‌ల మ‌నిషి బొమ్మ‌గాని ధ‌ర్మ‌బిక్షం

ప్ర‌పంచ చ‌రిత్ర‌లో సామాన్యులు అత్యంత శ‌క్తివంత‌మైన రాచ‌రికాన్ని కూక‌టివేళ్ల‌తొ పెక‌లించేందుకు సాగించిన‌ పోరు మ‌హ‌త్త‌ర‌ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. క‌ట్టుబానిస‌త్వం, వెట్టిచాకిరి నుంచి స్వేచ్ఛ‌, స్వాతంత్ర్యం, స‌మాన‌త్వం కోసం క‌ర్క‌శ నిజాం నిరంకుశ పాల‌న‌పై ఉక్కు పిడికిలి బిగించిన ఈ అస‌మాన పోరు భార‌తావ‌నికి పోరాట ప‌టిమ‌, త్యాగం, నిస్వార్థం, నిజాయితీ, నిబ‌ద్ధ‌త‌లాంటి అనేక‌ గొప్ప సామాజిక‌, రాజ‌కీయ‌, నైతిక విలువ‌ల‌ను అందించింది. ‘జీవిత‌మే ప్ర‌జ‌లు… ప్ర‌జ‌లే జీవితం’గా ఆజ‌న్మాంతం స‌మాజం కోసం నిల‌బ‌డి పోరాడే ఎంద‌రో యోధుల‌ను తీర్చిదిద్దింది. అలాంటి సంగ్రామ సింహాల్లో అగ్ర‌జుడు, తొలిత‌రం యోధుడు బొమ్మ‌గాని ధ‌ర్మ‌బిక్షం. నిజాం ప్ర‌భువు, ఆయ‌న తాబేదార్ల రాక్ష‌స పాల‌న‌, ఆకృత్యాల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌జా ఉద్య‌మ సేనానిగా త‌న‌ను తాను తీర్చిదిద్దుకున్నాడు. పాఠ‌శాల విద్యార్థిగా నిజాం ప్ర‌భువు ప‌ట్టాభిషేక ర‌జ‌తోత్స‌వ వేడుక బ‌హిష్క‌ర‌ణ‌తో మొద‌లైన ధిక్కార స్వ‌రం… ఆ త‌ర్వాత ప్ర‌జాస్వామ్య ప్ర‌భువుల వ‌ద్ద కూడా వెర‌వ‌కుండా సాగింది. దాదాపు ఏడు ద‌శాబ్ధాల పాటు ప్ర‌జా ఉద్య‌మాలే ఉచ్ఛ్వాస‌, నిశ్వాస‌లుగా ఎదిగి ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మైన అరుదైన నాయ‌కుడాయ‌న‌. ప్ర‌తి మ‌లుపులో ప్ర‌జ‌లు, ప్ర‌జా ఉద్య‌మాల ప‌క్షాన నిల‌బ‌డి జిల్లా, రాష్ట్ర‌, కేంద్ర స్థాయి నేత‌గా ఎదిగి తుది శ్వాస వ‌ర‌కు రాజీప‌డ‌కుండా అవిశ్రాంతంగా పోరాడిన నిశ్వార్థ‌, నిరాడంబ‌ర యోగిపుంగ‌వుడు ప్ర‌జ‌ల మ‌నిషి బొమ్మ‌గాని ధ‌ర్మబిక్షం. జీవితాంతం క‌ట్టుబ‌డి నిర్వ‌ర్తించిన సామాజిక ధ‌ర్మ‌మే త‌ల్లిదండ్రులు పెట్టిన ‘బిక్షం’ పేరు ప్రజల్లో ధ‌ర్మ‌బిక్షంగా స్థిర‌ప‌డిపోయేలా చేసింది.
బొమ్మ‌గాని ముత్తు లింగం, గోప‌మ్మ దంప‌తుల‌కు 1922 ఫిబ్ర‌వ‌రి 15న జ‌న్మించాడు ధ‌ర్మ‌బిక్షం. ఆయ‌న‌ స్వ‌స్థ‌లం న‌ల్ల‌గొండ జిల్లా మారుమూల ప్రాంత‌మైన మునుగోడు మండ‌లం ఊకొండి గ్రామం. కొంత కాలానికి వారి కుటుంబం సూర్యాపేట ప‌ట్ట‌ణంలో స్థిర‌ప‌డింది. నిజాం రాచ‌రికానికి ఎదురులేకుండా సాగుతున్న రోజులవి. ఆ రోజు సూర్యాపేట‌ ఉన్న‌త పాఠ‌శాల‌లో నిజాం ప‌ట్టాభిషేక ర‌జ‌తోత్స‌వం. విద్యార్థిగా విద్యార్థులంద‌రినీ కూడ గ‌ట్టి పాఠ‌శాల‌లో ర‌జ‌తోత్స‌వం వేడుక‌ల‌ను విజ‌య‌వంతంగా బ‌హిష్క‌రించి… నూనూగు మీసాల వ‌య‌సులోనే నిరంకుశ నిజాం రాచ‌రికాన్ని ఎదురించిన ధీరుడు ధ‌ర్మ‌భిక్షం. పాఠ‌శాల విద్యార్థిగా ఉన్న‌కాలంలో దేశ స్వాతంత్ర్య పోరాటం, నిరంకుశ నిజాం పాల‌న‌, మున‌గాల ప‌ర‌గ‌ణాలో జ‌రుగుతున్న రైతు పోరాటాల ప్ర‌భావంతో పాఠ‌శాల విద్యార్థిగానే నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు పుణికి పుచ్చుకున్నారు.
నిరంకుశ పాల‌న‌, దోపిడీ, అన్యాయాల‌కు వ్య‌తిరేకంగా మ‌న‌సులో బ‌ల‌మైన భీజాలు నాటుకున్నాయి. దానికి తోడైన అభ్యుద‌య సాహిత్యం చైతన్యాన్ని ర‌గిలించి ఆయ‌న ద‌శ‌దిశ‌ను మార్చివేసింది. దేశ స్వాతంత్ర్యం కోసం, నిజాం రాక్ష‌స పాల‌న నుంచి తెలంగాణ నేల విముక్తి కోసం పోరుదారి ప‌ట్టారు. స్వాతంత్ర్య పోరాటంలో క్రియాశీల‌క కార్య‌క‌ర్త‌గా ప‌నిచేస్తూనే పేద విద్యార్థుల కోసం సూర్యాపేట‌లో విద్యార్థి వ‌స‌తిగృహం(హాస్ట‌ల్‌)ను ప్రారంభించాడాయ‌న‌. న‌ల్ల‌గొండ జిల్లా విద్యార్థి సంఘ స్థాప‌న‌కు, విద్యార్థి ఉద్య‌మ నిర్మాణానికి ఆ హాస్ట‌ల్ వేదికైంది. ప్ర‌ముఖ కాంగ్రెస్ నాయ‌కుడు, మాజీ మంత్రి ఉప్పునూత‌ల పురుషొత్తం రెడ్డి, సీపీఎం అగ్ర‌నేత మ‌ల్లు వెంక‌ట న‌ర్సింహ రెడ్డి, త‌దిత‌ర నేత‌లు ఈ హాస్ట‌ల్‌లో ఆశ్ర‌యం పొంది చ‌దువుకుని ఎదిగిన వారే. అంతేకాకుండా ప‌లువురు ఐఎఎస్‌, ఐపీఎస్, సీనియ‌ర్ అధికారులైన వారు కూడా ఉన్నారు. స్వాతంత్రోద్య‌మ కార్య‌క్ర‌మాల్లో నిత్యం తీరిక‌లేకుండా ఉన్న‌ప్ప‌టికీ… హాస్ట‌ల్ నిర్వ‌హ‌ణ కోసం ప్ర‌జ‌ల నుంచి బిచ్చం ఎత్తేవాడు. ఆ విధంగా ప్ర‌జ‌ల వ‌స్త‌వులు, స‌రుకుల రూపంలో తెచ్చి హాస్ట‌ల్ నిర్వ‌హించి, విద్యాభ్యున్నతి కోసం ఒక అద్భుత‌మైన న‌మూనాను స‌మాజానికి అందిచ్చిన దార్శ‌నికుడాయ‌న‌. అందుకే ఆ హాస్ట‌ల్ వార్షికోత్స‌వానికి ముఖ్య అతిథిగా వ‌చ్చిన రాజా బ‌హ‌దుర్ వెంక‌ట్రాం రెడ్డి అక్క‌డికి వ‌చ్చిన జ‌న సందోహాన్ని చూసి ఆశ్చ‌ర‌చ‌కితుడై విష‌యం తెలుసుకుని ‘భిక్షం మాంగా ధ‌ర్మ్ కియా ఇన్‌కా నామ్ ధ‌ర్మ్‌భిక్షు హై’ అని సంభోదించారు. అప్ప‌టివ‌ర‌కు బొమ్మ‌గాని భిక్షంగా ఉన్న ఆయ‌న‌ను ప్ర‌జ‌లు ధ‌ర్మ‌భిక్షం అని పిల‌వ‌డం ప్రారంభిచార‌ట‌. ఆ పేరు ఆరు ద‌శాబ్ధాల త‌ర్వాత ఒక అద్భుత‌, అరుదైన‌, అసాదార‌ణ‌, అవ్య‌క్త‌మైన‌, అపురూప‌-అస‌మాన వ్య‌క్తిత్వానికి రూప‌మైంది.
మొద‌ట జాతీయ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌గా, ఆ త‌ర్వాత ఆర్య స‌మాజ్ కార్య‌క‌ర్త‌గా ప‌నిచేసిన ఆయ‌నలోని చైత‌న్యం, ప్ర‌శ్నించేత‌త్వం, తిరుగుబాటుత‌త్వం అక్క‌డ ఇమ‌డ‌నీయ‌లేదు. ఆయ‌న స‌హ‌జ‌శీల స్వ‌భావం ఆంధ్ర మ‌హాస‌భ వైపు అడుగులు వేయించింది. ఆంధ్ర మ‌హాస‌భ కార్య‌క‌ర్త‌గా ప‌నిచేస్తూనే 1942లో క‌మ్యూనిస్టు పార్టీల చేరాడు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌కోసం రాజ‌కీయ‌, సైద్ధాంతిక వైరుధ్యాల‌ను ప‌క్క‌న‌బెట్టి సంఘ‌టిత‌మై పోరాడిన‌ట్లుగానే… ఆనాడు నిజాం దాష్టీకాన్ని తుది ముట్టించేందుకు ఆంధ్ర మ‌హాస‌భ నాయ‌క‌త్వంలో స‌బ్బ‌న్న‌వ‌ర్గాలు మ‌హ‌త్త‌ర తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చాయి. పుచ్చ‌ల‌ప‌ల్లి సుంద‌ర‌య్య, రావి నారాయ‌ణ రెడ్డి, భీం రెడ్డి న‌ర్సింహ‌రెడ్డి, దేవుల‌ప‌ల్లి వెంక‌టేశ్వ‌ర రావు, చాక‌లి ఐల‌మ్మ‌, వ‌ట్టికోట ఆళ్వార్ స్వామి, దాశ‌ర‌థి కృష్ణ‌మాచారి వంటి యోధానుయోధుల‌తో క‌లిసి న‌డిచాడు. తెలంగాణ విముక్తికోపం పోరుస‌ల్పిన‌ ఎంద‌రో భార్యాబిడ్డ‌లు, ఆస్తులు, వ్య‌క్తిగ‌త జీవితాల‌ను త్య‌జించి ఉద్య‌మాల‌కు జీవితాన్ని అర్పించిన సంద‌ర్భ‌మ‌ది. ఉద్య‌మ అవ‌స‌రాల రీత్యా యువ‌కులు కొంత‌కాలం పెళ్లి చేసుకోవద్ద‌న్న సూచ‌న‌ను అంద‌రి క‌న్న ముందుగా ఆహ్వానించి, ఆచ‌రించి అంద‌రికీ ఆద‌ర్శంగా నిలిచిన మ‌హోన్న‌త వ్య‌క్తిత్వం ఆయ‌నిది. ఆయ‌న ఆద‌ర్శం, ఆచ‌ర‌ణ ఉద్య‌మానికే గ‌ర్వ‌కార‌ణంగా, గీటురాయిగా నిలిచింది. నూనూగు మీసాల య‌వ్వ‌నంలో పుణికి పుచ్చుకుని, తుది శ్వాస విడిచేంత వ‌ర‌కు జీవితాంతం ఆ విలువ‌ల‌ను ఆచ‌రించి వాటికే వ‌న్నె తెచ్చిన‌ నిఖార్సైన వ్య‌క్తిత్వం ఆయ‌నిది. వామ‌ప‌క్ష, విప్ల‌వోద్య‌మాల‌లోనూ నేటికీ ఆ విలువ‌లే ప్రామాణికంగా ఉన్నాయి.

ఆయ‌న జీవిత‌మంతా ఆటుపోట్లు, అరెస్టులు, అజ్ఞాతం, అర‌ణ్య‌వాసాలే. జ‌న‌గామ తాలూకా విసునూరు దేశ్‌ముఖ్‌కు వ్య‌తిరేకపోరాటానికి సంఘీభావంగా సూర్యాపేట‌లో సార్వ‌త్రిక స‌మ్మె చేయించినందుకు ఆయ‌న‌పై నిజాం ప్ర‌భుత్వం 1946లో అరెస్టు వారెంట్ జారీ చేయ‌డంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయ‌న్ను ప్ర‌మాద‌క‌ర‌మైన వ్య‌క్తిగా భావించిన నిజాం ప్ర‌భుత్వం వెంటాడివేటాడి 1948లో అరెస్టుచేయ‌డంతో… న‌ల్ల‌గొండ‌, చంచ‌ల్‌గూడ‌, గుల్బ‌ర్గా, ఔరంగాబాద్ జైళ్ల‌లో ఐదున్న‌ర సంవ‌త్స‌రాల పాటు క‌ఠిన‌కారాగార శిక్ష‌ను అనుభ‌వించారు. ఈ క్ర‌మంలోనే ఉవ్వెత్తున ఎనిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నిజాం రాచ‌రికాన్ని కూక‌టివేళ్ల‌తో పెకిలించింది. హైద‌రాబాద్ సంస్థానం భార‌త్ యూనియ‌న్‌లో విలీన‌మైంది. ఈ క్ర‌మంలో 1952లో జ‌రిగిన తొలిసార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో న‌కిరేక‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పీపుల్స్ డెమొక్ర‌టిక్ ఫ్రంట్‌(పిడిఎఫ్) అభ్య‌ర్థిగా పోటీచేసి, అంద‌రికంటే ఎక్కువ మెజారిటీతో తొలి శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. 1957లో రెండోసారి, ఆ త‌ర్వాత 1962లో న‌ల్ల‌గొండ అసెంబ్లీ స్థానానికి శాస‌న స‌భ్యుడిగా… 1991, 1996లో న‌ల్ల‌గొండ లోక్‌స‌భ స్థానానికి పార్ల‌మెంట్ స‌భ్యుడిగా బ్ర‌హ్మండ‌మైన మెజారిటీతో గెలుపొందారు.

అదే స‌మ‌యంలో త‌న కుల వృత్తి అయిన క‌ల్లుగీత కార్మికుల ద‌య‌నీయ స్థితిన గ్ర‌హించిన ఆయ‌న వారి హ‌క్కులు, వృత్తి ప‌రిర‌క్ష‌ణ‌కోసం 1956లోనే గీత ప‌నివారల సంఘం ఏర్పాటుచేసి, ల‌క్ష‌లాది మంది క‌ల్లుగీత కార్మికుల‌ను కూడ‌గ‌ట్టి దేశంలోనే వృత్తి పోరాటాల‌కు ఆధ్యుడయ్యాడు. ఆ త‌ర్వాత ఎన్నో వృత్తిదారుల పోరాటాల‌కు మార్గ‌ద‌ర్శి అయ్యాడు. భూస్వాముల ఆగ‌డాల నుంచి క‌ల్లు గీత ప‌నివార‌ల భ్ర‌ద‌త కోసం ‘గీసే వాడిదే చెట్టు’ నినాదంతో జాతీయ స్థాయిలో నిర్దిష్ట విధాన రూప‌క‌ల్ప‌న‌లో ముఖ్య‌భూమిక పోషించి.. క‌ల్లు గీత కార్మికుల రెండు క‌ళ్లు అయ్యాడు. దేశంలోనే గీత‌కార్మికుల బ‌తుకు భ‌గ‌వ‌ధ్గీతాచార్యుడయ్యాడు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడిగా, ప్ర‌జా పోరాటాల నాయ‌కుడిగా, లోక్‌స‌భ స‌భ్యుడిగా, శాస‌న స‌భ్యుడిగానూ ప్ర‌జ‌ల వాణి వినిపించి త‌న ధ‌ర్మాన్ని నిఖార్సుగా నిర్వ‌ర్తించి సార్థ‌క‌నామ‌ధేయుడ‌య్యాడు. నూనూగు మీసాల వ‌య‌సులోనే క‌ర్క‌శుడైన నిజాం రాచ‌రికాన్ని ధిక్క‌రించడంతో మొద‌లైన జీవిత ప్ర‌స్థానం 2011, మార్చి26న తుది శ్వాస విడిచేంత వ‌ర‌కు ఏడు ద‌శాబ్ధాల పాటు ప్ర‌జా ఉద్య‌మాలే ఉచ్ఛ్వాస‌, నిశ్వాస‌లుగా సాగింది. ‘పుట్టుక ఒక‌టే త‌న‌ది – బ‌తుకంతా ప్ర‌జ‌ల‌ది… జీవ‌మొక‌టే త‌న‌ది – జీవితం ఉద్య‌మాల‌ది… అన్యాయం ఎదురైతే నిప్పులు కురిసిన క‌న్నులు… రాచ‌కొండ గుట్ట‌ల‌పై తుప్పులు న‌రికిన చేతులు… నిజాయితీకి నిలువెత్తు రూపం… పోరాట‌పు అనుభ‌వాలు పండిన త‌ల వెండికొండ‌- నేల‌పై న‌డుస్తున్న ఆర‌డ‌గుల ఎర్ర‌జెండా… స‌మ‌స‌మాజ ల‌క్ష్యం-ఎరుపెక్కిన వృక్షం… పీడిత జ‌న‌ప‌క్షం బొమ్మ‌గాని ధ‌ర్మ‌బిక్షం…’ అంటూ ప్ర‌జాక‌వి సుద్దాల అశోక్ తేజ నివాళుల‌ర్చించారు. ఆ మ‌హ‌నీయుడి జీవితం ఈ త‌రం ఉద్య‌మ‌కారులు, సామాజిక జీవితంలో ఉండేవారికి ఆచ‌ర‌ణీయం.
(ఈ రోజు… మార్చి26 నాడు ఆయ‌న వ‌ర్థంతి సంద‌ర్భంగా ఆ మ‌హానీయుడికి వంద‌నాల‌తో)
* * *

ప‌ల్లె ర‌వి కుమార్‌
ఉపాధ్య‌క్షుడు, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(TUWJ)
Email: palleravi@live.com

‘మ‌హా’సంక‌ల్పం… ఒక భ‌రోసా!

cm kcr

తెలంగాణ‌కు ఉత్త‌ర, ద‌క్షిణ స‌రిహ‌ద్దులుగా ఉన్న‌జీవ‌న‌దులు కృష్ణా, గోదావ‌రి న‌దులు రాష్ట్రం గుండా వంద‌ల‌ కిలోమీట‌ర్లు ప్ర‌వ‌హిస్తున్న‌ప్ప‌టికీ సాగునీరు లేక ‘బీడువారిన భూముల‌ను స‌స్య‌శ్యామ‌లం.. తెలంగాణ‌ను కోటి ఎక‌రాల మాగాణం’ చేయాల‌న్న‌ది ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు సంక‌ల్పం. గోదావరి జ‌లాల‌ను ఒడిసి ప‌ట్టి తెలంగాణ బీడు భూముల‌ను స‌స్య‌శ్యమ‌లం చేయాల‌న్న‌ది ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేక‌ర్ రావు సంక‌ల్పం. ఆ మ‌హ‌త్సంక‌ల్పాన్ని నెర‌వేర్చే కార్యాచ‌ర‌ణ రూప‌క‌ల్ప‌న‌కు ఆయ‌న అహోరాత్రులు శ్ర‌మించారు. న‌దుల్లో నీటి ల‌భ్య‌త‌, ముంపు, ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌స్య‌లు, పొరుగున ఉన్న మ‌హ‌రాష్ట్ర‌తో నాలుగు ద‌శాబ్ధాలుగా అప‌రిష్కృతంగా ఉన్న జ‌ల వివాదం త‌దిత‌ర అంశాల‌పై  ఎంతో మంది సాగు నీటిరంగ నిపుణులు, ఇంజ‌నీర్లు, అధికారుల‌తో రాత్రింబ‌వ‌ళ్లు త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డ్డారు. కోటి ఎక‌రాల మాగాణి చేయాల‌న్న స్వ‌ప్నం సాకారం చేయ‌డానికి స‌ముద్రంలో వృథాగా క‌లిసిపోయే గోదావ‌రి జ‌లాల ఒడిసిప‌ట్టి పూర్తిగా వినియోగించుకోవ‌డ‌మొక్క‌టే శ‌ర‌ణ్య‌మ‌ని భావించి… ఆ దిశ‌లో యేడాది పాటు సాగిన మేధోమ‌థ‌నం నుంచి రూపుదిద్ధుకున్న‌వే గోదావ‌రి, దాని ఉప‌న‌దులైన ప్రాణ‌హిత‌, పెన్ గంగల‌పై నిర్మించ త‌ల‌పెట్టిన కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భాగంగా మేడిగ‌డ్డ‌(146.82టీఎంసీలు), త‌మ్మిడిహ‌ట్టి(14.4టీఎంసీలు), చ‌నాకా-కొరాట(5.12టీఎంసీలు) బ్యారేజీలు. వీలైనంత త్వ‌ర‌గా ఆ  మ‌హ‌త్సంక‌ల్పాన్ని పూర్తిచేయ‌డానికి- అద్భుత‌మైన రాజ‌నీతితో రెండు రాష్ర్టాల ప్ర‌యోజ‌నాలు నెర‌వేరేలా తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిపాధించిన ప్రాజెక్టుల‌కు మ‌హ‌రాష్ర్ట ప్ర‌భుత్వం అంగీక‌రించ‌క త‌ప్ప‌లేదు. దీంతో నాలుగు ద‌శాబ్ధాలుగా  ఆ రాష్ట్రంతో కొన‌సాగుతున్న జ‌ల వివాదాల‌కు చ‌ర‌మ‌గీతం పాడిన‌ట్ల‌యింది. ఏళ్ల త‌ర‌బ‌డి పెండింగ్‌లో ఉన్న ప‌లు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల‌కు అడ్డంకులు తొల‌గిపోవ‌డంతో… నిత్యం క‌రువు, కాట‌కాల‌తో త‌ల్ల‌డిల్లుతున్న తెలంగాణ రైతాంగానికి ఒక భ‌రోస క‌లిగింది. ఈ విష‌యంలో భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు గానీ, ఇది స‌బ్బ‌న్న వ‌ర్గాలు అంగీక‌రించిన వాస్త‌వం.  అందుకే మ‌హారాష్ట్రతో రాష్ట్ర ప్ర‌భుత్వం కుదుర్చుకున్నచ‌రిత్రాత్మ‌క  ఒప్పందం ప‌ట్ల స‌ర్వ‌త్రా ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.

  నీళ్లు లేక‌ నెర్రెలు బారిన తెలంగాణ బీడు భూముల‌ను స‌స్య‌శ్యామ‌లం చేసేందుకు, తెలంగాణ సాగునీటి రంగం ద‌శ‌-దిశ‌ను మార్చే అపురూప‌మైన ఘ‌ట్టానికి ఈ సంవ‌త్స‌రం మార్చి8న ముంబై వేదిక‌గా ప్రాథ‌మిక భూమిక ఏర్ప‌డింది. అంత‌కు ముందు, ఆ త‌ర్వాత సాగునీటి పారుద‌ల శాఖ మంత్రి టి.హ‌రీశ్ రావు ప‌లుమారు మ‌హారాష్ట్ర అధికారులు, మంత్రుల‌తో స‌మావేశ‌మై వారి సందేహాలు, భ‌యాల‌ను నివృత్తి చేయ‌డం ద్వారా గోదావ‌రి, దాని ఉప‌న‌దుల‌పై నిర్మించ‌త‌ల‌పెట్టిన చ‌నాకా-కొరాట‌(పెన్‌గంగ‌), త‌మ్మిడిహ‌ట్టి(ప్రాణ‌హిత‌), మెడిగ‌డ్డ(గోదావ‌రి) బ్యారేజీల ఒప్పందంపై రెండు రాష్ట్రాల ముక్య‌మంత్రులు క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేక‌ర్ రావు, దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ మంగ‌ళ‌వారం(ఆగ‌స్టు23న‌) ముంబైలోని స‌హ్యాద్రి అతిథిగృహం వేదిక‌గా సంత‌కాలు చేశారు. నీటికోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా సుదీర్ఘ పోరాటాలు జ‌రుగుతున్న రోజులివి. అంతెందుకు న‌దీ జ‌లాల కోసం మ‌న దేశంలోనే క‌ర్నాట‌క‌-త‌మిళ‌నాడు, కేర‌ళ‌-త‌మిళ‌నాడు, ఒడిశా-ఛ‌త్తీశ్‌గ‌ఢ్‌, హ‌ర్యానా-పంజాబ్ త‌దిత‌ర రాష్ట్రాలు నిరంత‌రం సంఘ‌ర్షించుకుంటూనే ఉన్నాయి… ఇలాంటి త‌రుణంలో కేంద్ర ప్ర‌భుత్వం జోక్యం లేకుండానే రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు చొర‌వ తీసుకుని చ‌ర్చ‌లు, సంప్ర‌దింపులు, ప‌ర‌స్ప‌ర స‌హ‌కార దోర‌ణితో సామ‌ర‌స్య‌పూర్వ‌క వాతావ‌ర‌ణంలో ఒప్పందం కుదుర్చుకుని నాలుగు ద‌శాబ్ధాలుగా కొన‌సాగుతున్న వివాదానికి స్వ‌స్తి ప‌ల‌క‌డం ముమ్మాటికీ శుభ‌ప‌రిణామ‌మే. తాజా ఒప్పందంతో సాగుయోగ్యమైన‌ ప్ర‌తి ఎక‌రానికి సాగునీరందించి తెలంగాణ‌ను స‌స్య‌శ్యామ‌లం చేయాల‌న్న మ‌హాసంక‌ల్పసిద్ధిలో మ‌రో అడుగు ముందుకు ప‌డింది. ఐదున్న‌ర ద‌శాబ్ధాలుగా సాగిన తీవ్ర నిర్ల‌క్ష్యం, అణ‌చివేత‌, దోపిడి, వివ‌క్ష‌ల మూలంగా కునారిల్లుతున్న తెలంగాణ సాగునీటి రంగం ద‌శ‌-దిశ నిర్దేశ‌నానికి్ కేసీఆర్ రాజనీతిజ్ఞ‌త‌తో అనుస‌రించిన ‘బ‌తుకు-బ‌తుక‌నివ్వు’ అన్న‌మాన‌వీయ సూత్రం అద్భుత‌మైన ఫ‌లితాన్ని ఇవ్వ‌నుంది. పంతాలు, ప‌ట్టింపుల‌కు పోయి ఇరుగు,పొరుగు రాష్రాల‌తో ఘ‌ర్ష‌ణవైఖ‌రి వ‌ల్ల స‌మ‌స్య‌ను మ‌రింత జ‌ఠిలం చేయ‌డం కంటే… ప‌ర‌స్ప‌రం ఇచ్చిపుచ్చుకునే దోర‌ణితో జ‌ల‌వివాదాన్నిప‌రిష్క‌రించుకోవ‌డం ద్వారా ప్ర‌తిపాదిత సాగునీటి ప్రాజెక్టులను స‌త్వ‌ర‌మే పూర్తి చేసుకోవ‌డానికి మార్గం సుగ‌మం చేసిన‌ట్ల‌యింది. ఈ విష‌యంలో కేసీఆర్ త‌ల‌పెట్టిన య‌జ్ఞం ఆశించిన‌ట్లుగా పూర్త‌యిన‌ట్ల‌యితే- గోదావ‌రి జ‌లాల‌తో ఉత్త‌ర తెలంగాణ స‌స్య‌శ్యామ‌లమై ప‌సిడిపంట‌లు పండ‌ట‌మే కాదు, నిత్యం క‌రువు-కాట‌కాల‌తో త‌ల్ల‌డిల్లే ద‌క్షిణ తెలంగాణ‌లోని న‌ల్ల‌గొండ‌, మెద‌క్‌, రంగారెడ్డి జిల్లాలకు సైతం గోదావ‌రి జ‌లాలు త‌ర‌లించి, అక్క‌డి రైతాంగం క‌న్నీటిని తుడ‌వ‌చ్చు.

 ఇంత‌కాలంగా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను ఏలిన సీమాంధ్ర పెద్ద‌లు- పొరుగు రాష్ట్రాలైన మ‌హారాష్ట్ర‌, క‌ర్నాట‌క‌, చత్తీష్‌గ‌ఢ్‌ల‌తో సామ‌ర‌స్య‌పూర్వ‌కంగా కాకుండా- నీటి వాటా విష‌యంలో గాని లేదా భూముల ముంపు విష‌యంలో గానీ వివాదాలు త‌లెత్తేట‌ట్లుగా తెలంగాణ ప్రాజెక్టుల డిజైన్లు ప్ర‌తిపాదించి ఏండ్ల త‌ర‌బ‌డిగా అవి పూర్తికాకుండా వ్య‌వ‌హ‌రించార‌న్న‌ది చారిత్మ‌క వాస్త‌వం. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు స‌రిహ‌ద్దుల్లో ఉండే తెలంగాణ కోసం కృష్ణా, గోదావ‌రి న‌దుల‌పై ప్ర‌తిపాదించిన‌ ప్రాజెక్టుల విష‌యంలో పొరుగు రాష్ట్రాల‌తో త‌లెత్తే వివాదాలు చ‌ర్చ‌లు, సంప్ర‌దింపుల ద్వారా సామ‌ర‌స్య‌పూర్వ‌కంగా ప‌రిష్క‌రించుకుని ప్రాజెక్టులు పూర్తి చేసే ప్ర‌య‌త్నం చేయ‌లేదు, పైగా ఆ వివాదాల‌ను మ‌రింత జ‌ఠిలం చేసేందుకు ఘ‌ర్ష‌ణ‌పూరిత వాతావ‌ర‌ణం నెల‌కొనేట‌ట్లు ఉద్దేశ్య‌పూర్వ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ద‌శాబ్ధాలుగా ఆ విధంగా కునారిల్లుతున్న‌వే ప్రాణ‌హిత‌, ఇచ్చంప‌ల్లి,  ఎల్లంప‌ల్లి, జూరాల‌, ఎస్ ఎల్ బీసీ, త‌దిత‌ర ప్రాజెక్టులు. దాంతో తెలంగాణ‌కు దిగువ‌న ఉన్న సీమాంధ్ర ప్రాజెక్టులకు కృష్ణా, గోదావ‌రి జ‌లాల‌ను య‌ధేచ్ఛ‌గా త‌ర‌లించుకుపోగ‌లిగారు.  కానీ అదేస‌మ‌యంలో సీమాంధ్ర‌కు సంబంధించిన ప్రాజెక్టులు, అక్ర‌మ ప్రాజెక్టులు- నీటి కేటాయింపులు లేనివి, అనుమ‌తుల్లేనివి యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్త‌య్యాయి. ప‌ర్య‌వ‌సానంగా బ‌చావ‌త్ ట్రిబ్యున‌ల్ కృష్ణా నిక‌ర జ‌లాల్లో తెలంగాణ‌కు కేటాయించిన 299 టీఎంసీలు, గోదావ‌రి న‌దీ జ‌లాల్లో కేటాయించిన 950టీఎంసీల నిక‌ర జ‌లాల్లో స‌గం కూడా వినియోగానికి రాలేదు. ఇంకా మిగులు జ‌లాల్లో వాటా ఎలాగూ ఉన్న‌ది. ఫ‌లితంగా తెలంగాణ‌లో 1.67 ల‌క్ష‌ల ఎక‌రాలు సాగుయోగ్యమైన భూమి ఉండ‌గా…  ప్రాజెక్టుల కింద కేవ‌లం 17ల‌క్ష‌ల ఎక‌రాలు, 40ల‌క్ష‌ల ఎక‌రాలు బావులు, బోరుబావులు కింద సాగ‌వుతున్న‌ది. మిగిలిన దాంట్లో రైతాంగానికి వ‌ర్షాధార‌మే కావ‌డంతో- వ‌ర్షాభావ ప‌రిస్థితులు నెల‌కొన్న‌ట్ల‌యితే రైతాంగం అత‌లాకుత‌లం కావ‌డం అనివార్య‌మైపోయింది. ప‌ర్య‌వ‌సానంగా తెలంగాణ‌లో శాశ్వ‌తంగా దుర్భిక్ష ప‌రిస్థితులు, ఫ్లోరైడ్‌, వెన‌క‌బాటు త‌నం, రైతుల ఆత్మ‌హ‌త్య‌లు.

ఇదిలా ఉండ‌గా మ‌రోవైపున గోదావ‌రి నిక‌ర జ‌లాల్లో తెలంగాణ‌కు 950టీఎంసీలు కేటాయిస్తే, ఇప్ప‌టివ‌ర‌కు 350టీఎంసీల‌కు మించి వాడుకోలేదు. స‌గ‌టున ప్ర‌తియేటా 2,423టీఎంసీల గోదావ‌రి జ‌లాలు వృథాగా స‌ముద్రంలో క‌లుస్తున్న‌ట్లు గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి.  ఈ సంవ‌త్స‌రం జూన్ నుంచి ఇప్ప‌టికే సుమారు 1461 టీఎంసీల నీరు స‌ముద్రం పాలైంది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్రదేశ్‌లో తెలంగాణ ప్రాజెక్టుల ప‌ట్ల సీమాంధ్ర పాల‌కులు కుట్ర‌పూరితంగా వ్య‌వ‌హ‌రించిన వైఖ‌రే ఈ దుస్థితికి కార‌ణం కాదా? ద‌శాబ్ధాలుగా కుట్ర‌లు, కుతంత్రాలకు బ‌లైన తెలంగాణ ప్రాజెక్టులు స్వీయ రాజ‌కీయ అస్థిత్వం, స్వీయ ప‌రిపాల‌న‌లోనూ విముక్తికి నోచుకోవ‌ద్దా? ఇంకా సీమాంధ్ర నేత‌ల క‌నుస‌న్న‌ల్లోనే తెలంగాణ ప్రాజెక్టులు కునారిల్లాల్సిందేనా? ఏళ్ల త‌ర‌బ‌డి సీమాంధ్ర పెద్ద‌ల దుర్భుద్ధిని చేధించి  రాజ‌కీయ పంతాలు, ప‌ట్టింపులకు పోకుండా విజ్ఞ‌త‌, బాధ్య‌త‌తో వ్య‌వ‌హ‌రించి ‘బ‌తుకుదాం-బ‌తుక‌నిద్దాం’ అన్న‌నినాదంతో 148 మీట‌ర్ల ఎత్తుకు ఒప్పందం కుదుర్చుకున్న‌ది. తాజాగా కుదుర్చుకున్న మూడు బ్యారేజీలు పూర్త‌యిన‌ట్ల‌యితే తెలంగాణ‌లోని 18ల‌క్ష‌ల ఎక‌రాల‌కు కొత్త‌గా సాగునీరందుతుంది. మ‌రో 18ల‌క్ష‌ల ఎక‌రాల‌కు స్థిరీక‌ర‌ణ జ‌రుగుతుంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం చెబుతున్న‌ట్లుగా 152 మీట‌ర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించిన‌ట్ల‌యితే తెలంగాణకు ఇంకింత ప్ర‌యోజ‌నం జ‌రుగుతుండొచ్చు, కానీ ఎగువ‌న ఉన్న మహారాష్ట్ర అందుకు అంగీక‌రిస్తేనే ఆచ‌ర‌ణ‌లో అది సాధ్యం. మ‌నం మ‌న ప్ర‌యోజ‌నాలు చూసుకున్న‌ట్లుగానే, అక్క‌డి నాయ‌క‌త్వం కూడా ఆ రాష్ర్ట ప్ర‌యోజ‌నాలు చూసుకుంటద‌న్న‌ది వాస్త‌వం కాదా?కేంద్రంలోనూ, రాష్ట్రంలోనే కాకుండా జ‌ల‌వివాదం ఉన్న మ‌హ‌రాష్ట్ర‌లోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాలుగు ద‌శాబ్ధాలుగా ఉన్న స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌కుండా…  అధికార ప‌గ్గాలు చేప‌ట్టిడ‌న రెండేళ్ల‌లోనే కొలిక్కి తీసుకువ‌స్తే విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించ‌డం నైతిక‌త అనిపించుకోదు. ఆ మాటకొస్తే ఈ విష‌యంలో ప్ర‌జ‌ల ముందు మొద‌టి ముద్దాయి కాంగ్రెస్‌. ప్ర‌తి సంద‌ర్భంలో తెలంగాణ ప‌ట్ల ప్ర‌తికూల వైఖ‌రితో వ్య‌వ‌హ‌రించే తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక‌త కోల్పోయింది.  ప‌్ర‌జ‌ల భావోధ్వేగాల‌తో కూడిన ఆకాంక్ష‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌ను మ‌హారాష్ట్ర‌కు తాక‌ట్టు పెట్టిన‌ట్లుగా వ్యాఖ్యానించ‌డం అర్థ‌ర‌హితం. 152 మీట‌ర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి స‌సేమిరా అంగీక‌రించేది లేద‌ని ఎగువ రాష్ట్ర‌మైన మ‌హారాష్ర్ట అప్ప‌టి ముక్య‌మంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ రాత‌పూర్వ‌కంగా అభ్యంత‌రం చెప్పిన‌ప్ప‌టికీ,  ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను ఏలిన సీమాంధ్ర పాల‌కులు ల‌క్ష్య‌పెట్ట‌కుండా పెండింగ్ ప్రాజెక్టుల జాబితాలో ప‌డేలా చేసింది తెలియ‌నిది కాదు. సీమాంధ్ర పాల‌కులు పాటించిన కుట్ర‌పూరిత వైఖ‌రి కార‌ణంగానే 1975 త‌ర్వాత మొద‌లు పెట్టిన ఏ ఒక్క తెలంగాణ సాగునీటి ప్రాజెక్టు పూర్తి కాలేద‌న్న‌ది అక్ష‌ర స‌త్యం. ఇదే మ‌హారాష్ట్రతో 1975 అక్టోబ‌ర్‌6న ఉమ్మ‌డి ఆంధ్ర్ర‌ప‌దేశ్ ప్ర‌భుత్వం మ‌ధ్య లెండి, లోయ‌ర్‌పెన్ గంగ‌, ప్రాణ‌హిత ప్రాజెక్టుల‌పై లాంఛ‌న‌ప్రాయ ఒప్పందం చేసుకున్న‌ప్ప‌టికీ ఆ ప్రాజెక్టులు ఎందుకు ముందుకు సాగ‌లేదు? న‌ల్ల‌గొండ జిల్లాలోని ఫ్లోరోసిస్ పీడిత ప్రాంత సాగునీటికి ఉద్దేశించిన శ్రీశైలం ఎడ‌మ గ‌ట్టు కాలువ‌(ఎస్ఎల్బీసీ) న‌ల‌భై ఏళ్లుగా కునారిల్లుతున్న‌దీ అలాంటి కుట్ర‌ల‌తోనే క‌దా. దానికి సంబంధించిన సొరంగం ప‌నులు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పూర్తి చేసేందుకు అత్య‌ధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో కూడిన యంత్రాల‌ని చెప్పి 2006లో ప‌నులు ప్రారంభించి, ప‌నులు మొద‌లైన కొన్ని రోజుల‌కే ఆ యంత్రం సొరంగంలోనే తుప్పు ప‌ట్టేలా చేసిన నిర్వాకం నిజం కాదా?  పొరుగు రాష్ర్టాల‌తో ఉన్న చ‌ర్చ‌లు, సంప్ర‌దింపుల ద్వారా వివాదాల‌ను ప‌రిష్క‌రించుకోవ‌డం ముఖ్య‌మా?   ఏది ఏమైనా స‌రే మ‌నం ప్ర‌తిపాధించిన‌ట్లుగా అంగీక‌రించాల్సిందే, లేకుంటే దేనికైనా సిద్ద‌మే అన్న పంతాలు, ప‌ట్టింపుల‌తో ఘ‌ర్ష‌ణ‌పూరిత‌, ఉద్రిక్త‌త ప‌రిస్థితులు క‌ల్పించుకుని వివాదాలె ఎప్ప‌టికీ ప‌రిష్క‌రించుకోకుండా ఉందామా? అన్నది మ‌న విజ్ఞ‌త‌, నైతిక బాధ్య‌త‌.  ఇలాంటి విష‌యాల్లో రాజ‌కీయ ప‌క్షాలు నిర్మాణాత్మ‌క పాత్ర పోషించాల‌ని నిత్య‌చైత‌న్య‌శీలురైన తెలంగాణ ప్ర‌జ‌లు ఆశిస్తారు. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌డాన్ని అంగీక‌రించ‌ర‌న్న విష‌యం తెలంగాణ రాష్ట్ర సాధ‌న ఉద్య‌మ స‌మ‌యంలో అనేక సంద‌ర్భాల్లో తేలిపోయింది. అందుకే తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌కు కేసీఆర్ ప్ర‌తీక అయ్యారు.

కేసీఆర్ ఇప్పుడు చేయాల్సింద‌ల్లా ఒక్క‌టే-  ఆయ‌న ప‌ట్ల తెలంగాణ స‌గ‌టు స‌మాజంలో న‌మ్మ‌కం, విశ్వాసం ఉన్న‌ది. ఆయ‌న సంక‌ల్ప‌మే… తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఒక భ‌రోసా. కాబ‌ట్టి ఏ సంక‌ల్పంతోనైతే ఈ ఒప్పందానికి ముందుకు సాగాడో,  అదే స్ఫూర్తి, ప‌ట్టుద‌లతో ఆటంకాల‌న్నింటినీ అధిగ‌మించి నిర్దేశిత వ్య‌వ‌ధిలోఈ ప్రాజెక్టుల‌ను పూర్తి చేయాలి.  గోదావ‌రి నీటితో ల‌క్ష‌లాది తెలంగాణ మాగాణి పారుతుంది. క‌రువు, కాట‌కాల‌తో నెర్రెలు బారిన తెలంగాణ నేల పుల‌కిస్తుంది. తెలంగాణ రాష్ట్ర సాధ‌న సార్థ‌క‌త ఒన‌గూరుతుంది.

***

ప‌ల్లె ర‌వి కుమార్‌

ఉపాధ్య‌క్షుడు, తెలంగాణ జ‌ర్న‌లిస్టుల ఫోర‌మ్‌

email: palleravi@live.com

స‌స్య‌శ్యామ‌ల తెలంగాణ‌..! -ప‌ల్లె ర‌వి కుమార్‌

స‌ముద్రంలో వృథాగా క‌లిసిపోతున్న వేలాది టీఎంసీల గోదావ‌రి జ‌లాల‌ను వినియోగించుకోవ‌డం కోసం తెలంగాణ ప్ర‌భుత్వం మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవ‌డం ఒక చారిత్రాత్మ‌కం. రెండు రాష్ట్రాల ఆధునిక చ‌రిత్ర‌లో ఇదొక మ‌హ‌త్త‌ర ఘ‌ట్టం. ఐదున్న‌ర ద‌శాబ్ధాలుగా సాగిన తీవ్ర నిర్ల‌క్ష్యం, అణ‌చివేత‌, దోపిడి, వివ‌క్ష‌ల మూలంగా తెలంగాణ సాగునీటి రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్ట‌బ‌డింది. దీనికి తోడుగా నిత్యం క‌రువు, కాట‌కాలు.. ప‌ర్య‌వ‌సానంగా అప్పులు, ఆత్మ‌హ‌త్య‌ల‌తో రైతాంగం త‌ల్ల‌డిల్లుతున్న‌ది. ఈ నేప‌థ్యంలో పొరుగు రాష్ట్రాల‌తో ఘ‌ర్ష‌ణాత్మ‌క వైఖ‌రి విడ‌నాడి, ప‌ర‌స్ప‌ర స‌హ‌కార దోర‌ణితో చ‌ర్చ‌లు-సంప్ర‌దింపుల ద్వారా వివాదాల‌ను ప‌రిష్క‌రించుకోవ‌డం ప్ర‌తిపాదిత సాగునీటి ప్రాజెక్టులను స‌త్వ‌ర‌మే పూర్తి చేసుకోవ‌డానికి మార్గం సుగ‌మం చేసింది. నెర్రెలు బారిన తెలంగాణ బీడు భూముల‌ను స‌స్య‌శ్యామ‌లం చేసేందుకు, సాగునీటి రంగం ద‌శ‌-దిశ‌ను మార్చే అపురూప‌మైన ఘ‌ట్టం మార్చి8న ముంబై వేదిక‌గా ఆవిష్కృత‌మైంది. నీటికోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా సుదీర్ఘ పోరాటాలు జ‌రుగుతున్న ఈ రోజుల్లో రెండు రాష్ట్రాలు… చ‌ర్చ‌లు, సంప్ర‌దింపుల ద్వారా సామ‌ర‌స్య‌పూర్వ‌క వాతావ‌ర‌ణంలో ఒప్పందం కుదుర్చుకోవ‌డం ముమ్మాటికీ అద్వితీయ‌మే. త‌న రాజ‌కీయ చ‌తుర‌త‌తో దేశంలో 36 రాజ‌కీయ పార్టీల‌ను ఒప్పించి, ఆరు ద‌శాబ్ధాలుగా అవిశ్రాంతంగా పోరాడుతున్న కోట్లాది మంది తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను సాకారం చేసిన ఉద్య‌మ నేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు గారు- ఒక ముఖ్య‌మంత్రిగా పొరుగున ఉన్న రెండు రాష్ట్రాల మ‌ధ్య స్నేహ‌పూర్వ‌క సంబంధాల‌ను సునాయ‌సంగా నెల‌కొల్ప‌గ‌లిగారు. దీంతో మ‌హారాష్ట్ర‌, తెలంగాణల మ‌ధ్య ఎన్నో ఏళ్లుగా నెల‌కొన్న‌జ‌ల‌వివాదం సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించుకున్న‌ట్ల‌యింది. ఈ విష‌యంలో ప‌ట్టువిడుపుల‌తో వ్య‌వ‌హ‌రించి మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఒప్పించ‌డంలో కేసీఆర్ ప్ర‌ద‌ర్శించిన రాజ‌నీతిజ్ఞ‌త గొప్ప‌ది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తెలంగాణ‌లో గోదావ‌రి న‌దిపై ప్ర‌తిపాదించిన ప్రాణ‌హిత‌-చేవెళ్ల ప్రాజెక్టుకు వ్య‌తిరేకంగా… అప్ప‌టి మ‌హారాష్ట్ర ప్ర‌తిప‌క్ష నేత‌గా ఆందోళ‌న చేసిన ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి ఫ‌డ్న‌వీస్ స్వ‌యంగా ”మా అభ్యంత‌రాల‌న్నింటినీ కేసీఆర్ గారు క‌న్విన్స్ చేసి మ‌మ్మ‌ల్ని ఒప్పించారు” అని చెప్ప‌డం దాన్ని తెలియ‌జేస్తున్న‌ది. ఉద్య‌మ నాయ‌కుడు ప‌రిపాల‌కుడైతే ఎలా ఉంటుంద‌న్న విష‌యం దీన్ని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు.

రెండు రాష్ట్రాల‌కు మేలు చేసే విధంగా జ‌రిగిన ఈ తాజా ఒప్పందం ప్ర‌కారం… తెలంగాణ ప్ర‌భుత్వం- లోయ‌ర్ పెన్‌గంగ ప్రాజెక్టులో భాగంగా చ‌నాకా-ప్రాణ‌హిత‌, కొరాట‌, కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహ‌ట్టి, మేడిగ‌డ్డ‌ల వ‌ద్ద బ్యారేజీలు, అదేవిధంగా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం- లోయ‌ర్ పెన్‌గంగ ప్రాజెక్టులో భాగంగా రాజ‌పేట్‌, పెన్‌ప‌హ‌డ్ ల వ‌ద్ద బ్యారేజీలు నిర్మించుకుంటాయి.ఈ ఒప్పందం వ‌ల్ల రెండు రాష్ట్రాల దుర్భిక్ష ప్రాంతాలు గోదావ‌రి జ‌లాల‌తో స‌స్య‌శ్యామ‌లం కాబోతున్నాయి. ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేసుకున్న‌ట్ల‌యితే ఉత్త‌ర తెలంగాణతో పాటు కృష్ణా న‌ది ప‌రివాహ‌క ప్రాంతంలోని ద‌క్షిణ తెలంగాణ జిల్లాల‌కు సైతం గోదావ‌రి జ‌లాల‌ను ఇవ్వ‌వ‌చ్చు.

పంతాలు, ప‌ట్టింపుల‌కు పోయినందు వ‌ల్లే కృష్ణా, గోదావ‌రి న‌దుల‌పై తెలంగాణ కోసం ప్ర‌తిపాదించిన ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులుగానే మిగిలిపోయాయి. ఏ న‌ది ప‌రివాహ‌క ప్రాంతం కూడా ఒక్క రాష్ట్రానికే ప‌రిమితం కాక‌పోవ‌డ‌మే అందుకు కార‌ణం. ఒక్కో న‌ది రెండు, మూడు రాష్ట్రాల గుండా ప్ర‌వ‌హిస్తుండ‌టం మూలంగా ఆ న‌ది జ‌లాల‌పై ఆయా రాష్ట్రాల‌కు హ‌క్కులు సంక్ర‌మిస్తాయి. అలాగే తెలంగాణ‌లో ప్ర‌ధానంగా ఉన్న‌- కృష్ణా న‌ది జ‌లాల‌ను ఎగువ‌న ఉన్న క‌ర్నాట‌క‌, దిగువ‌న ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంతో క‌లిసి పంచుకోవాలి. గోదావ‌రి న‌ది జ‌లాల‌ను ఎగువ‌న ఉన్న మ‌హారాష్ట్ర‌, చ‌త్తీష్‌గ‌ఢ్‌, దిగువ‌న ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ల‌తో పంచుకోవాలి. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం విష‌యంలో పొరుగు రాష్ట్రాల‌తో నీటి పంపిణీ స‌మ‌స్య ఒక్క‌టే కాదు, ప్రాజెక్టుల నిర్మాణం వ‌ల్ల పొరుగు రాష్ట్రానికి చెందిన భూముల ముంపు స‌మ‌స్య కూడా. ఈ రెండు అంశాల‌ను ఆస‌రాగా చేసుకున్న ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాల‌కు నాయ‌క‌త్వం వ‌హించిన సీమాంధ్ర‌,పెద్ద‌లు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విష‌యంలో కుట్ర‌పూరితంగా వ్య‌వ‌హ‌రించార‌న‌డం అక్ష‌ర‌స‌త్యం. పొరుగు రాష్ట్రాలైన మ‌హారాష్ట్ర‌, క‌ర్నాట‌క‌, చత్తీష్‌గ‌ఢ్‌ల‌తో సామ‌ర‌స్య‌పూర్వ‌కంగా కాకుండా- నీటి వాటా విష‌యంలోనైనా లేదా భూముల ముంపు విష‌యంలోనైనా వివాదాలు త‌లెత్తేట‌ట్లుగా తెలంగాణ ప్రాజెక్టుల డిజైన్లు ప్ర‌తిపాదించి ఏండ్ల త‌ర‌బ‌డిగా అవి పూర్తికాకుండా వ్య‌వ‌హ‌రించార‌న్న‌ది చారిత్మ‌క వాస్త‌వం. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి స‌రిహ‌ద్దుల్లో ఉండే తెలంగాణ ప్రాజెక్టుల విష‌యంలో పొరుగు రాష్ట్రాల‌తో త‌లెత్తే వివాదాలు చ‌ర్చ‌లు, సంప్ర‌దింపుల ద్వారా సామ‌ర‌స్య‌పూర్వ‌కంగా ప‌రిష్క‌రించుకుని ప్ర‌తిపాదిత ప్రాజెక్టులు స‌త్వ‌ర‌మే పూర్తి చేసే ప్ర‌య‌త్నం చేయ‌క‌పోగా, వివాదాల‌ను మ‌రింత జ‌ఠిలం చేసేందుకు ఘ‌ర్ష‌ణ‌పూరిత వాతావ‌ర‌ణం నెల‌కొనేట‌ట్లు ఉద్దేశ్య‌పూర్వ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. అందుకు అనుగుణంగా వంత పాడేందుకు సీమాంధ్ర పెద్ద‌లు తెలంగాణ‌లో త‌మ తాబేదార్ల‌ను త‌యారుచేసుకున్నారు. ఫ‌లితంగా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎగువ‌న‌, పొరుగు రాష్ట్రాల‌కు స‌రిహ‌ద్దుల్లో ఉన్న తెలంగాణ ప్రాంతంలో కృష్ణా, గోదావరి న‌దుల‌పై ప్ర‌తిపాదిత ఏ ఒక్క ప్రాజెక్టు కూడా స‌వ్యంగా ముందుకు సాగ‌కుండా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. దాంతో తెలంగాణ‌కు దిగువ‌న ఉన్న సీమాంధ్ర ప్రాజెక్టులకు కృష్ణా, గోదావ‌రి జ‌లాల‌ను య‌ధేచ్ఛ‌గా త‌ర‌లించుకుపోగ‌లిగారు. ఫ‌లితంగా నాలుగు ద‌శాబ్ధాలుగా తెలంగాణ‌లో ప్ర‌తిపాదిత సాగునీటి ప్రాజెక్టుల‌న్నీ పెండింగ్ ప్రాజెక్టులుగానే మిగిలిపోయాయి. చిన్న‌పాటి ముంపు స‌మ‌స్య‌తో కృష్ణా న‌దిపై జూరాల ఇందిరా ప్రియ‌ద‌ర్శిని ప్రాజెక్టు ద‌శాబ్ధాలుగా నిర్దేశిత ల‌క్ష్యానికి అనుగుణంగా పూర్తికాలేదు. గోదావ‌రి న‌దిపై ద‌శాబ్ధాల క్రితం ప్ర‌తిపాదించిన ప్రాణహిత‌, ఇచ్చంప‌ల్లి, ఎల్లంప‌ల్లి ప్రాజెక్టుల‌కు ఇంకా ఒక రూపం కూడా రాలేదు. కానీ అదేస‌మ‌యంలో సీమాంధ్ర‌కు సంబంధించిన ప్రాజెక్టులు, అక్ర‌మ ప్రాజెక్టులు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పూర్త‌య్యాయి. ప‌ర్య‌వ‌సానంగా బ‌చావ‌త్ ట్రిబ్యున‌ల్ కృష్ణా జ‌లాల్లో తెలంగాణ‌కు కేటాయించిన 299 టీఎంసీలు, గోదావ‌రి న‌దీ జ‌లాల్లో కేటాయించిన 950టీఎంసీల జ‌లాల్లో స‌గం కూడా వినియోగానికి రాలేదు. ఫ‌లితంగా తెలంగాణ‌లో 2కోట్ల 67ల‌క్ష‌ల ఎక‌రాల విస్తీర్ణంలో భూమి ఉండ‌గా- అందులో సాగుయోగ్యమైన భూమి 1కోటి 67ల‌క్ష‌ల ఎక‌రాలు, అందులో ప్రాజెక్టుల కింద కేవ‌లం 17ల‌క్ష‌ల ఎక‌రాలు, 40ల‌క్ష‌ల ఎక‌రాలు బావులు, బోరుబావులు కింద సాగ‌వుతున్న‌ది. మిగిలిన దాంట్లో రైతాంగానికి వ‌ర్షాధార‌మే కావ‌డంతో- వ‌ర్షాభావ ప‌రిస్థితులు నెల‌కొన్న‌ట్ల‌యితే రైతాంగం అత‌లాకుత‌లం కావ‌డం అనివార్య‌మైపోయింది. ప‌ర్య‌వ‌సానంగా తెలంగాణ‌లో శాశ్వ‌తంగా దుర్భిక్ష ప‌రిస్థితులు, ఫ్లోరైడ్‌, వెన‌క‌బాటు త‌నం, రైతుల ఆత్మ‌హ‌త్య‌లు.

ఇదిలా ఉండ‌గా మ‌రోవైపున గోదావ‌రి జ‌లాల్లో తెలంగాణ‌కు 950టీఎంసీలు కేటాయిస్తే, ఇప్ప‌టివ‌ర‌కు 350టీఎంసీల‌కు మించి వాడుకోలేదు. స‌గ‌టున ప్ర‌తియేటా 2,423టీఎంసీల గోదావ‌రి జ‌లాలు వృథాగా స‌ముద్రంలో క‌లుస్తున్న‌ట్లు గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి. ఇంత‌కాలంగా తెలంగాణ ప్రాజెక్టుల ప‌ట్ల సీమాంధ్ర పాల‌కులు కుట్ర‌పూరితంగా వ్య‌వ‌హ‌రించిన వైఖ‌రే ఈ దుస్థితికి కార‌ణం. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ద‌శాబ్ధాలుగా కుట్ర‌లు, కుతంత్రాలకు బ‌లైన తెలంగాణ ప్రాజెక్టులు స్వీయ రాజ‌కీయ అస్థిత్వం, స్వీయ ప‌రిపాల‌న‌లోనూ విముక్తికి నోచుకోవ‌ద్దా? కుట్ర‌పూరిత వ్యూహాల నుంచి బ‌య‌ట‌ప‌డి స‌త్వ‌ర‌మే పూర్తి కావ‌ద్దా? ఇంకా సీమాంధ్ర నేత‌ల క‌నుస‌న్న‌ల్లోనే తెలంగాణ ప్రాజెక్టులు కునారిల్లాల్సిందేనా? ఏళ్ల త‌ర‌బ‌డి సీమాంధ్ర పెద్ద‌ల దుర్భుద్ధిని చేధించి ‘బ‌తుకుదాం-బ‌త‌క‌నిద్దాం’ అన్న నినాదంతో పొరుగు రాష్ట్రాల‌తో స్నేహ‌పూర్వ‌క సంబంధాల‌ను నెలకొల్పారు. రాజ‌కీయ పంతాలు, ప‌ట్టింపులకు పోకుండా విజ్ఞ‌త‌, బాధ్య‌త‌తో వ్య‌వ‌హ‌రించి 156 మీట‌ర్ల ఎత్తుకు బ‌దులుగా, మ‌హారాష్ర్ట ప్ర‌భుత్వం కోరిన‌ట్లుగా 148మీట‌ర్ల ఎత్తుకు అంగీక‌రించ‌డం ఒక సాహ‌సోపేతం నిర్ణ‌యం. ఆ ఒప్పందంపై తెలంగాణ ముఖ్య‌మంత్రిగా సంత‌కం చేసిన‌ప్ప‌టికీ- ప‌దిహేనేళ్లుగా కోట్లాది మంది ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల నుంచి ఎదిగొచ్చిన ఉద్య‌మ నేత‌గా, తెలంగాణ క‌న్నీటి ఆర్థ్ర‌త, గుండె త‌డి తెలిసిన కేసీఆర్ గా ఆ నిర్ణ‌యం తీసుకోగ‌లిగారు. త‌న ప్ర‌జ‌ల‌ను మెప్పించుకోగ‌ల‌న‌న్న అచంఛ‌ల విశ్వాస‌మే ఆయ‌న‌తో ఆ ప‌ని చేయించింది. అందుకే ఆ ఒప్పందంపై కాంగ్రెస్‌, తెలుగు దేశం పార్టీ నేత‌ల వాద‌న‌ల‌ను తెలంగాణ ప్ర‌జానీకం ప‌ట్టించుకునే స్థితిలో లేదు.

ఇక ఇప్పుడు చేయాల్సింద‌ల్లా ఒక్క‌టే- ఏ ల‌క్ష్యంతోనైతే ఈ సాహ‌సోపేత ఒప్పందానికి ముందుకు సాగాడ, కేసీఆర్ అదే స్ఫూర్తి, ప‌ట్టుద‌లతో రెండుమూడేళ్ల‌లో ఈ ప్రాజెక్టుల‌ను పూర్తి చేయ‌గ‌లిగిన‌ట్ల‌యితే గోదావ‌రి నీటితో ల‌క్ష‌లాది తెలంగాణ మాగాణి పారుతుంది. క‌రువు, కాట‌కాల‌తో నెర్రెలు బారిన తెలంగాణ నేల పుల‌కిస్తుంది. అపుడు తెలంగాణ ప్ర‌తి గుండె గొంతుక ”సుజ‌లాం… సుఫ‌లాం… తెలంగాణ స‌స్య‌శ్యామ‌లాం…” అని ప‌లుకుతుంది.
***

 

ప‌ల్లె ర‌వి కుమార్‌
ఉపాధ్య‌క్షుడు, తెలంగాణ జ‌ర్న‌లిస్టుల ఫోర‌మ్‌
Ph:+91-8008001233; email: palleravi@live.com

హైద‌రాబాద్‌పై పెత్త‌నం కోస‌మే ‘సెక్ష‌న్‌-8’ -ప‌ల్లె ర‌వి కుమార్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్ట శాస‌న స‌భ ఈ నెల 16వ తేదీన 17 తీర్మానాల‌ను ఆమోదించింది. అందులో ప్ర‌ధానంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌కు ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉన్న హైద‌రాబాద్ న‌గ‌రం(గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌-జిహెచ్ఎంసీ) ప‌రిధిలో శాంతిభ‌ద్ర‌త‌ల ప‌ర్య‌వేక్ష‌ణ అధికారం రెండు రాష్ట్రాల‌కు ఉమ్మ‌డిగా ఉన్న గ‌వ‌ర్న‌ర్ కు అప్ప‌గిస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టం-2014లో పొందుప‌ర్చిన సెక్ష‌న్‌-8 ప్ర‌యోగించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరుతూ తీర్మానం. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం, అక్క‌డి రాజ‌కీయ పార్టీల పెద్ద‌లు తెలంగాణ రాష్ట్రం బిల్లు ఆమోదించిన‌ప్ప‌టి నుంచి ప‌లు సంద‌ర్భాల్లో సెక్ష‌న్‌-8 అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తున్న‌ప్ప‌టికీ, ఈసారి ఏకంగా ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయ‌డంతో ‘సెక్షన్‌-8’ మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ప‌దేప‌దే ఈ అంశం ఎందుకు తెరమీదికొస్తున్న‌ది? ఇంత‌కు సెక్ష‌న్‌-8 చెబుతున్న‌దేమిటి?  దాన్ని ప్ర‌యోగించాల్సినంత ప‌రిస్థితులు నెల‌కొన్నాయా?  శాంతి భ‌ద్ర‌త‌లు అంత‌గా దిగ‌జార‌న‌పుడు ఈ అంశం ప‌దేప‌దే తెర మీద‌కు తీసుకురావ‌డంలో ఆంత‌ర్య‌మేమిటి?  అంత విప‌త్క‌ర ప‌రిస్థితులు ఉన్న‌ట్ల‌యితే సెక్ష‌న్‌-8 ఎందుకు అమ‌లు చేయ‌ట్లేదు? త‌దిత‌ర అంశాల‌పై ఒక‌సారి చ‌ర్చించుకోవాల్సిన సంద‌ర్భ‌మిది. అన్నింటికంటే ముందుగా అస‌లు సెక్ష‌న్‌-8 ఏం చెబుతున్న‌దో తెలుసుకోవ‌డం మ‌రీ ముఖ్యం.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు చేయ‌డానికి సంబంధించి భార‌త పార్ల‌మెంట్ రూపొందించిన ‘ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టం-2014’-  12 భాగాలు, 13 షెడ్యూళ్లుగా పొందుప‌ర్చ‌బ‌డింది. ఒక్కో భాగం, ఒక్కో షెడ్యూల్ ఒక్కో అంశంపై స్ప‌ష్టంగా తెలియ‌జేసింది. అందులోని రెండో భాగం(పార్టు-2)లోని ప‌లు సెక్ష‌న్లు- రెండు రాష్ట్రాల భౌగోళిక స‌రిహ‌ద్దులు, ప‌రిధులు, రాజ‌ధాని, ప‌దేళ్ల పాటు హైద‌రాబాద్ న‌గ‌రం ఇరు రాష్ట్రాల‌కు ఉమ్మ‌డి రాజ‌ధాని కొన‌సాగ‌డం, త‌దిత‌ర అంశాల‌ను తెలియ‌జేస్తాయి. సుదీర్ఘ పోరాటం నేప‌థ్యంలో నెల‌కొన్న తీవ్ర ఉద్విగ్న‌భ‌రిత ప‌రిస్థ‌తులు, అనేక ప్ర‌తికూల‌త‌ల మ‌ధ్య తెలంగాణ రాష్ట్రం ఆవిర్భ‌వించ‌డ‌మే గాకుండా… భౌగోళికంగా, రాజ‌కీయంగా తెలంగాణ ప‌రిధిలో ఉన్నహైద‌రాబాద్ న‌గ‌రం ప‌దేళ్ల పాటు ఉమ్మ‌డి రాజ‌ధానిగా కొన‌సాగుతున్నందున‌, ఏదైన ప్ర‌తికూల ప‌రిస్థితులు ఉత్ప‌న్న‌మైన‌ట్ల‌యితే ఎలా అన్న దానిపై పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టంలోనే కొన్ని ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగింది. దాన్ని తెలియ‌జేసేది సెక్ష‌న్‌-8.  ”ఉమ్మ‌డి రాజ‌ధాని న‌గ‌రంలో నివ‌శించే పౌరుల జీవ‌నం, స్వేచ్ఛ‌కు భంగం వాటిల్ల‌కుండా భ‌ద్ర‌త క‌ల్పించే ప్ర‌త్యేక బాధ్య‌త గ‌వ‌ర్న‌ర్‌ది. ఉమ్మ‌డి రాజ‌ధానిలో శాంతి భ‌ద్ర‌త‌లు, అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌, కీల‌క సంస్థల భ‌ద్ర‌త‌, ప్ర‌భుత్వ‌, ప్ర‌భుత్వరంగ సంస్థ‌ల కార్యాల‌యాలు, ఆస్తుల భ‌ద్ర‌త‌కు ముప్పు వాటిల్లే ప‌రిస్థ‌తులు నెల‌కొన్న‌ట్ల‌యితే ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ తెలంగాణ రాష్ట్ర మంత్రి మండ‌లిని సంప్ర‌దించిన త‌ర్వాత తాను ఒక నిర్ణ‌యానికి వ‌చ్చి త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాలి. ఈ విష‌యంలో గ‌వ‌ర్న‌ర్‌కు స‌హ‌క‌రించ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం ఇద్ద‌రు స‌ల‌హాదారుల‌ను నియ‌మిస్తుంది. ఉమ్మ‌డి రాజ‌ధాని న‌గ‌రంలో క్షీణించిన శాంతిభ‌ద్ర‌త‌ల‌ను చ‌క్క‌బెట్టేందుకు త‌న విచ‌క్ష‌ణాధికారంతో గ‌వ‌ర్న‌ర్ తీసుకునేది తుది నిర్ణ‌యం. దాన్ని ప్ర‌శ్నించే అధికారం ఎవ‌రికీ లేదు” అని పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టం-2014లోని రెండో భాగంలోని సెక్ష‌న్‌-8 స్ప‌ష్టంగా తెలియ‌జేస్తున్న‌ది.

 

ఉమ్మ‌డి రాజ‌ధాని న‌గ‌రంలో శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిస్థితి పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టంలోని ‘సెక్షన్‍-8’ ను ప్ర‌యోగించాల్సినంత స్థాయికి దిగ‌జారి పోయాయా? ప్ర‌జ‌లు ఎన్నుకున్న ప్ర‌జాస్వామ్య ప్ర‌భుత్వాన్ని కాద‌ని, కేంద్ర ప్ర‌భుత్వం జోక్యం చేసుకుని హైద‌రాబాద్ న‌గ‌రంలోని శాంతిభ‌ద్ర‌త‌ల ప్ర‌త్య‌క్ష ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త గ‌వ‌ర్న‌ర్‌కు క‌ట్ట‌బెట్టాల్సినంత ప్ర‌తికూల ప‌రిస్థితులు నెల‌కొన్నాయా? వాస్త‌వ ప‌రిస్థితుల‌ను విశ్లేషించుకుంటే- తెలంగాణ రాష్ట్రం ఆవిర్భ‌వించిన జూన్‌2, 2014 నుంచి నేటి వ‌ర‌కు అంటే గ‌డ‌చిన 22 నెల‌ల కాలంగా ఉమ్మ‌డి రాజ‌ధాని న‌గ‌రంలో ఏ ఒక్క చిన్న విధ్వేష‌పూరిత సంఘ‌ట‌న చోటు చేసుకోలేదు. న‌గ‌రంలో నివ‌శిస్తున్న ఇరు రాష్ట్రాల ప్ర‌జ‌ల మ‌ధ్య క‌నీసంగా ఘ‌ర్ష‌ణ‌పూరిత వాతావ‌ర‌ణం చోటుచేసుకున్న సంద‌ర్భ‌మూ లేదు. పైగా శాంతిభ‌ద్ర‌త‌లు పూర్తిస్థాయిలో సంతృప్తిగా ఉన్నాయ‌ని స్వ‌యంగా కేంద్ర ప్ర‌భుత్వ హోం శాఖ తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగాన్ని ప్ర‌శంసించింది కూడా. అలాంట‌పుడు ‘సెక్షన్‍-8’ ప్ర‌యోగించాల‌ని కోరుతూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ తీర్మానం చేయ‌డంలో ఆంత‌ర్య‌మేమిటి? ఆరు ద‌శాబ్ధాలుగా హైద‌రాబాద్ కేంద్రంగా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలంగాణ‌లోని స‌మ‌స్త వ‌న‌రుల‌పై నిరాటంకంగా సాగించిన దోపిడీ ఆగిపోవ‌డ‌మే ఈ అక్క‌సుకు కార‌ణం కాదా? ఇంకా ఏదో కార‌ణంగా హైద‌రాబాద్ పై పెత్త‌నం చ‌లాయించాల‌నే కుతంత్రంతోనే ఈ తీర్మానం. శాంతిభ‌ద్ర‌త‌ల‌కు ఎలాంటి విఘాతం క‌లిగిన దాఖ‌లాలు లేక‌పోయిన‌ప్ప‌టికీ ‘సెక్షన్‍-8’ అమ‌లుకోసం ఏకంగా ఆ రాష్ట్ర శాస‌న‌స‌భ‌లోనే తీర్మానం చేయ‌డ‌మంటే భార‌త పార్ల‌మెంట్ చేసిన ‘ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టం-2014స ను అప‌హాస్యం చేయ‌డ‌మే.

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన మొద‌ట్లో నెల‌కొన్న ఉధ్విగ్న‌భ‌రిత ప‌రిస్థితుల నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లో స్థిర‌ప‌డిన వివిధ వ‌ర్గాల సీమాంధ్ర ప్ర‌జ‌ల్లో కొంత‌మేర‌కు భ‌యాన‌క‌, సందేహాస్ప‌ద ప‌రిస్థితులు నెల‌కొన్న మాట నిజం. కాని ‘రెండు రాష్ట్రాలుగా విడిపోదాం‍-ప్ర‌జ‌లుగా క‌లిసి ఉందాం’ అని ఉద్య‌మ స‌మ‌యంలో తెలంగాణ ఉద్య‌మ‌కారులిచ్చిన నినాదాన్ని తెలంగాణ స‌మాజం దాదాపు రెండేండ్ల కాలంలో ఆచ‌ర‌ణ‌లో చూపింది. ముక్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేక‌ర్ రావు గారు అనుస‌రించిన వైఖ‌రి అందుకు ఎంత‌గానో దోహ‌ద‌పడింది. ఫ‌లితంగా ఉమ్మ‌డి రాజ‌ధాని న‌గ‌రంలో స్థిర‌ప‌డిన‌, నివ‌శిస్తున్న సీమాంధ్ర‌, ఇత‌ర రాష్ట్రాలు, తెలంగాణ ప్ర‌జ‌ల మ‌ధ్య సుహృద్భావ‌, సామ‌ర‌స్య‌పూర్వ‌క వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇటీవ‌ల జ‌రిగిన గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిపిల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో న‌గ‌ర‌వాసులు ప్రాంతాల‌క‌తీతంగా తెలంగాణ ప్రభుత్వంపై సంపూర్ణ విశ్వాసం, న‌మ్మ‌కం ప్ర‌క‌టించారు. అధికార టీఆర్ఎస్ కు ఏక‌ప‌క్షంగా ప‌ట్టం క‌ట్ట‌డమే దాన్ని తేట‌తెల్లం చేసింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ తీర్మానం చేయ‌డం కంటే ముందు తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ పార్టీలు గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌ను క‌లిసి హైద‌రాబాద్ న‌గ‌రంలో సెక్షన్‍-8 అమ‌లుచేయాల‌ని విన‌తిప‌త్రం ఇవ్వ‌డాన్నితెలంగాణ ప్ర‌జ‌లు ప‌ట్టించుకోనూ లేదు. వాస్తవంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో నివ‌శించే సీమాంధ్ర ప్ర‌జలు, ఉద్యోగులతో పాటు సీమాంధ్ర‌కు చెందిన వ్య‌క్తుల వ్యాపార‌, వాణిజ్య‌, పారిశ్రామిక సంస్థ‌లు, ఆస్తుల ప‌రిర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త‌కు ర‌క్ష‌ణ క‌వ‌చంలాంటి ‘సెక్షన్‍-8’ను సీమాంధ్ర రాజ‌కీయ నాయ‌కులు త‌మ రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకోవ‌డానికి రొటీన్ పొలిటిక‌ల్ డిమాండ్‌గా మారుస్తున్నారు. దీనివ‌ల్ల న‌ష్ట‌పోయేది సీమాంధ్ర ప్ర‌జ‌లు అన్న‌ది గుర్తెర‌గాలి. దీన్ని ప‌దేప‌దే వివాదాస్ప‌ద అంశంగా మార్చ‌డం వ‌ల్ల హైద‌రాబాద్‌లో నెల‌కొన్న సామ‌ర‌స్య‌, స్నేహ‌పూర్వ‌క వాతావ‌ర‌ణం తొల‌గిపోయి ఘ‌ర్ష‌ణ‌పూరిత ప‌రిస్థితులు చోటుచేసుకునే అవ‌కాశముంది. నిజంగా ఆ ప‌రిస్థితి త‌లెత్తితే అప్ప‌టికే చీటికిమాటికి తెర మీదికి వ‌చ్చిపోయి ఉంట‌ది కాబ‌ట్టి ఎవ‌రూ దాన్ని సీరియ‌స్‌గా తీసుకోకుండా న‌మ్మ‌నిస్థితి వ‌స్తుంద‌ని గ్ర‌హించాలి.
ఒక‌వైపున తెలంగాణ ముక్య‌మంత్రి కేసీఆర్ పంతాలు, ప‌ట్టింపుల‌కు పోకుండా తానే చొర‌వ తీసుకుని చ‌ర్చ‌లు, సంప్ర‌దింపుల ద్వారా పొరుగు రాష్ట్రాల‌తో స్నేహ‌పూర్వ‌క సంబంధాలు నెల‌కొల్పుకుంటూ, వివాదాలు ప‌రిష్క‌రించుకుంటూ ముందుకు సాగుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో- ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముక్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అందుకు భిన్నంగా అన‌వ‌స‌ర ఘ‌ర్ష‌ణ‌పూరిత వాతావ‌ర‌ణం సృష్టించుకుంటున్నాడు. అది ఆయ‌న‌కు గానీ, ఆయ‌న ప్ర‌భుత్వానికి గానీ, హైద‌రాబాద్‌లోని సీమాంధ్ర ప్ర‌జ‌ల‌కు, వారి సంస్థ‌ల‌కు ఏ మాత్రం శ్రేయ‌స్క‌రం కాద‌ని గుర్తించాలి. మూస ఆలోచ‌నా దోర‌ణి మార్చుకోవాలి. ఇంకా చెప్పాలంటే- ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చొర‌వ తీసుకుని తెలంగాణ ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు, సంప్ర‌దింపుల ద్వారా ప‌రిష్క‌రించుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణా, గోదావ‌రి జ‌లాల పంపిణీ-వాటిపై ప్ర‌తిపాదిత ప్రాజెక్టులు పూర్తిచేసుకోవ‌డం… ప‌లు విద్యా సంబంధ వివాదాలు ప‌రిష్క‌రించుకోవ‌డం… ఇంకా ఉమ్మ‌డిగా ఉన్న ప్ర‌భుత్వ‌రంగ సంస్థ‌ల విభ‌జ‌న‌, వాటి ఆస్తుల పంప‌కాలు, త‌దిత‌ర అంశాల‌ను సామ‌ర‌స్య‌పూర్వ‌క వాతావ‌ర‌ణంలో ప‌రిష్క‌రించుకోవ‌డం ప్ర‌స్తుతానికే కాదు దీర్ఘ‌కాలిక‌ ప్ర‌యోజ‌నాల దృష్ట్యా ఇరు రాష్ట్రాల‌కు అవ‌స‌రం. దాన్ని ప‌క్క‌న‌బెట్టి పొరుగు రాష్ట్ర వ్య‌వ‌హారాల్లో చీటికిమాటికి జోక్యం చేసుకోవ‌డం ఆ రాష్ట్ర విస్తృత ప్ర‌యోజ‌నాల దృష్ట్యా అంత శ్రేయ‌స్క‌రం కాదు.

 

ప‌ల్లె ర‌వి కుమార్‌
ఉపాధ్య‌క్షుడు, తెలంగాణ జ‌ర్న‌లిస్టుల ఫోర‌మ్‌
email: palleravi@live.com

 

1948, సెప్టెంబ‌ర్‌17… చ‌రిత్ర‌లో ఒక పుట * నిరంకుశ రాచ‌రిక‌పాల‌న‌పై సామాన్యుడి దండ‌యాత్ర‌

1948, సెప్టెంబ‌ర్‌17… చ‌రిత్ర‌లో ఒక పుట * నిరంకుశ రాచ‌రిక‌పాల‌న‌పై సామాన్యుడి దండ‌యాత్ర‌

అది మట్టి మనుషుల పోరాటం… అస‌హాయుల‌చే ఆయుధాలు ప‌ట్ట్టించిన మ‌హ‌త్త‌ర స‌మ‌రాంగ‌ణం… ప్ర‌పంచ చ‌రిత్ర‌లో సామాన్యుడు కేంధ్రంగా సాగిన విప్ల‌వ పోరాటం…భూమికోసం, భుక్తికోసం, స్వేచ్ఛ‌కోసం మ‌ట్టి మ‌నిషి మ‌ర‌ఫిరంగై పేలిన వీరోచిత పోరాట‌గాథ‌…ప్ర‌పంచ విప్ల‌వోద్య‌మాల చ‌రిత్ర‌లో చెద‌ర‌ని నెత్తుటి చ‌రిత్ర‌… పాల‌కులు ప్ర‌జాకంఠ‌కులైతే ఎంత‌టివారైనా ప‌త‌నం త‌ప్ప‌ద‌ని చాటిచెప్పిన అస‌మాన పోరు… మ‌నిషిని మ‌నిషిగా చూడ‌ని గ‌డీల కిరాత‌క దొర‌త‌నాన్ని స‌మాధి చేసిన సాయుధ స‌మ‌రం… నిరంకుశ‌ నిజాం రాజ్యాన్ని నేలమట్టం చేసిన ఒక మ‌హా యుద్దం. వెట్టిచాకిరి, క‌ట్టు బానిసత్వానికి బలైపోయిన వెట్టి జీవుల తిరుగుబాటు. మనిషిని మనిషిగా గౌరవించే సంస్కృతిని స్వప్నించి… సామాన్య‌ జనం నడిపిన అసామాన్య విప్లవం. బాంచన్ దొర.. కాల్మొ.క్త అన్న గొంతుకలే, ఆయుధ‌మందుకొని భూస్వామ్య దొరతనం, పెత్తందారీ వ్య‌వ‌స్థ‌ పునాదులను పెకిలించిన పోరాటం తెలంగాణ రైతాంగా సాయుధ పోరాటం.
1948, సెప్టెంబర్ 17…
ఇది క్యాలండ‌ర్‌లో ఒక తేదీ మాత్ర‌మే కాదు… ప్రపంచ చరిత్రలో చెరగని అధ్యాయం… సామాన్యులు చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసిన రోజు… ప్ర‌పంచ విప్ల‌వ పోరాటాల‌న్నింటికీ ఒక స్ఫూర్తి, ప్రేర‌ణ‌- తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. వీర తెలంగాణ విప్లవ పోరాటం. సెప్టెంబర్ 17 ను గుర్తుచేసుకుంటే ఎన్నో పోరాటాలు కళ్లముందు కదులుతాయి. మరెన్నో దారుణాలు గుర్తుకొస్తాయి. వ‌రంగ‌ల్ జిల్లా బైరాన్‌ప‌ల్లి, న‌ల్ల‌గొండ జిల్లా గుండ్రాంప‌ల్లి నెత్తుటి పొత్తిళ్లు… ఎందరో యోథుల వీర‌గాథ‌లు గుర్తుకొస్తాయి. తెలంగాణ ఏ ప‌ల్లెను, ఏ గ‌డ‌ప‌ను తాకినా ఉసిల్ల పుట్ట‌లా క‌దిలే రోమాంచిత‌ జ్ఞాప‌కాలు… దశాబ్దాలుగా స్వేచ్ఛా, స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఉద్యమాల పురిటిగ‌డ్డ తెలంగాణ- ధిక్కారం, సాహ‌సం, త్యాగం, పోరాట స్ఫూర్తి, చైత‌న్యం గుర్తుకొస్తుంది. అన్నింటికీ మించి- వ్య‌వ‌స్థ పునాదులు పెకులుతున్నాయంటే పాల‌కుడు(ఏ రూపంలో ఉన్న‌ప్ప‌టికీ) ఏ ప‌క్షం వ‌హిస్తాడో సామాన్యుడికి తెలిసొచ్చిన రోజు.

హైదరాబాద్ సంస్థానం… 1712-1948 నిజాం రాచ‌రికం.
1948 ముందు వరకూ హైద‌రాబాద్‌ సంస్ధానాన్ని ప్రత్యేక దేశంగా పరిగణించేవారు. దీన్నే తెలంగాణ, హైదారాబాద్ రాష్ట్రం అని కూడా పిలిచేవాళ్ళు. 1712 నుంచి 1948 సెప్టెంబ‌ర్ 17వ తేదీ వ‌ర‌కు సుమారు రెండు వంద‌ల సంవ‌త్స‌రాల పాటు నిజాం న‌వాబుల ఏలుబ‌డిలో ఉంది. హైదరాబాద్ సంస్థానం పరిధిలో 16 పరగణాలుండేవి. భాషా ప్రాతిపదికన ఈ పదహారు జిల్లాలను మూడు ప్రాంతాలుగా విభజించి పాలించేది నైజాం సర్కార్. తెలుగు వాళ్లకు 8 జిల్లాలు… మరాఠీలకు 5 జిల్లాలు… కన్నడిగులకు 3 జిల్లాలుండేవి. తమ‌ పాలన కొనసాగిస్తూనే నిజాం ప్రభువు బ్రిటీష్ వారికి సామంతుడిగా వ్యవహరించేవారు. నిజాం రాచ‌రిక పాలనలో- గ్రామాలన్నీ భూస్వాములు, పెత్తందార్లు, పటేల్లు, పట్వారీలు, దేశ్‌ముఖ్‌ల ఆధీనంలో ఉండేవి. తెలంగాణలోని 10 వేల గ్రామాల్లో సుమారు 3 వేల గ్రామాలు నిజాం జాగీరు గ్రామాలే. జాగిరంటే సొంత ఆస్థి అని. మిగతావి జమీన్ దార్, పటేల్, పట్వారీల ఆధీనంలో ఉండేవి. వీళ్లంతా నిజాం ప్రభువుకు గ్రామాల్లో తొత్తులుగా వ్యవహరించే వాళ్లు. ప్రజలకు నిజాం పై కన్నా ఈ దొర‌లు, భూస్వాములు, పెత్తందార్ల అరాచ‌కాలు, దౌర్జ‌న్యాల మీద‌నే ఎక్కువ వ్య‌తిరేక‌త‌, క‌సి ఉండేది. అధికారం, అహంకారం క‌లిస్తే అరాచ‌క‌మే. స‌రిగ్గా నిజాం రాచ‌రిక పాల‌న‌లో అదే జ‌రిగింది.
గోళ్లూడ‌గొట్టి… 90 రకాల ప‌న్నులు వ‌సూలు.
త‌మ విలాసాలు, భోగ‌బాగ్యాల కోసం ప్ర‌తిదానిపై ప‌న్ను విధించేవారు. పుట్టుకకు పన్ను, చావుకు పన్ను. ఏ వేడుకైనా… వేదనకైనా…పన్ను కట్టాల్సిందే. చెల్లించే ప‌రిస్థితులు, స్తోమ‌త‌ లేకున్నా ప్ర‌జ‌ల గోళ్లూడ‌గొట్టి ప‌న్నులు వ‌సూలు చేసేవారు. మనుషులన్న ఒక్క గుర్తింపు తప్ప… బతుకు దుర్భరంగా సాగే రోజులవి. శ్రమ దోపిడీ, ఆర్థిక దోపిడీ, వెట్టి చాకిరీ, అణ‌చివేత‌. అలాంటి పరిస్థితుల్లో… ఆలోచనలే ఆయుధాలయ్యాయి. పోతే ప్రాణాలు… వస్తే స్వాతంత్ర్యం అన్న ఒకే ఒక్క నినాదంతో రజాకార్లకు, జమీందార్లకు, ప‌టేల్‌-పట్వారీలకు ఎదురు తిరిగాయి తెలంగాణ గ్రామాలు.

దండుక‌ట్టి దండ‌యాత్ర చేసిన సామాన్యుడు…
సామాన్యుల బ‌తుకుల‌తో దొర‌లు, పెత్తందార్లు, భూస్వాములు, ప‌టేల్‌, ప‌ట్వారీలు, దేశ్‌ముఖ్‌లు నెత్తుటి ఆట ఆడారు. అరాచ‌కం రాజ్య‌మేలింది. దీనికి తోడుగా నాగువ‌డ్డీ వ్యాపారం, అది క‌ట్ట‌లేక‌పోతే త‌ర‌త‌రాలుగా వెట్టిచాకిరి, క‌ట్టుబానిస‌త్వం… వ్య‌తిరేకంగా తెలంగాణ‌లో ఎక్క‌డిక‌క్క‌డే పోరాటాలు మొద‌ల‌య్యాయి. 1946 నాటికి తెలంగాణ ఒక అగ్నిగుండంగా మారింది. నాటి న‌ల్ల‌గొండ జిల్లా జ‌న‌గామ తాలూకాలోని విసునూర్ జాగీర్దారు విసునూరు రామ‌చంద్రా రెడ్డి అరాచాకాల‌పై సామాన్యులు దండుక‌ట్టారు. రెచ్చిపోయిన ఆయ‌న గుండాలు 1946 జూలై4న విచ‌క్ష‌ణార‌హితంగా జ‌రిపిన కాల్పుల్లో దొడ్డి కొముర‌య్య నెల‌కొరిగాడు. ఈ సంఘ‌ట‌న‌తో అప్ప‌టివ‌ర‌కు ఎక్క‌డిక‌క్క‌డ పాయ‌లుపాయ‌లుగా సాగుతున్న పోరాటం సాయుధ పోరాట రూపం తీసుకున్న‌ది. ఖిలా వ‌రంగ‌ల్‌లో కొద‌మ సంహంలా ర‌జాకార్ల‌తో వీరోచిత పోరాటం చేసి నెల‌కొరిగిన బ‌త్తిని మొగిల‌య్య గౌడ్ సంఘ‌ట‌న‌తో తెలంగాణ సామాన్యుడి గుండె ప్ర‌తీకార జ్వాల‌తో ర‌గిలిపోయింది. `భూమికోసం.. భుక్తికోసం.. విముక్తికోసం…` అన్న నినాదంతో 1947సెప్టెంబ‌ర్‌11న రావి నారాయ‌ణ రెడ్డి, మ‌ద్ధం ఎల్లారెడ్డి, మ‌గ్దూం మెహియుద్దీన్ త‌దిత‌ర క‌మ్యూనిస్టు నాయ‌కులు రైతాంగ సాయుధ పోరాటానికి అధికారికంగా పిలుపునిచ్చారు. ఫ్యూడ‌లిజం, భూస్వాముల అరాచ‌కాలు, అకృత్యాల‌కు వ్య‌తిరేకంగా గ్రామ‌గ్రామాన అగ్నిపూల‌ను పూయించారు క‌మ్యూనిస్టులు. కార్చిచ్చులా వ్యాపించిన పోరాటం తెలంగాణ ప్ర‌తి అంగుళాన్ని ఉద్య‌మ‌ప‌థంలో న‌డిపించింది. `దున్నేవాడికే భూమి` అన్న ర‌ణ‌న్నినాదంతో గ‌ర్జించిన తెలంగాణ ప్ర‌పంచ విప్ల‌వాల‌కు కొత్త పాఠాలు నేర్పింది.

ఎంద‌రో యోధులు…

నిజాం నిరంకుశ పాలన నుంచి స్వేచ్ఛ‌, స్వాతంత్ర్యం కోసం సామన్య జనం తిరగబడి… ` మ‌న కోసం-మ‌న భావిత‌రాల కోసం` అంటూ తెలంగాణ స‌మాజాన్నిముందుకు న‌డిపించారు. మహిళలు సైతం బంధూకులు పట్టి పోరాడిన మహాత్తర ఘట్టం అది. ఈ పోరాటానికి క‌మ్యూనిస్టుల నేతృత్వంలోని ఆంధ్రమహాసభ నాయ‌క‌త్వం వ‌హించింది. బ‌త్తిని మొగిల‌య్య గౌడ్‌, షేక్ బంద‌గీ, దొడ్డి కొముర‌య్య‌, తానూ నాయ‌క్‌, రావి నారాయ‌ణ రెడ్డి, బ‌ద్ధం ఎల్లా రెడ్డి, భీంరెడ్డి న‌ర్సింహ రెడ్డి, ఆరుట్ల రాంచంద్రా రెడ్డి, ఆరుట్ల క‌మ‌లాదేవి, బొమ్మ‌గాని ధ‌ర్మ‌భిక్షం, న‌ల్ల న‌ర్సింహులు, మ‌ల్లు స్వ‌రాజ్యం….ఇలాంటి ఎంద‌రో నేతాజీలు, భ‌గ‌త్ సింగ్‌లు, అల్లూరి సీతారామ రాజులు, చెగువేరాలు ఈ మ‌హ‌త్త‌ర పోరాటంలో ప్ర‌జ‌ల‌ను న‌డిపించారు, 1946 నుంచి 1951 వరకు మహోద్యమంగా జరిగిన ఈ పోరాటంలో నాలుగువేల మందికి పైగా యోధులు నెల‌కొరిగారు…ఉద్య‌మ‌క్ర‌మంలో వ‌రంగ‌ల్ జిల్లా బైరాన్ ప‌ల్లి, ప‌ర‌కాల‌, న‌ల్ల‌గొండ జిల్లా గుండ్రాంప‌ల్లి లాంటి ఎన్నో చోట్ల జ‌రిగిన ఊచ‌కోత ఆనాటి అరాచ‌కాల‌కు సాక్షిబూతాలుగా నిలిచాయి. మూడు వేల గ్రామాల్లో ప్ర‌జా ప్ర‌భుత్వాలు ఏర్ప‌డ్డాయి. ఆ గ్రామ క‌మిటీల సార‌థ్యంలో భూమిలేని నిరుపేద‌ల‌కు ప‌ది ల‌క్ష‌ల భూమి పంపిణీ జ‌రిగింది. నిజానికి 1947 ఆగస్టు 15న దేశానికి విముక్తి లభించింది. కాని తెలంగాణలో నిజాం ర‌క్క‌సి మూక‌లు, పెత్తందార్ల‌, భూస్వాములు, దొర‌ల అరాచ‌కాలు, దాష్టీకం కొన‌సాగుతూనే ఉన్న‌ది. దానికి వ్య‌తిరేకంగా క‌మ్యూనిస్టులు 1947సెప్టెంబ‌ర్ 11న సాయుధ‌పోరాటానికి పిలుపునివ్వ‌డంతో తెలంగాణవ్యాప్తంగా గెరిల్లా ద‌ళాల స‌హ‌కారంతో గ్రామ క‌మిటీలు దొర‌లు, పెత్తందార్లు, జాగీర్థార్ల‌ను గ్రామాల నుంచి త‌రిమికొట్ట‌డంతో ప‌ట్ట‌ణాల‌కు పారిపోయి.. నిజాం న‌వాబును ఆశ్ర‌యించారు. రెండు శ‌తాబ్దాల త‌మ పాల‌న‌కు అంతిమ గ‌డియ‌లు స‌మీపించాయ‌న్న‌ది గ్ర‌హించిన ఏడో నిజాం న‌వాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌.. ఉత్తుంగ‌త‌రంగంలా లేచిన రైతాంగ సాయుధ పోరాటం నుంచి త‌న‌ను, త‌న తాబేధార్ల‌యిన దొర‌లు, భూస్వాములు, జాగీర్థార్ల‌ను ర‌క్షించుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ముందు మోక‌రిల్లాడు. భార‌త్‌కు స్వాతంత్ర్యం వ‌చ్చిన‌ప్ప‌టికీ హైద‌రాబాద్ సంస్థ నిరంకుశ నిజాం పాల‌న ప్ర‌జ‌ల‌తో నెత్తుటి ఆట ఆడుతుంటే పెద్ద‌గా ప‌ట్టించుకోని యూనియ‌న్ ప్ర‌భుత్వ పెద్ద‌లు… రెండున్న‌ర శ‌తాబ్దాల నిజాం రాచ‌రికానికి, ఆయ‌న తాబేధార్ల అకృత్యాల‌కు మ‌హ‌త్త‌ర రైతాంగ సాయుధ పోరులో ప్ర‌జ‌లు స‌మాధి క‌ట్టే అంతిమ గ‌డియ‌ల్లో- నాటి ఉపప్రధాని, కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జ‌న‌ర‌ల్ చౌద‌రి ఆధ్వ‌ర్యంలో 1948 సెప్టెంబ‌ర్ 12న `ఆప‌రేష‌న్ పోలో` పేరిట సైనిక చ‌ర్య ప్రారంభించారు… అంటే 1948 సెప్టెంబర్ 17(అంటే భార‌త్‌కు స్వాతంత్యం సిద్ధించిన 13నెల‌ల రెండురోజుల‌కు) నిజాం న‌వాబు వ‌ల్ల‌బాయ్ ప‌టేల్ ముందు లొంగిపోయారు. హైద‌రాబాద్ సంస్థానం భార‌త యూనియ‌న్‌లో విలీన‌మైంది హైదరాబాద్ స్టేట్. కేంద్ర ప్ర‌భుత్వ సైనిక చ‌ర్య‌తో తిర‌గ‌బ‌డి ప్ర‌జ‌ల నుంచి నిజాం న‌వాబుకు, పెత్తందార్ల‌కు విమోచ‌న ల‌భించ‌డ‌మే కాదు, భార‌త ప్ర‌భుత్వం నిజాం న‌వాబును రాజప్ర‌ముఖ్‌(1948 నుంచి 1956వ‌ర‌కు)గా నియ‌మించింది. 1956 న‌వంబ‌ర్ ఒక‌టో తేదీన ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఏర్ప‌డి, గ‌వ‌ర్న‌ర్ నియ‌మితులయ్యే వ‌ర‌కు ఆయ‌న రాజ‌ప్ర‌ముఖ్‌గా కొన‌సాగాడు ఏడో నిజాం- మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌. కానీ ఉద్య‌మించిన ప్ర‌జ‌ల ఊచ‌కోత కొన‌సాగింది. దాంతో రైతాంగ ఉద్య‌మ ఉధృతిలో గ‌ఢీలు వ‌దిలి ప‌ట్నాల‌కు పారిపోయిన దొర‌లు, భూస్వాములు, జాగీర్థార్లు పోలీసుల అండ‌తో మ‌ళ్లీ గ‌ఢీల‌కొచ్చారు.

చ‌రిత్ర‌లో ద‌క్క‌ని స‌ముచిత‌ స్థానం…
ప్ర‌పంచంలోని ఎన్నో విముక్తి పోరాటాలు, విప్ల‌వాలు, ఉద్య‌మాల‌కు స్ఫూర్తిగా. ప్రేర‌ణ‌గా నిలిచిన ఇంత‌టి మ‌హ‌త్త‌ర పోరాటానికి దేశ చరిత్రలో ద‌క్కాల్సిన గౌర‌వం, స్థానం ద‌క్క‌లేదు. ప్ర‌పంచ ఉద్య‌మాల గ‌తిని మార్చిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆన‌వాళ్లుగానీ, ఒక స్మృతి చిహ్నం కూడా ఎక్క‌డా లేక‌పోవ‌డమే పాల‌కులు ఏపాటి బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించారో వెల్ల‌డిస్తున్న‌ది. ఎంద‌రో వీరుల త్యాగ‌ఫ‌లంగా స్వేచ్ఛావాయువులు పీల్చిన తెలంగాణ‌కు… ప్ర‌జ‌లు గ్రామాల నుంచి త‌రిమితే ప‌ట్నాలు, న‌గ‌రాలకు పారిపోయిన దొర‌లు, భూస్వామ‌లు, పెత్తందార్లే రంగు, రూపు, టోపీ మార్చి పాల‌కులుగా రావ‌డ‌మే ఈ దుస్థితికి కార‌ణం. అందుకే ఆరున్న‌ర ద‌శాబ్దాల త‌ర్వాత కూడా సెప్టెంబ‌ర్ 17, 1948… విభిన్న‌వాద‌న‌లు ఉన్నాయి. కొందరు దీన్నివిలీన దిన‌మ‌ని… మరికొందరు విమోచ‌న దిన‌మ‌ని… ఇంకొందరు విద్రోహ దిన‌మ‌ని… ఎవరి వాదన ఏదైనా… ఈ రోజుకు వెన‌కా, ముందున్న అస‌మాన చ‌రిత్ర‌ను ఎవరూ కాదన లేనిది. తెలంగాణ నేల‌ దాస్య శృంఖలాల విముక్తి కోసం సాగిన మహాయుద్ధంలో నేల‌కొరిగిన వేలాది మంది అమ‌రవీరులను స్మ‌రించుకోవాల్సిన రోజు… త‌ర‌త‌రాలుగా సాగిన నిజాం రాక్ష‌స పాల‌న‌ను అంత‌మొందించిన రోజు… మాన‌వ‌జాతి వికాసం కోసం జ‌రిగే ప్ర‌జాపోరాటాల చ‌రిత్ర‌ను రాగ‌ధ్వేషాల‌కు అతీతంగా భావిత‌రాల‌కు అందించాల‌ని ప్ర‌జాస్వామ్య పాల‌కుల‌కే కాదు చ‌రిత్ర‌కారుల బాధ్య‌త‌నూ గుర్తు చేసే రోజు… తెలంగాణ చ‌రిత్ర‌లోనే కాదు ప్ర‌పంచ‌ చరిత్రలోనే ఈ రోజు ఓ ప్రత్యేక పుట‌.
ఎందరెందరో త్యాగధనులకు… అలాంటి మ‌హ‌నీయుల పురిటిగడ్డకు… వంద‌నం.

***

ప‌ల్లె ర‌వి కుమార్‌

ఉపాధ్య‌క్షుడు, తెలంగాణ జ‌ర్న‌లిస్టుల ఫోర‌మ్‌(టీజేఎఫ్‌)

email: palleravi@live.com